
మాట్లాడుతున్న గోవర్ధన్
- న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్
తిరుమలాయపాలెం:
తెలంగాణలో అత్యధికంగా ఆదివాసీలు నివసించే ఆరు జిల్లాలను ఆదివాసీ జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్ధన్ డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో గిరిజనులకు, ఆదివాసీలకు కల్పించిన హక్కులను కాపాడాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గల షెడ్యూల్ ప్రాంతాన్ని ముక్కలు చెయ్యకుండా ఇల్లెందు, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాలను ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం జిల్లాలను ఏర్పాటు చెయడం దారుణమన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడుని కేంద్రంగా చేస్తూ మండల కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలన్నారు.
నకిలీలతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి..
మూడు జిల్లాల్లో నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నకిలీ విత్తనాలు అంటగట్టిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ఎం.గిరి జిల్లా నాయకులు తిమ్మిడి హన్మంతరావు, తాత సత్యనారాయణ, లెనిన్, తిమ్మిడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.