
కృష్ణా పుష్కరాల్లో మరో అపశ్రుతి
విజయవాడ: కృష్ణా పుష్కరాలలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి పవిత్ర సంఘం ఘాట్ వద్ద ఫిట్స్ వచ్చి ఓ యవకుడు నీళ్లలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని దగ్గరోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు కాసేపటికే మృతి చెందాడు. మృతుడు ఏ కొండూరు మండలం కంబంపాడు గ్రామానికి చెందిన పి. యశ్వంత్గా గుర్తించారు.
మరోవైపు విజయవాడ దుర్గా ఘాట్ వద్ద పాము కలకలం రేపింది. పుష్కర స్నానం చేస్తుండగా సుమంత్ అనే బాలుడిని పాము కాటు వేసింది. ఈ విషయాన్ని గమనించిన అతడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గజ ఈతగాళ్లు పామును పట్టుకున్నారు.
అలాగే గుంటూరు జిల్లా అమరావతిలో విషాదం నెలకొంది. పుష్కర స్నానానికి వచ్చిన రమేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కారు పార్క్ చేస్తుండగా అస్వస్థతకు గురైన అతడు...అక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ఘటనలో పుణ్య స్నానం ఆచరించడానికి వచ్చిన మహిళ గుండెపోటుకు గురై మృతిచెందింది. కృష్ణాజిల్లా తమిడిముక్కల మండలం ఐనపూరు ఘాట్‌లో సోమవారం శకుంతల(65) అనే మహిళ స్నానం చేయడానికి వచ్చింది. పుష్కర స్నానం చేస్తున్న సమయంలో గుండె పోటు వచ్చి అక్కడికక్కడే కుప్ప కూలింది.