కోడ్‌కు పాతర
రెసిడెన్సియల్ కాలేజీ ప్రిన్సిపాళ్లు,
అధ్యాపకులతో మంత్రి రావెల సమావేశం
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన
- మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాం..
కాబట్టి మాకు సహకరించాలని పిలుపు
- టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం
- జిల్లాలో చర్చనీయాంశంగా మారిన అధికార పార్టీ తీరు
అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. కింది స్థాయి నుంచి మంత్రుల వరకు గెలుపే ధ్యేయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడ చూసినా అధికార పార్టీకి సంబంధించిన పోస్టర్లు దర్శనమిస్తుండగా.. నాయకులు నేరుగా రంగంలోకి దిగి కోడ్‌కు పాతరేయడం చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు సిటీ: ఓటమి భయం అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రులే స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. శనివారం సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు కర్నూలులో పర్యటించారు. సాయంత్రం గాయత్రి ఎస్టేట్‌లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కేజే రెడ్డి కార్యాలయం నాల్గవ అంతస్తులో ఆల్ సర్వీస్ అసోసియేషన్స్ మీట్ ఫర్ స్ట్రెంతెనింగ్ ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీస్ పేరిట సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రెసిడెన్సియల్ టీచర్లు, అధ్యాపకులు రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోటు బడ్జెట్‌లో ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని.. రాత్రి, పగలు కష్టపడి పని చేస్తున్న సీఎంకు కృతజ్ఞతగా టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కేజే రెడ్డి, బచ్చల పుల్లయ్యలను గెలిపించాలని ఉద్యోగులను కోరారు. మీ సమస్యలు ఎన్నో పరిష్కారం చేశామని.. మరిన్ని హాస్టళ్లను రెసిడెన్సియల్ స్కూళ్లుగా మార్చనున్నామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా మీతో మాట్లాడుతారు, వారు మీకు హామీలు ఇస్తారన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఎన్నో రోజులుగా పెండింగ్‌లోని సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఉద్యోగులతో కలిసి మంత్రి ఫొటోలు దిగడం గమనార్హం. కొంత మంది మాత్రం ఎన్నికల కోడ్ ఉన్నా ఉద్యోగులతో సమావేశం నిర్వహించి బలవంతంగా రావాలని ఒత్తిడి చేయడంతో వచ్చామని చర్చించుకోవడం కనిపించింది. మీడియా వాళ్లు వీడియో, ఫొటోలు తీస్తే ఇబ్బందులు వస్తాయని తెలుసుకున్న కొంత మంది అక్కడ నుంచి భోజనాలు చేయకుండానే వెళ్లిపోయారు. ఇదిలాఉంటే మంత్రి వెళ్లిపోతున్న సమయంలో కొందరు ఉద్యోగులు కారెక్కించి పంపడం కొసమెరుపు.