అక్షయకు సపర్యలు చేస్తున్న తల్లిదండ్రులు
♦ మెదడు, నరాల వ్యాధితో మంచానికే పరిమితమైన బాలిక
♦ పేదింట పెద్ద కష్టం.. ఆపరేషన్‌కు రూ.5లక్షలు అవసరం
♦ దాతలు దయతలిస్తే బాలికకు దక్కనున్న ప్రాణభిక్ష
ఆడుతూ.. పాడుతూ గంతులేయాల్సిన బిడ్డ.. మంచానికి పరిమితవై..తనంతట తాను తినలేని, కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. చూస్తే.. రెండేళ్ల చిన్నారిలా కనిపిస్తున్నా..పదకొండేళ్లంటే ఆశ్చర్యపోవాల్సిందే. రెక్కలకష్టం మీద బతుకుతున్న తల్లిదండ్రులు ఏళ్లుగా ఎదుగుదల లేని కూతుర్ని చూసి కుమిలిపోతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిప్పి అలసి..ఆపరేషన్‌కు లక్షలు సమకూర్చలేక విలవిల్లాడుతున్నారు. దాతలు దయతలిచి ఆపన్నహస్తం అందిస్తే..చిన్నారి కోలుకుంటుందని, ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.
ముదిగొండ: వెంకటాపురం గ్రామానికి చెందిన గంటా నాగేశ్వరరావు, రాణి దంపతుల కూతురు అక్షయ మెదడు, నరాల సంబంధిత వ్యాధితో అవస్థ పడుతోంది. 2005లో పాప జన్మించగా..మహాలక్ష్మి పుట్టిందని తల్లిదండ్రులు ఆనందపడ్డారు. కానీ..సంవత్సరం గడిచినా హుషారుగా కనిపించకపోవడంతో..ఆస్పత్రుల్లో చూయించగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. ఖమ్మం, హైదరాబాద్, విజయవాడలోని పలు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించారు. నరాల వ్యాధి కూడా ఉందని, అందుకే ఎదుగుదల నిలుస్తోందని వైద్యులు తేల్చారు. నరాల వ్యాధితో కాళ్లు, చేతుల్లో బలం లేక నిలబడం, కూర్చోవడం కూడా సాధ్యం కావడం లేదు. చిన్నతనం నుంచి మంచానికే పరిమితమైంది. అప్పుసప్పు చేసి ఇప్పటికే వైద్యఖర్చుల కోసం రూ.4లక్షల వరకు ఖర్చు పెట్టామని, తమకు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి ఖర్చులు, కుటుంబ భారంతో సతమతమవుతున్నామని, ఆపరేషన్‌కు డబ్బుల్లేవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేషన్‌కు రూ.5లక్షలు అవసరం..
బాలిక తండ్రి గంటా నాగేశ్వరరావు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వచ్చే జీతం కుటుంబ పోషణకే సరిపోతోంది. తల్లి కూలినాలి పనులకు పోతూ, బిడ్డ బాగోగులు చూసుకుంటోంది. పని చేసుకోకుంటేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉన్నా..బిడ్డను ఒంటరిగా వదిలేయలేక చాలాసార్లు ఆ అమ్మ..అమ్మాయి కళ్లేదుటే ఉంటోంది. తోటి పిల్లలు చెంగుచెంగునా తిరుగుతూ, అల్లరి చేస్తుంటే..నా చిట్టితల్లి ఎటూ కదల్లేక పోతోందని రోదిస్తోంది. తల్లిదండ్రులు మూడు నెలలకోమారు మందులకు రూ.25వేలు ఖర్చు చేస్తూ..రోజూ అన్నం ముద్దలు తినిపిస్తూ, స్నానం చేయిస్తూ అన్నీతామై..బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. బెంగళూరులో ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారని, ఆపరేషన్‌కు రూ.5లక్షలు అవసరమని, దాతలు ఆర్థికసాయం చేసి ఆదుకుంటే..చిన్నారి కోలుకుంటుందని వారు వేడుకుంటున్నారు.
ఆర్థికసాయం చేయాలనుకుంటే..
గంటా నాగేశ్వరరావు, వెంకటాపురం.
బ్యాంక్ ఎకౌంట్: 30642939898
సెల్ నంబర్ : 96030 45263