జూట్ మిల్లుపై ఇకపై పోరాటం
Published Tue, Jul 19 2016 9:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
జూట్‌మిల్లు పరిరక్షణ కమిటీ నిర్ణయం
పట్నంబజారు : కడుపులు కాలుతున్నా.. వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నా.. పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న భజరంగ్ జూట్ మిల్లు యాజమాన్యంపై అమీతుమీ తేల్చుకునేందుకు జూట్ మిల్లు పరిరక్షణ సమితి సన్నద్ధమైంది. ఈ నెల 26వ తేదీ జరిగే చర్చల్లో యాజమాన్యం భాగస్వామ్యం కాకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టేందుకు తీర్మానించింది. అరండల్‌పేటలోని స్ఫూర్తి కార్యాలయంలో మంగళవారం జూట్ మిల్లు పరిరక్షణ సమితి నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ యాజమాన్యం చర్చలకు రాకుండా అధికారులు ఎన్ని సమావేశాలు నిర్వహిస్తే మాత్రం ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా మిల్లును లాకౌట్ చేసిన యాజమాన్యంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లాకౌట్ చేసి ఏడాది గడుస్తున్నా.. కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, అధికారుల తీరు సరికాదని ధ్వజమెత్తారు. 2,478 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులకు యాజమాన్యం తెలిపిందన్నారు. మిల్లు నష్టాల్లో ఉన్నట్లు ప్రభుత్వానికి లెక్కలు, లేఖలు ద్వారా ఏ రోజైనా.. సమాచారం అందించారా? అని ప్రశ్నించారు. మిల్లు లాకౌట్ చేసే నాటికి అన్ని లెక్కలు పరిశీలిస్తే నష్టాల్లో ఉందా? లేక లాభాల్లో నడుస్తోందా అర్థమవుతుందని పేర్కొన్నారు. ఇక ఆలోచించేది ఏమీ లేదని.. నేరుగా పోరుబాట తప్పదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కార్మికుల జీవితాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కార్మికులకు పని కల్పించటం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకువచ్చి ఇబ్బడిముబ్బడిగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన చంద్రబాబు సర్కార్, ఉన్న పరిశ్రమలు మూత పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో పరిరక్షణ సమితి సభ్యులు కోటా మాల్యాద్రి, ఎన్.భావన్నారాయణ, ఎబ్బూరి పాండురంగ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement