అగ్రిమెంట్ చేసినా పన్ను చెల్లించాల్సిందే
అగ్రిమెంట్ చేసినా పన్ను చెల్లించాల్సిందే
Published Sun, May 7 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM
- ఆస్తుల క్రయవిక్రయాలపై ఫల్గుణకుమార్
- చాంబర్ కామర్స్‌లో అవగాహన కార్యక్రమం
కర్నూలు(హాస్పిటల్): ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తేనే బదలాయించినట్లు కాదని, కొంత ప్రతిఫలం తీసుకుని అగ్రిమెంట్ రాసుకున్నా అమ్మకంగా భావించి ఆదాయం పన్ను విధిస్తారని సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ మాజీ చైర్మన్(చెన్నై), చార్టెడ్ అకౌంటెంట్ ఈ. ఫల్గుణకుమార్ చెప్పారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కర్నూలు బ్రాంచ్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ జి. శేషాచలం ఆధ్వర్యంలో స్తిరాస్తి కొనుగోలు, అమ్మకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫల్గుణకుమార్ మాట్లాడుతూ స్తిరాస్తిని వ్యాపారం కోసం కొంటే అతని ఖర్చుగా కాకుండా ఆదాయంగా పరిగణిస్తారన్నారు. ఆస్తిని ప్రభుత్వ విలువ కన్నా తక్కువకు అమ్మినా, కొన్నా ఆ వ్యత్యాసం కూడా అతని ఆదాయం కిందనే చూపుతారన్నారు.
స్తిరాస్తి కొనుగోలు విలువ రూ.50లక్షలు దాటితే, ప్రతి చెల్లింపులో 1 శాతం ఆదాయం పన్ను మినహాయించుకుని, ప్రత్యేక చలానా ద్వారా అమ్మకందారుని పేరుపై చెల్లించాలన్నారు. ఇది అగ్రిమెంట్లకు కూడా వర్తిస్తుందన్నారు. ఇంటి స్థలాన్ని అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం వేరొకరికి అగ్రిమెంట్ రాయిస్తే, ఆ రోజే తన భాగానికి వచ్చే ఇళ్ల కోసం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. తనకున్న భూమిలో ప్లాట్లు వేసి, ఇళ్ల స్థలాలను అమ్మేందుకు ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ తేదీనే అతను సొంత ఆస్తిని వ్యాపార నిమిత్తం బదలాయించినట్లు భావించి పన్ను విధిస్తారన్నారు. కొత్తగా నిర్మించిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నా బాడుగ ఇచ్చినట్లు ఆదాయం పన్ను చెల్లించాలన్నారు. ఆస్తులు కొనేందుకు కావాల్సిన డబ్బు ఎలా వచ్చింది, ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బు ఎలా ఉపయోగించారు అనే ప్రశ్నలకు కూడా ఆదాయపు పన్ను శాఖకు సమాధానమివ్వాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఇకాయ్ కర్నూలు బ్రాంచ్ మాజీ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ కేవీ కృష్ణయ్య, కర్నూలు ట్యాక్స్ బేరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి. బుచ్చన్న, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విజయకుమార్‌రెడ్డి, కార్యదర్శి రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement