టమాటాతో బహుళ ప్రయోజనాలు
కూరల్లో వాడుకునేందుకు ఒప్పులు, పొడి తయారీ
– కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : ధరలు బాగా తగ్గినపుడు టమాటను వృథాగా పారబోయకుండా కూరల్లో వాడుకునేలా ఒప్పులు, పొడిని తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి తెలిపారు. నర్సరీల్లో ఎక్కువ అమ్ముడుబోయే నారుకు సంబంధించి పంట వేసుకోకపోవడం ఉత్తమమన్నారు. ఒకరిని చూసి మరొకరు గుడ్డిగా అధికవిస్తీర్ణంలో సాగు చేయడం వల్ల అందరికీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
జూదంలా మారిన టమోటా :
టమాటా 'అనంత' రైతుల పాలిట జూదంగా పరిణమించింది. ధరలు ఎపుడు పలుకుతాయో ఎపుడు పతనమవుతాయో తెలియకపోవడంతో చాలా సందర్భాల్లో రైతులు దారుణంగా నష్టపోతున్నారు. టమాటా ధరలకు స్థిరత్వం అనేది లేకపోవడంతో పలికితే కిలో రూ.40 నుంచి 60 లేదంటే రూ.4 నుంచి రూ.6కు పడిపోవడం జరుగుతోంది. మరికొన్ని సందర్భాల్లో కిలో రూ.ఒకటి రూ.2 ప్రకారం గిట్టుబాటు కాని పరిస్థితి. పంటకు పెట్టుబడులు అటుంచితే కనీసం పంట కోత, రవాణా చార్జీలు గిట్టుబాటు కాక తోటలు వదిలేసుకునే దుస్థితి నెలకొంది. గిట్టుబాటు కాక మార్కెట్లు, రోడ్డు పక్కన పడేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో జిల్లా రైతులు రూ.కోట్ల రూపాయలు నష్టపోతున్నారు.
ఎక్కువ పంట విస్తీర్ణం :
అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, సరిహద్దు కర్ణాటక ప్రాంతాల్లో టమాటా పంట ఎక్కువగా సాగు చేయడం, పంట దిగుబడి కూడా గణనీయంగా వచ్చింది. అయితే మార్కెట్‌లో ధరలు పతనమై రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ధరల్లో వ్యత్యాసం నియంత్రించేందుకు కృషివిజ్ఞాన కేంద్రం, రెడ్డిపల్లి గృహ విజ్ఞాన విభాగం ఆధ్వర్యంలో టమాటా ఒరుగులు (ఎండు ఒప్పులు), పొడిని (నిల్వ పదార్థాలు) తయారు చేస్తూనే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.
ఒరుగులు, పొడి తయారీ :
టమాటా ఎండు ఒరుగులు, పొడి తయారు చేయడానికి నాణ్యమైన పండిన టమాటాలు సేకరించి, నీటిలో బాగా కడిగి శుభ్రం చేయాలి. ఒక్కో టమాటా నాలుగు నుంచి 8 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ షీట్ మీద వేసి ఎండ బాగా ఉన్నపుడు వారం రోజుల వరకూ ఎండబెట్టాలి. పూర్తిగా ఎండబెట్టిన టమోట ఒరుగులను కొంత పొడి చేసి మరి కొన్ని అలాగే ఒరుగులుగా నిల్వ చేసుకోవచ్చు. గాలి బాగా ప్రసరించే ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ఒక కేజీ తాజా టమాటాల నుంచి 60 గ్రాముల ఒరుగులు తయారవుతాయి. ఇప్పుడున్న వాతావరణానికి అనుగుణంగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఎండబెట్టుకోవాలి. అలా బాగా ఎండేవరకు చేసుకోవాలి.
వినియోగం :
నిల్వ చేసిన ఎండు ఒరుగులను నీటిలో 4 నుంచి 6 గంటల వరకూ నానబెట్టుకోవాలి. బాగా నానిన వాటిని టమాటా తరహాలోనే తయారవుతాయి. అనంతరం వాటిని కూరల్లో వినియోగించుకోవచ్చు. టమాటా పొడిని నేరుగా కూరలోనూ, రసంలోనూ వేసుకోవచ్చు. ఒరుగులతో తయారు చేసిన వంట పదార్థాలు తాజా టమాటాలతో సమానంగా ఉన్నాయని ప్రయోగాత్మకంగా రుజువైంది. నాలుగైదు నెలల పాటు నిల్వ చేసుకుని వినియోగించుకోవచ్చు. తాజా టామాటాల పోషక విలువలు, ఎండబెట్టిన టమాటాల పోషక విలువలు సమానంగా వచ్చాయి. ముఖ్యంగా సూక్ష్మజీవుల ప్రక్రియలు హాని కలిగించే స్థాయి కంటే తక్కువుగా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా ఉండదని తేలింది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది.