ఫర్టిగేషన్‌తో అరటి లాభదాయకం
అనంతపురం అగ్రికల్చర్ : ఎరువులను నీటిలో కరిగించి డ్రిప్ పైపుల ద్వారా సరైన మోతాదులో నేరుగా మొక్కలకు అందిస్తే(ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువుల యాజమాన్యం) అరటితోటల్లో మేలైన దిగుబడులు వస్తాయని ఏపీఎంఐపీ(ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు) ఏపీడీ జి.చంద్రశేఖర్ తెలిపారు. ఇది ఎరువుల వినియోగంలో మంచి సామర్థ్యం గల పద్ధతి అని, దశల వారీగా మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడానికి వీలవుతుందని చెప్పారు. దేశంలో ఏటా రసాయన ఎరువుల వాడకం పెరుగుతున్నప్పటికీ వాటి వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉందన్నారు. అందులో నత్రజని - భాస్వరం - పొటాష్ వరుసగా 40, 20, 50 శాతంగా ఉందన్నారు. ఎరువులను పొలంలో వెదజల్లడం వల్ల మొక్కల మధ్య ఖాళీ స్థలంలో పడి వృథా అవడమే కాకుండా పొలమంతా సమానంగా పడటం లేదని, దీనివల్ల పంట దిగుబడులు తగ్గిపోతున్నాయని తెలిపారు.
ఫర్టిగేషన్ లాభాలు
నీరు, పోషకాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. దిగుబడులు నాణ్యంగా, అధికంగా వస్తాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ పద్ధతిని అవలంభించవచ్చు. పోషకాల అందుబాటు గ్రహణ శక్తి పెరుగుతుంది. మొక్కల వేర్లకు ఎలాంటి హానీ ఉండదు. కూలీలు, సమయం, విద్యుత్ ఆదా అవుతుంది. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా ఉండదు. నేల గట్టిపడదు. నేలలో తేమ, గాలి అనువైన నిష్పత్తిలో ఉంటుంది. ఎరువులకు అయ్యే ఖర్చు సాధారణ సాంప్రదాయ పద్ధతికన్నా తక్కువ. నేల కాలుష్యం కాదు. కూలీల ఆరోగ్యానికి హాని ఉండదు.
ఎకరాకు 1,452 మొక్కలు నాటుకోవాలి
అరటి పిలకలు నాటే సమయంలో 1.5 “ 1.5 “ 1.5 అడుగుల సైజులో గుంతలు తీసుకోవాలి. 5 కిలోల పశువుల ఎరువు, 125 గ్రాముల సూపర్‌పాస్ఫేట్, 500 గ్రాముల వేపపిండి కలిపిన మిశ్రమంతో గుంతను నింపాలి. ఎకరాలో 6 “5 అడుగుల దూరంతో 1,452 మొక్కలు నాటుకోవాలి. మొక్క నాటిన తర్వాత ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువుల యాజమాన్యం కింది విధంగా చేపట్టాలి.