టీకాలతోనే చిటికె వ్యాధి నివారణ
– ఈనెల 25లోగా వినియోగించుకోవాలి
– పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ పద్మావతి
అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెలకు సోకే ముచ్చువ్యాధి (చిటికె వ్యాధి)పై కాపర్లు అప్రమత్తం ఉండాలని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ జి.పద్మావతి తెలిపారు. వర్షాకాలం ప్రారంభంలో కురిసే తొలకర్లకు మొలచిన లేత గడ్డిని తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా జిల్లా అంతటా ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడిక్కడ పశువైద్యాధికారులు, కాంపౌండర్లు, ఇతర పశుశాఖ సిబ్బందిని కలిసి జీవాలకు టీకాలు వేయించుకోవాలని సూచించారు.
చిటికె వ్యాధి కారకం
క్లాస్ట్రీడియం ఫర్‌ఫ్రింజస్ అనే బ్యాక్టీరియా ద్వారా చిటికె వ్యాధి సోకుతుంది. ఆవులు, మేకల్లో అరుదుగా కనిపించే ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెలు, అందులోనూ ఆరోగ్యంగా బరువు కలిగిన గొర్రె పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి మే నెల నుంచి జూలై వరకు ఎక్కువగానూ ఆ తర్వాత అక్టోబర్, నవంబర్‌లో కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ప్రేవుల్లో గాలిలేని వాతావరణంలో అభివృద్ధి చెందిన సందర్భంలో వదలబడిన విష పదార్థాలు (టైప్–డీ) ఈ వ్యాధికి కారణం. తొలకరి వర్షాలకు పెరిగిన లేత గడ్డిని గొర్రెలు ఆశగా, అధికంగా తింటాయి. అందువల్ల ప్రేవుల్లో గాలి లేని వాతావరణం ఏర్పడటం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధిని కలిగిస్తాయి.
వ్యాధి లక్షణాలు
ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవాలు పారుకుని వణుకుతూ మెడ పైకిలేపి అకస్మాత్తుగా చనిపోతాయి. లేదంటే జీవాలు గాలిలోకి ఎగిరి కిందపడి కాళ్ళు గిలగిల కొట్టుకుంటూ పళ్ళు కొరకుతూ వణుకుతూ బిగుసుకొని నిమిషాల్లో మృతి చెందుతాయి. అంటే ఎలాంటి రోగ లక్షణాలు కనపడకుండానే మృత్యువాతపడతాయి. చనిపోయే ముందు గొర్రెలు నీరసంగా ఉండటాన్ని మాత్రం గమనించవచ్చు. కొన్ని జీవాలు నోటినుండి చొంగ కారుస్తాయి. శ్వాస పీల్చే శాతం ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మలబద్ధకం, కడుపుబ్బరం ఉంటుంది. మేత మేయకుండా, నెమరు వేయకుండా తలలు వాల్చి, ముడుచుకొని ఒకే చోట నిలబడతాయి. ఉదయం సాయంత్రం వేళల్లో కొంత వరకు లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ చర్యలు
పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏడాదికి రెండు సార్లు వేసే టీకాలను వినియోగించుకోవాలి. జీవాల జీర్ణకోశంలో సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టేందుకు టెట్రాసైక్లిన్, ఆంఫీసిలిన్, జెంటామైసిన్ వంటి మందులు, క్లోరిల్, ఎపిల్ వంటి ఇంజక‌్షన్లు పశు వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. జీవాలను ఉదయం కొంత ఆలస్యంగా మేపుటకు తీసుకెళ్లడం, మధాహ్న సమయంలో కొంత సేపు విశ్రాంతిని ఇవ్వడం, సాయంత్రం త్వరగా తీసుకొని రావడం వల్ల జీర్ణాశయం కొంత ఖాళీగా ఉంచుట ద్వారా సూక్ష్మ జీవుల అభివృద్ధిని తగ్గించవచ్చు. తొలకరి వర్షాలకు పెరిగి వాడిపోయిన గడ్డిని మేపకూడదు.