ఇలా చేస్తే బెట్ట నుంచి బయటకు..
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగైన వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే బెట్ట నుంచి బయటపడగలమని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ, కంది, పత్తి, రబీ సీజన్‌లో సాగైన వరి, పప్పుశనగ, వేరుశనగ, కర్భూజా, కళింగర పంటలతో పాటు జీవాలు, కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ‘సాక్షి’కి బుధవారం తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
పంటల సమాచారం:
+ తొలగించిన వేరుశనగ కాయల్లో తేమ 8 నుంచి 9 శాతం వచ్చేలా ఎండబెట్టుకుని ప్లాస్టిక్ బ్యాగుల్లో నిల్వ చేసుకోవాలి.
+ అవకాశం ఉన్న ప్రాంతాల్లో కంది పంటకు నీటి తడులు ఇచ్చుకోవాలి. ప్రస్తుతం కందికి శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశించింది. 2 మి.లీ క్వినాల్‌ఫాస్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
+ ప్రత్తి పంటకు అక్కడక్కడ గులాబీరంగు పురుగు ఆశించింది. ఎకరాకు 4 నుంచి 6 ఫిరమోన్ ఏర్పాటు చేసుకోవాలి. గుబురుగా ఉన్న పూలను గమనించి తీసేయాలి. పురుగు ఉన్నట్లు గమనిస్తే 2 మి.లీ ప్రొఫినోఫాస్ లేదా 1.5 గ్రాములు లార్విన్ లేదా 2 మి.లీ క్లోరోఫైరిపాస్ ఇందులో ఏదో ఒక మందుకు 1 మి.లీ నువాన్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
+ వరిలో సుడిదోమ ఆశించింది. 1.6 మి.లీ బుప్రోపెజిన్ లేదా 2 మి.లీ ఇతోఫెన్‌ప్రోక్స్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 0.25 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.25 గ్రాములు ఎథిప్రోల్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
+ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ పంటగా వేరుశనగ డిసెంబర్ 15లోగా విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజెబ్ + 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్‌ఎస్‌పీ) వేయాలి. నవంబర్ మొదటి వారంలో విత్తిన రైతులు గొర్రుతో అంతర కృషి చేసుకోవాలి.
+ అక్కడక్కడ వేసిన పప్పుశనగ పంట బెట్ట పరిస్థితులు ఏర్పడినందున అవకాశం ఉంటే 30 నుంచి 35 రోజుల పంటకు ఒక నీటి తడి ఇస్తే మేలు. అంతరకృషి చేసుకోవాలి.
+ దోస, కర్భూజాకు ఆశించిన బూడిద తెగులు నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 గ్రాము థయోపానెట్ మిథైల్ లేదా 1 మి.లీ కేరాతన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
-------------------------------------------------------------------
వాతావరణం
ఈ నెల 27 వరకు వర్షం వచ్చే సూచనలు లేవు. వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 33 డిగ్రీలతో స్థిరంగా కొనసాగనుండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీలతో కాస్త తగ్గనున్నాయి. గాలిలో తేమ ఉదయం 68 నుంచి 80, మధ్యాహ్నం 40 నుంచి 50 శాతం మధ్య ఉండవచ్చు. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
-----------------------------------------------------------
+ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గినందున కోళ్ల పెంపకందారులు ఇన్ప్రారెడ్ బల్బులు లేదా కృత్రిమ ఇంక్యుబెటర్లు ఏర్పాటు చేసుకోవాలి. గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
+ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గొర్రెల్లో నీలినాలుక(బ్లూటంగ్) వ్యాధి సోకే అవకాశం ఉన్నందున ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి. వ్యాధిన పడిన జీవాలకు గంజి, గ్లూకోజ్ తాపించాలి. నోటి పుండ్లను ఒక శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో శుభ్రం చేసి బోరో గ్లిజరిన్ పట్టించాలి.