వ్యాధులపై అప్రమత్తత అవసరం
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాకాలం.. అందులోనూ గాలులు జోరుగా వీస్తుండటంతో పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకే అవకాశం ఉండటంతో రైతులు, కాపర్లు జాగ్రత్తగా ఉండాలని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ బి.సన్యాసిరావు తెలిపారు. జబ్బు లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలన్నారు.
ఈ వ్యాధులు సోకే అవకాశం
పశువులలో గొంతువాపు, జబ్బువాపు, థైలేరియాసిస్, బెబిసియాసిస్ లాంటి వ్యాధులు రావచ్చు. గొర్రెలలో ముచ్చువ్యాధి, బొబ్బు, పీపీఆర్, బ్లూటింగ్ (మూతి పుండ్లు వ్యాధి, నీలినాలుక వ్యాధి) ఫుట్‌రాట్ (కాలిపుండ్ల వ్యాధి) సోకే అవకాశం ఉంది. జిల్లాలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి టీకాలు అందుబాటులో ఉన్నందున పశు వైద్యశాలలో డాక్టర్లు, పారా సిబ్బందిని సంప్రదించి వైద్య చికిత్స చేయించుకోవాలి. లేదంటే స్థానిక సాయినగర్‌లో ఉన్న పశువ్యాధి నిర్ధారణ కేంద్రంలో సంప్రదిస్తే సరైన వైద్య సూచనలు ఇస్తారు. ఒకవేళ జీవాలు చనిపోతే వాటికి సంబంధించి కొన్ని భాగాలు తీసుకువచ్చి పరీక్ష చేయించుకుని వ్యాధి నిర్ధారణ ద్వారా మిగతా వాటికి సోకకుండా సరైన సలహాలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు.
బ్లూటంగ్ – ఫూట్‌రాట్ లక్షణాలు
గొర్రెలు, మేకల్లో ఎక్కువగా నీలినాలుక వ్యాధి (బ్లూ టంగ్) సోకే అవకాశం ఉంది. వ్యాధి వ్యాపిస్తే ఎక్కువగా జ్వరం, మూతివ్యాపు, పెదవులు దద్దరించట, నోటిలోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటడము, ఒంట్లో నీరు చేరటం, పారుకోవటం, మేతమేయక పోవటం, ఈసుకు పోవటం (అబార్షన్లు), 30 శాతము దాకా మరణాలు లాంటి లక్షణాలు ఉంటాయి. నివారణకు సాయంకాలం పూట గొర్రెల మందలో వేపాకు పొగపెట్టుకుంటూ అప్పుడప్పుడు బ్లూటాక్స్/టిక్కిల్ మొదలగు మందులను పిచికారి చేస్తూ, పొడి ప్రాంతాలలో మేపుకు వెళ్లాలి. ఫూట్‌రాట్ (కాలిపుండ్లవ్యాధి) సోకితే కాలిగిట్టల మధ్య చీము చేరి చెడు వాసన కలిగి ఉండి, గొర్రెల్లో కుంటడము అనే లక్షణాలు కనిపిస్తాయి. బురద ప్రాంతాలలో జీవాలను మేపకూడదు.
గొర్రెల పెంపకందారులకు సూచనలు
చనిపోయిన గొర్రెల మాంసాన్ని అమ్మకూడదు. ఎటువంటి పరిస్థితిల్లోనూ వాటి మాంసాన్ని తినకూడదు. చనిపోయన గొర్రెను రెండు అడుగుల గుంత తవ్వి సున్నం చల్లి పూడ్చి పెట్టాలి. జబ్బుపడిన గొర్రె మరణించేతవరకు మేస్తూ, నెమరు వేస్తూ ఉంటుంది. కాని కొన్ని జబ్బు లక్షణాలతో బాధపడుతూనే మొండిగా మేస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. దగ్గు, ముక్క చీమిడి, పొరుడు, కుంటడము, పెదవలులు దద్దరించడం, ఈసుకుపోవడము, ఎర్రమూత్రము, మరణం తర్వాత ముక్కలో నుండి రక్తము కారడము, పూర్తిగా మేయకపోవడం, నోటిలోపల పుండ్లు మొదలగు అన్ని కూడా జబ్బు లక్షణాల కింద పరిగణించాలి. పశువైద్యులకు పూర్తి సమాచారం అందించాలి. పశువైద్యులను సంప్రదించేటప్పుడు చనిపోయిన గొర్రెను కాని, పేడను కాని, ముఖ్య అవయయులనుగాని తీసుకెళ్లి పరీక్ష చేయించాలి.