అప్రమత్తతతో గాలికుంటు నివారణ | agriculture story | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతో గాలికుంటు నివారణ

Published Thu, Aug 17 2017 10:25 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అప్రమత్తతతో గాలికుంటు నివారణ - Sakshi

అప్రమత్తతతో గాలికుంటు నివారణ

అనంతపురం అగ్రికల్చర్‌: పశువులు, ఎద్దులకు గాలికుంటు వ్యాధి (ఫూట్‌ అండ్‌ మౌత్‌ డీసీజెస్‌–ఎఫ్‌ఎండీ) సోకకుండా అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ అనంతపురం డివిజన్‌ డీడీ డాక్టర్‌ టి.శ్రీనాథాచార్‌ తెలిపారు. వర్షాకాలంలో వ్యాపించే అవకాశం ఉన్నందున వ్యాధి సోకిన తర్వాత కాకుండా రాకుండానే ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

గాలికుంటు వ్యాధి లక్షణాలు :
గాలికుంటు వ్యాధి వల్ల పశువుల్లో మరణాలు తక్కువైనా పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. ఏవోటీ, ఆసియా–1, ఆసియా–22, ఆసియా–10, పిటార్నో లాంటి వైరస్‌ వల్ల సోకే ప్రమాదకరమైన అంటు వ్యాధి కావడంతో పశువుల్లో ఉత్పాదకశక్తి, ఎద్దుల్లో సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగానూ, బలహీనంగా ఉండే యుక్తవయస్సు పశువుల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. నోటిలోపల, నాలుక మీద, ముట్టె లోపల భాగంలో బొబ్బలు ఏర్పడుతాయి. 24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్‌కు గురవుతాయి. మేత మేయవు. చొంగకారుస్తాయి. గిట్టల మధ్య పుండ్ల కారణంగా సరిగా నడవలేవు. గర్భంతో ఉన్న పశువులు ఆబార్షన్‌కు గురవుతాయి.

పాలిచ్చే ఆవుల్లో ఉత్పత్తి తగ్గిపోతుంది. ఒక్కోసారి పొదుగుపై కూడా బొబ్బలు రావడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా చేరి చీము వస్తుంది. చీము కారడం వల్ల ఇతరత్రా రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే చీముపై ఈగలు వాలి గుడ్లు పెట్టడం, వాటి నుంచి వచ్చిన లార్వాలు కండరాలకు చేరి మాంసాన్ని తింటాయి. దీంతో పెద్ద పెద్ద గాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వల్ల దూడలు మరణిస్తాయి. మంచి ఎద్దులు సైతం వ్యాధి సోకితే బలహీనమై పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది.

నివారణ చర్యలు ఇవీ :
వ్యాధి సోకిన పశువులను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో గిట్టలు, పుండ్లను శుభ్రం చేయాలి. బోరోగ్లిజరిన్‌ పూత పూయాలి. ఈగలు వాలకుండా వేపనూనె, నిమ్లెంట్, లారాజెంట్‌ లాంటి మందులు వాడాలి. పశువైద్యాధికారి సిఫారసు మేరకు యాంటీబయాటిక్‌ మందులు తాపించాలి. వ్యాధి సోకిన పశువులకు రోజూ 50 గ్రాములు అయొడైజ్డ్‌ ఉప్పు దాణాతో ఇస్తే కొంత ఉపశమనం. అలాగే 30 గ్రాములు ఎముకలపొడి (మినరల్‌ మిక్చర్‌) పచ్చిమేతతో కలిసి రోజూ ఇస్తే త్వరగా కోలుకుంటాయి. టీకాలు వేయిస్తే పాల ఉత్పత్తి తగ్గిపోతాయి, గర్భస్రావం అవుతుంది, టీకా వేసిన చోట వాపు ఏర్పడుతుందనే అపోహలు వీడి పశువులు, ఎద్దులకు టీకాలు వేయించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement