పశువులకు బ్రూసెల్లోసీస్ బూచి
- అప్రమత్తంగా లేకపోతే అంతే
- మనుషులకు కూడా సోకే ప్రమాదం
- ఏడీడీఎల్ ఇన్‌చార్జ్ ఏడీ డాక్టర్ కళావతి
అనంతపురం అగ్రికల్చర్ : పశువులకు బ్రూసెల్లోసీస్ సోకితే ఎంతో ప్రమాదకరమని, వ్యాధి సోకకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అనంతపురంలోని సాయినగర్ పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఇన్‌చార్జ్ ఏడీ డాక్టర్ ఎస్.కళావతి పేర్కొన్నారు. వ్యాధి నివారించడంలో భాగంగా ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 4 నుంచి 8 నెలల వయస్సున్న పెయ్య దూడలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఏడీ తెలిపారు. పశువైద్యాధికారులు, సిబ్బందిని సంప్రదించి టీకాలు చేయించుకోవాలని రైతులకు తెలియజేశారు.
బ్రూసెల్లోసీస్ వ్యాధి ఎలా సోకుతుందంటే..:
బ్యాక్టీరియా ద్వారా బ్రూసెల్లోసీసీ వ్యాధి సోకుతుంది. పశువుల్లో గర్భస్రావం జరిగినపుడు వాటి నుంచి వచ్చే ద్రవం, మూత్రం, కళ్లలో నుంచి వచ్చే స్రవాల్లో బ్రూసెల్లోసీస్ వ్యాధి కారక బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ వ్యాధిని ఇసుక వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది పశువులతో పాటు మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది.
+ పశువుల్లో గర్భం దాల్చిన ఏడు నెలల సమయంలో సోకితే ఈత ఈసుకుపోవడం (అబార్షన్) అవుతుంది. పశువులకు ఒకసారి వ్యాధి సోకితే జీవితకాలం గర్భం ధరించడం కష్టం. వ్యాధి సోకినప్పుడు పశువు తీవ్ర జ్వరంతో బాధ పడుతుంది. వ్యాధి సోకిన పశువు పాలు, గర్భస్రావాల ద్వారా మనుషులకు కూడా సోకుతుంది.
+ వ్యాధి వ్యాపిస్తే మనుషుల్లో తీవ్ర జ్వరం, ఒళ్లునొప్పులు, మోకాళ్ల నొప్పులు, అరచేతిలో చెమట పట్టడం, తీవ్ర అలసట, పదే పదే జ్వరం రావడం, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
+ నివారణలో భాగంగా వ్యాధి సోకిన పశువులను మంద నుంచి వేరుచేసే చికిత్స అందజేయాలి. పశువుల కొట్టాలను క్రిమి సంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి. చనిపోయిన పశువులు, వాటి మల, మూత్రాలను గుంత తవ్వి పూడ్చేయాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ప్రస్తుతం 4 నుంచి 8 నెలల వయస్సున్న పెయ్య దూడలకు ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి.