కృత్రిమ గర్భధారణతో మేలైన పశుసంపద
అనంతపురం అగ్రికల్చర్: మేలు జాతి పశుసంపద అభివృద్ధికి కృత్రిమ గర్భధారణ పద్ధతిని అనుసరిస్తున్నట్లు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) గైనకాలజిస్టు అండ్ అబ్‌స్టెస్ట్రిక్స్ డాక్టర్ జి.పద్మనాభం తెలిపారు. అందుబాటులో ఉన్న పశువుల్లో పాల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి విదేశీ జాతుల కన్నా.. స్వదేశీ పశుజాతి పశువుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేసి మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.
కృత్రిమ గర్భధారణ విధానం
అధిక పాల దిగుబడులను ఇచ్చే పశువుల జాతికి చెందిన అబోతుల వీర్యాన్ని సేకరించి నిక్షిప్తం చేసిన తర్వాత ఎదకు వచ్చిన ఆడ పశువుల గర్భంలోకి కృత్రిమ పద్ధతుల్లో ప్రవేశపెట్టి మేలుజాతి దూడలను పుట్టించడమే కృత్రిమ గర్భధారణ విధానం. రాష్ట్రంలో ప్రస్తుతం విదేశీ ఆవు జాతికి చెందిన జెర్సీ, హోల్‌స్టెయిన్ ప్రీసియన్ (హెచ్‌ఎఫ్), స్వదేశీ జాతికి చెందిన గిర్, సాహిపాల్, తార్‌పార్‌కర్ అలాగే గేదె జాతికి చెందిన ముర్రా, మెహసాన, జిప్పర్‌బాది రకాలకు చెందిన పశువుల వీర్యం ద్వారా సంతానోత్పత్తి చేస్తున్నారు.
విదేశీ–స్వదేశీ లక్షణాలు
విదేశీజాతి వీర్యం వల్ల పుట్టిన దూడలు అధిక పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటాయి. కానీ రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండదు. వాటి జీవితకాలం కూడా తక్కువగానే ఉంటుంది. అదే స్వదేశీ జాతి వీర్యం వల్ల పుట్టిన వాటిలో పాల ఉత్పత్తి విదేశీ జాతుల కన్నా కాస్త తక్కువగా ఉంటుంది. అయితే రోగ నిరోధక శక్తి అధికంగానూ, జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్వదేశీ జాతులకు సంబంధించి పాలు, పేడ, మూత్రంలో అధిక పోషకాలు కలిగి ఉంటాయి. వాటి ద్వారా పంటలకు అవసరమైన కషాయాలు, ఎరువులు తయారు చేసుకుని మంచి దిగుబడులు సాధించవచ్చు. ఆయుర్వేద గుణాలు కూడా అధికంగా కలిగి ఉంటాయని భారతీయల నమ్మకం. మన దేశంలోని పశుపోషణ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం స్వదేశీ జాతుల అభివృద్ధి మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
వీర్యధారణ సమయం
సాధారణంగా ఆవులు ఒకటిన్నర సంవత్సరం నుంచి 3 సంవత్సరాలోపు, గేదెలు 3 నుంచి 5 సంవత్సరాల్లోపు ఎదకు రావడం ప్రారంభమవుతుంది. ఇలా చూడి (గర్భం) నిలిచే వరకు ప్రతి 18 నుంచి 21 రోజులకు ఎద వస్తూనే ఉంటుంది. ఈ ఎద సమయాన్ని గుర్తించి ఆ సమయంలో కృత్రిమ వీర్యధారణ చేయించాలి. ఎదకు వచ్చిన పశువు లక్షణాల విషయానికి వస్తే బిత్తిరి చూపులు చూడటం, మతి స్థిమితంగా లేకపోవడం, మూత్రం కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు పోయడం, మానము నుంచి తీగ వేయడం, మానము ఉబ్బి ఉండటం లాంటివి గుర్తించాలి. పాడి పశువు అయితే పాలు తగ్గిపోవడం, ఇతర పశువుల మీదకు ఎగబాకడం లాంటివి చేస్తాయి. ఈ ఎద కాలం 24 నుంచి 36 గంటల వరకు ఉంటుంది. ఎదకు వచ్చిన 12 నుంచి 18 గంటల్లోపు కృత్రిమ గర్భధారణ చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది.