వ్యాధుల కాలం.. జీవాలు భద్రం
నీలినాలుక వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారి కళావతి
అనంతపురం అగ్రికల్చర్: వర్షాకాలం...అందులోనూ ఆగస్టు– సెప్టెంబర్ నెలల్లో దోమల బెడద ఎక్కువుగా ఉండే అవకాశం ఉన్నందున జీవాలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందనీ, ముఖ్యంగా గొర్రెలకు ‘నీలినాలుక వ్యాధి’(బ్లూటంగ్) వ్యాపించే అవకాశం ఉందని పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీడీఎల్) డాక్టర్ జి.కళావతి తెలిపారు. జీవాల పరిరక్షణపై కాపర్లు, పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వ్యాధి లక్షణాలు
వ్యాధి సోకిన గొర్రెలు, మేకలకు 105 నుంచి 107 డిగ్రీల వరకు జ్వరం ఉంటుంది. మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక, ముఖం వాపు వచ్చి, పుండ్లు ఏర్పడుతాయి. నోటి నుంచి నురగతో కూడిన చొంగ, కళ్లు, ముక్కులు వాపు వస్తాయి. వ్యాధి చివరిదశలో నాలుక నీలిరంగుగా మారుతుంది. నోటి నుండి దుర్వాసన వస్తుంది. గిట్టల పైభాగం ఎర్రగా కందిపోయి, చీముపట్టి నడువలేకపోతాయి. మేత తినకపోవడం వల్ల నీరసించి బరువు తగ్గిపోయి మరణించే అవకాశం ఉంది.
చికిత్స
వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి చికిత్స వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పశువైద్యాధికారి సూచనల మేరకు ఇతర బాక్టీరియా వల్ల కలిగే దుష్పలితాల నివారణకు ఆంటిబయాటిక్ ఎన్‌రోప్లాక్సిన్ లాంటి ఇంజక్షన్‌లు వాడాలి. నోటి పుండ్లను 1 శాతం పోటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి, బోరో గ్లిజరిన్ పూయాలి. గొర్రెల నాలుక వాపు ఉండడం వల్ల మేత మేయవు కాబట్టి రాగిగంజి, అంబలి ఇచ్చి మరణాల బారిన పడకుండా నివరించవచ్చు. గిట్టలపై ఎర్రగా కంది వాపు ఉండడం వలన నడవలేవు కాబట్టి వ్యాధి సోకిన జీవాలను మంద నుండి వేరు చేసి ఇంటి వద్దే ఉంచాలి. నొప్పి తగ్గుటకు పశు వైద్యుని సూచనల మేరకు నొప్పిని తగ్గించే మెగ్లుడిన్, యునిజిఫ్, నిమోవెట్ లాంటి సూది మందులను ఇవ్వాలి.
నివారణ
వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణకు వేపాకు లేదా యూకలిప్టస్ ఆకు, కలబంద ఆకు, పిడుకల్ని కాల్చి దోమల్ని నివారించాలి. మందను ఎల్తైన ప్రదేశంలో ఉంచడం వల్ల దోమలను నివారించవచ్చు. అలాగే డెల్టామిథిన్, సైఫర్ మిథిన్, అమిత్‌రాజ్ లాంటి మందులను గొర్రెలపై, పాకలలో పిచికారి చేసుకోవాలి. మాంసం, పాల ద్వారా ఈ వ్యాధి ఒకదానికొకటికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్త జీవాల్ని కోయకూడదు. అలాగే ఈజబ్బు కలిగిన గొర్రల పాలను గొర్రె పిల్లలు తాగకుండా చూడాలి.