‘పెసర’ లాభాదాయకం
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో వర్షాధారంగా ప్రత్యామ్నాయ పంటగా పెసర సాగు చేసుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త తిమ్మప్ప పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం నమోదైనా పెసర దిగుబడి వస్తుందని అన్నారు.అయితే పెసరలో తెగుళ్లు నివారించుకోవాలని, ముఖ్యంగా పల్లాకు తెగులు నివారించుకుంటే లాభదాయకమమేనని అన్నారు. పల్లాకు తెగులు నివారణకు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు వస్తాయన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా 5,300 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోందన్నారు.
యాజమాన్య పద్ధతులు ఇవీ : అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు. ఎకరాకు 6 నుంచి 7 కిలోలు విత్తనం అవసరం. కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేసుకుంటే 20 రోజుల వరకు రసంపీల్చు పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఎంజీజీ 295 (మధిర 295), డబ్ల్యుజీజీ 460, ఎల్‌జీజీ 460, ఎల్‌జీజీ 450 లాంటి స్వల్పకాలిక రకాల విత్తనాలు ఎంపిక చేసుకోవచ్చు. విత్తేటప్పుడు సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీ మీటర్లు దూరం పాటించాలి. విత్తే ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోలు భాస్వరం ఎరువులు వేయాలి. కలుపు నివారణకు ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు పెండీమిథాలిన్ లేదా ఒక లీటర్ 50 శాతం అలాక్లోర్ మందులు విత్తిన రోజు లేదంటే మరుసటి రోజు పిచికారీ చేసుకోవాలి. 20 నుంచి 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేసుకుంటే కలుపు సమస్యను నివారించుకోవచ్చు.
పల్లాకు తెగులు నివారిస్తే అధిక దిగుబడి : ఇది వైరస్‌జాతి తెగులు. తెల్లదోమ ద్వారా వ్యాపించి లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. తొలి దశలో ఆశిస్తే మొక్కలు గిడసబారిపోతాయి. పల్లాకు తెగులును తట్టుకునే డబ్ల్యుజీజీ–42, ఎంజీజీ–295, ఎల్‌జీజీ–407, ఎమ్‌ఎల్‌జీ–267, పీడీఎం–54, ఎల్‌జీజీ–460 లాంటి విత్తన రకాలు ఎంపిక చేసుకోవాలి. విత్తేముందు కిలో విత్తనానికి 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాములు థయోమిథాక్సిమ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి.
పైరు చుట్టూ నాలుగు వరుసలు జొన్న, మొక్కజొన్న విత్తుకోవాలి. దీని వల్ల తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంకను నివారించుకోవచ్చు. పొలం గట్ల మీద, పరిసర ప్రాంతాల్లో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. తెగులు సోకిన మొక్కలు పీకేసి నాశనం చేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపురంగు పూసిన అట్టలకు గ్రీజు పూసి ఉంచితే తెల్లదోమను అదుపులో పెట్టవచ్చు. తెల్లదోమ నివారణకు ఎకరాకు 10 లీటర్లు వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. లేదంటే 5 మి.లీ వేపనూనె లేదా 1 గ్రాము అస్ఫేట్ లేదా 1.5 మి.లీ ట్రైజోఫాస్ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 0.2 గ్రాములు అసిటామిప్రైడ్ లేదా 0.2 గ్రాములు థయోమిథాక్సామ్ లీటర్ నీటికి కలిపి మందులు మార్చి మార్చి పిచికారీ చేసుకుంటే పల్లాకు తెగులును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.