అగ్రిగోల్డ్ డెయిరీ లాకౌట్
లక్ష్మీనగర్ (ద్వారకాతిరుమల) : ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్‌లోని అగ్రిగోల్డ్ పాల డెయిరీ యూనిట్‌ను ఆ సంస్థ యాజమాన్యం గురువారం అర్ధరాత్రి లాకౌట్ ప్రకటించింది.
లక్ష్మీనగర్ (ద్వారకాతిరుమల) : ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్‌లోని అగ్రిగోల్డ్ పాల డెయిరీ యూనిట్‌ను ఆ సంస్థ యాజమాన్యం గురువారం అర్ధరాత్రి లాకౌట్ ప్రకటించింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. శుక్రవారం ఉదయం రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులకు ఫ్యాక్టరీని మూసివేశామని యాజమాన్యం ప్రకటించింది. దీంతో సంస్థ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ కార్మికులు డెయిరీ వద్ద ఆందోళనకు దిగారు. డెయిరీ ఫామ్‌ను మూసివేయడంతో తామంతా ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా డెయిరీ యూనిట్‌ను మూసివేశామంటే తాము ఏమై పోవాలని కార్మికులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
రోడ్డున పడిన 70 కుటుంబాలు
మారంపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురంలో అగ్రిగోల్డ్ సంస్థ 10 ఏళ్ల క్రితం డెయిరీ యూనిట్‌ను స్థాపించింది. అగ్రిగోల్డ్ అమృతవర్షిణి పేరుతో పాలు, ఇతర పదార్థాలు తయారవుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 70 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా సమీపంలోని దూబచర్ల, గంటావారిగూడెం, లక్ష్మీనగర్, కప్పలకుంట, మహదేవపురం, గుణ్ణంపల్లి, బుట్టాయిగూడెం, భీమడోలు తదితర గ్రామాలకు చెందిన వారు. వీరితో పాటు నాలుగు నెలల క్రితం కీసరిలోని అగ్రిగోల్డ్ ఫ్యాక్టరీ ఇదే విధంగా మూతపడటంతో అక్కడి నుంచి ఇక్కడ పనిచేసేందుకు కొందరు కార్మికులు వచ్చారు. యాజమాన్య నిర్ణయం కారణంగా వారంతా ఉపాధి కోల్పోయారు.
హెరిటేజ్‌కు లాభం చేకూర్చడానికేనా?
అగ్రిగోల్డ్ సంస్థపై పలు కేసులు కోర్టులో నడుస్తున్నాయి. అయితే పాల డెయిరీ యూనిట్లు చాలాకాలంగా లాభాల్లోనే ఉన్నాయి. ఆ సంస్థ ఆస్తులకు సంబంధించి కేసులు ఉన్నా పాల కేంద్రాలు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చేవిధంగా రాష్ట్రంలోని ఇతర సంస్థలకు చెందిన పాల కేంద్రాలను దెబ్బతీసేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం
సాగుతోంది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ డెయిరీలను ఒక్కొక్కటిగా మూయించివేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మా పరిస్థితి ఏంటి .. అకస్మాత్తుగా ఫ్యాక్టరీని మూసివేశామంటే దీనిపైనే ఆధారపడి జీవి స్తున్న మా పరిస్థితి ఏంటి? మా గురించి ఆలోచించకుండా యాజ మాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. – ఎన్.వాసు, కార్మికుడు
ప్రత్యామ్నాయం చూపాలి.. ఇప్పటి వరకు మా కష్టంతో డెయిరీని నడిపాం. ఉన్నట్టుండి ఫ్యాక్టరీని మూసివేశామని యాజమాన్యం మాకు ప్రత్యామ్నాయం చూపకుండా చేతులు దులుపుకుంది. వెంటనే మాకు న్యాయం చేయాలి. – యు.రాజేష్, కార్మికుడు
ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం .. దాదాపు పది సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా. ఇప్పుడు పనిలేదని చెబితే దీనిపైనే ఆధారపడి బతుకుతున్న నా కుటుంబ పరిస్థితి ఏమిటి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూసేసి నట్టేట ముంచారు. – వి.కృష్ణవేణి, కార్మికురాలు