
నక్సల్స్ బాధిత పోలీసు కుటుంబాల ర్యాలీ
కృష్ణలంక : ఒడిశా, ఆంధ్ర సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ పౌరహక్కుల సంఘాల ఆధ్వర్యంలో గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ నక్సల్స్ బాధిత పోలీస్ కుటుంబాలు, వారి సానుభుతిపరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బందర్‌రోడ్డుపై శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. బ్యానర్లు ప్రదర్శించి పౌరహక్కుల సంఘాల నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మావోయిస్టులు చనిపోతే పౌరహక్కుల ఉల్లంఘన అంటూ మాట్లాడే పౌరహక్కుల సంఘాల నాయకులు పోలీసులు చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అమాయక గిరిజనులను అడ్డంపెట్టుకుని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న మావోయిస్టులను వెనుకేసుకొచ్చి మాట్లాడటం పౌరహక్కుల సంఘాల నేతలకు తగదన్నారు. తొలుత మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో నక్సల్స్ బాధిత పోలీసు కుటుంబాల సభ్యులు ర్యాలీగా బందరురోడ్డుపైకి చేరుకుని, రోడ్డు పక్కన నిరసన శిబిరంలో కూర్చున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ నిరసన కొనసాగింది. ఒక పక్క పౌరహక్కుల సంఘాల సమావేశం, మరోపక్క నక్సల్స్ బాధిత కుటుంబాలు నిరసన కార్యక్రమం చేపట్టడంతో రాఘవయ్యపార్కు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.