Published
Wed, Aug 3 2016 7:25 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ఓపెన్ వర్సిటీ సమాధాన పత్రాలు చింపివేత
ఆందోళనలో 15 మంది డిగ్రీ విద్యార్థులు
చేతులెత్తేసిన యూనివర్సిటీ అధికారులు
ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన 15 మంది విద్యార్థుల సమాధాన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేయడంతో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్లే జూన్ 7 నుంచి 12 వరకు డిగ్రీ వివిధ గ్రూపులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఆర్మూర్ సెంటర్ కోఆర్డినేటర్ రాజ పర్యవేక్షణలో ప్రథమ సంవత్సరంలో 230 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 240 మంది విద్యార్థులు, తృతీయ సంవత్సరంలో 144 మంది విద్యార్థులు పరీక్షలు రాసారు. ఎంపీసీ తృతీయ సంవత్సరానికి చెందిన విద్యార్థుల్లో కొందరు ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు సైతం రాసారు. పరీక్షల సమయంలో యూనివర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వర్ బాబూరావ్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను లక్కతో సీల్ వేసి మరుసటి రోజు యూనివర్సిటీకి పోస్టు ద్వారా పంపిస్తారు. తృతీయ సంవత్సరం పూర్తవడంతో ఇక తమ డిగ్రీ పూర్తయినట్లే నని ఆనందంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఎదురు దెబ్బ తగిలింది. జూన్ 30న ఓపెన్ యూనివర్సిటీ వారు విడుదల చేసిన ఫలితాలలో ఎంపీసీకి చెందిన 15 మంది విద్యార్థుల పేర్లు గల్లంతయ్యాయి. ఆందోళన చెందిన విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ సమ్మయ్యను, హైదరాబాద్‌లోని యూనివర్సిటీ కార్యాలయానికి వెళ్లి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ (సీవోఈ) ఏవీఎన్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటయ్యను కలిసి తమ సమస్యను వివరించారు. మీ 15 సమాధాన పత్రాలలో మీరు రాసిన పేపర్లు చింపి వేసి ఉన్నాయి కాబట్టి మీ రిజల్ట్స్ రాలేవని వారు సమాధానం చెప్పారు. ఈ 15 మందిలో ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ రాసిన వారి సమాధాన పత్రాలు సైతం చింపివేసి ఉన్నాయని తెలిపారు. దీంతో ఎవరు తమ సమాధాన పత్రాలు చింపి వేసారు. ఇలా అయితే తాము మరో విద్యా సంవత్సరం వృథా కావాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయగా యూనివర్సిటీ అధికారులు విచారణకు కమిటీ వేసాము. సమాధాన పత్రాలను ఆర్మూర్ స్టడీ సెంటర్‌లోనే చింపి వేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసారు. విచారణ చేసినా మీకు మాత్రం న్యాయం జరిగే ప్రసక్తే లేదంటూ యూనివర్సిటీ అధికారులు సెలవిచ్చారు. దీంతో వారంతా ఆర్మూర్ పట్టణంలోని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజ, క్లర్క్ శ్యాంతో బుధవారం వాగ్విదానికి దిగారు. పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను గుర్తించి వారిని శిక్షించడమే కాకుండా తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేసారు.