
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఉదయం ఓ విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానం రెక్కల్లోకి టేకాఫ్ సమయంలో ఓ గద్ద ప్రవేశించింది. దాంతో వెంటనే అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని కిందికి దించేశాడు. విమానం సురక్షితంగా రన్‌వేపై దిగటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ విమానంలో మొత్తం 116 మంది ప్రయాణికులున్నారు. అందరినీ సురక్షితంగా కిందకు దింపారు. అయితే.. హరిద్వార్ వెళ్లాల్సిన యాత్రకులు 60 మంది కూడా ఈ బృందంలో ఉన్నారు. తమను ఈరోజే ఢిల్లీకి పంపాలని, అక్కడి నుంచి తమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయినందున అవి మిస్సయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా అధికారులతో గన్నవరం విమానాశ్రయంలో వాగ్వాదానికి దిగారు.