సీఎం వస్తారని హడావుడి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వస్తారని సమాచారం రావడంతో అధికారులు హడావుడి చేశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం వెళ్లిన ఆయన.. వర్షం కారణంగా హెలికాప్టర్ వీడి రోడ్డుమార్గంలో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వస్తారని సమాచారం అందింది. దీంతో ఇక్కడి అధికారులు ఆయన కోసం కాన్వాయ్‌ను సిద్ధం చేసి, భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, సీఎం కొవ్వూరు వరకూ వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ట్రూజెట్, జెట్ విమానాలు ఆలస్యం
మధురపూడి : వాతావరణ మార్పుల ఫలితంగా విమాన ప్రయాణాలకు మంగళవారం ఆటంకం ఏర్పడింది. ట్రూజెట్, జెట్ విమాన సర్వీసలు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఆలస్యంగా చేరాయి. సాయంత్రం 4.20 గంటలకు చేరాల్సిన ట్రూజెట్ విమానం మూడు గంటలు, 5.30 గంటలకు రావాల్సిన జెట్ ఎయిర్‌వేస్ విమానం గంటన్నర ఆలస్యంగా నడిచాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయం ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలు హైదరాబాద్‌లో నే ఆలస్యంగా బయలుదేరాయి. సాయంత్రం వేళ వర్షాలు కురుస్తూండడంతో రెండు రోజులుగా ఈ రెండు విమానాలు ఆలస్యంగానే వస్తున్నాయి.