గిరి చెదిరే..! | ajency area divided three parts | Sakshi
Sakshi News home page

గిరి చెదిరే..!

Published Wed, Sep 14 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తుండగా.. గార్ల, బయ్యారం మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్తున్నాయి.

కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తుండగా.. గార్ల, బయ్యారం మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్తున్నాయి.

  • ఆరు గిరిజన మండలాలపై ఆందోళన
  • ఖమ్మంలో కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు
  • మహబూబాబాద్‌ జిల్లాలోకి గార్ల, బయ్యారం
  • కొత్తగూడెంలో కొనసాగించాలని ఆందోళనలు

  •  ఇల్లెందు:
        జిల్లాల విభజనలో గిరిజన ప్రాంతం మూడు ముక్కలవుతోంది. కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తుండగా.. గార్ల, బయ్యారం మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్తున్నాయి. ఈ ఆరు మండలాలను కొత్తగూడెం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ, గిరిజన, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయి. జల్, జంగిల్, జమీన్‌ హమారా.. కొమురం భీం నినాదంతో ఒక్కటైన అటవీ ప్రాంతాలు జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మరోమారు ఉద్యమపథంలో పయనిస్తున్నాయి. నాటి ఉద్యమాల ఫలితంగా 1/70 చట్టం, పెసా, సమత జడ్జిమెంట్, అటవీహక్కు చట్టం, జీఓ నంబర్‌ 3, ఐటీడీఏల ఏర్పాటు వంటి ఎన్నో ప్రయోజనాలు పొందామని గిరిజనులు పేర్కొంటున్నారు. వీటన్నింటినీ గిరిజనులు యథాతథంగా పొందాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఆరు మండలాలను కూడా కొత్తగూడెం జిల్లాలో చేర్చాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
    గిరిజన ప్రాంతం ఛిన్నాభిన్నం
    జిల్లాల పునర్విభజనతో గిరిజన ప్రాంతం ఛిన్నాభిన్నం అవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాలు ఉండగా రాష్ట్ర విభజనతో ఐదు మండలాలు పూర్తిగా రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రాలో కలిపారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 41 మండలాలు ఉండగా ఇందులో 24 మండలాలు గిరిజన ఉప ప్రణాళిక (ఎస్టీ సబ్‌ ప్లాన్‌) పరిధిలో ఉన్నాయి. జిల్లాల విభజనలో గిరిజన మండలాలను మూడు ముక్కలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలోకి కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు మండలాలు వెళ్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో గార్ల, బయ్యారం మండలాలను విలీనం చేస్తున్నారు. ఈ ఆరు మండలాలను సైతం కొత్తగూడెం జిల్లాలో విలీనం చేసి, గిరిజన జిల్లాగా ప్రకటించాలని ఆదివాసీ, గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
    అభివృద్ధిపై ఆందోళన
    ఏజెన్సీ మండలాలను విభజించి మైదాన ప్రాంతంలో కలపడం వల్ల ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి వస్తున్న గిరిజనులు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 23,88,575 మంది జనాభా ఉండగా ఇందులో 6,46,791 మంది గిరిజనులు ఉన్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో 2,16,631 మంది ఉండగా, మహబూబాబాద్‌లో ( గార్ల–బయ్యారం) 40,436 మంది, కొత్తగూడెంలో 3,89,724 మంది ఉన్నారు. కామేపల్లి మండలంలో 41,955 మంది ఉండగా 166 చ.కి.మీ వైశాల్యం ఉంది. కారేపల్లి మండలంలో 54,897 జనాభా ఉండగా, 253 చ.కి.మీ వైశాల్యం, జూలూరుపాడులో 33,395 మంది జనాభా 240 చ.కి.మీ వైశాల్యం, ఏన్కూరులో 35,342 జనాభా ఉండగా 233 చ.కి. మీ వైశాల్యం ఉంది. ఇక మహబూబాబాద్‌ జిల్లాలో విలీనం అవుతున్న గార్ల–బయ్యారం మండలాల్లో సుమారు 80 వేల జనాభా ఉండగా 250 చ.కి. మీ వైశాల్యం ఉన్నాయి. ఈ మండలాలను విభజించి రెండు జిల్లాల్లో కలుపటం వల్ల గిరిజనులు విద్య,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు.
    సాగుతున్న ఆందోళనలు
    ఇల్లెందును జిల్లా కేంద్రం, డివిజన్‌ కేంద్రం చేయాలని న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ, బహుజన సమాజ్‌పార్టీ, చండ్ర పుల్లారెడ్డి వర్గం, గిరిజన సంఘాలు  జిల్లా, డివిజన్‌  సాధన కమిటీగా ఏర్పడి సుమారు 30 రోజుల పాటు ఆందోళనలు, రిలే దీక్షలు నిర్వహించిన విషయం విదితమే. డివిజన్‌ కేంద్రం చేయాలని సీపీఐ, న్యూమోక్రసీ రాయల వర్గం ఆందోళన నిర్వహించాయి. గిరిజన మండలాలను విభజించరాదంటూ నంగారాభేరి, సేవాలాల్‌ సేన, తుడుందెబ్బ, ఆదివాసీ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఏటీఎఫ్‌), టీటీఎఫ్, టీటీటీఎఫ్, ఏటీఏ లాంటి సంఘాలు ఆంధోళనకు దిగాయి. ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఏకంగా హైకోర్టును ఆశ్రయింది.  
     
    గిరిజన ప్రాంతాన్ని ముక్కలు చేయొద్దు: కబ్బాకుల రవి, ఏటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు
    గిరిజన ప్రాంతాన్ని మూడు ముక్కలు  చేయాలనే ప్రతిపాదనను విరిమించుకోవాలి. ఇల్లెందు మండలాన్ని కూడా మహబూబాబాద్‌లో కలుపుకోవాలనే ప్రయత్నం తగదు. షెడ్యూల్‌ ప్రాంతాలను, నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతాలను కలిపి జిల్లాలు చేయొద్దు. కొత్తగూడెంలోనే ఈ ఆరు మండలాలను కొనసాగించాలి.

    షెడ్యూల్‌ నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతాలను కలపొద్దు: ఈసం నర్సింహారావు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు
    షెడ్యూల్‌ ప్రాంతాలు, నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతాలను కలిపి జిల్లాలు చేయవద్దు. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో అనేక చట్టాల ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకునే వారు లేరు. గిరిజనులను విభజించటం వల్ల చట్టాలు అమలుకు నోచుకోకుండా పోతాయి. ఖమ్మం జిల్లాలోని  ఆదివాసీ మండలాలతో జిల్లాను ఏర్పాటు చేయాలి.

    ఆ ఆరింటిని కొత్తగూడెం జిల్లాలో ఉంచాలి : అజ్మీరా శివనాయక్, నంగారాభేరి
     ఖమ్మం జిల్లాలో విలీనం చేస్తున్న కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, మహబూబాబాద్‌ జిల్లాలో విలీనం చేస్తున్న గార్ల, బయ్యారం మండలాలను కొత్తగూడెం జిల్లాలో కొనసాగించాలి. ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను విడదీయటం వల్ల గిరిజనులు అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు.

    గిరిజనులను అంతం చేసేందుకే జిల్లాల విభజన: పూనెం శ్రీనివాస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ (ఏఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు
    గిరిజనులను అంతం చేసేందుకే ప్రభుత్వం జిల్లాలు విభజన చేస్తోంది. తెలంగాణ జిల్లాల విభజన చట్టం–1974 వల్ల ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ప్రభుత్వం రాజకీయ స్వలాభం కోసం జిల్లాల విభజనను తెచ్చింది. దీనిపై ఏఎస్పీ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించాం.

    ఆరు మండలాలను కొత్తగూడెంలోనే ఉంచాలి : అజ్మీర కిషన్‌ నాయక్, టీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు
    ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ మండలాలను మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయించటం తగదు.  గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలి. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement