
ఐక్యతకు ప్రతీక నవమి ఉత్సవాలు
కూచివారిపల్లె (రాజంపేట టౌన్): ప్రజల్లో ఐక్యతకు శ్రీరామనవతి ఉత్సవాలు ప్రతీకలాంటివని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మండలంలోని కూచివారిపల్లెలో వెలసిన శ్రీరామాలయంలో వైఎస్సార్ సీపీ యూత్ విభాగం నాయకుడు రెడ్డిమాసి రమేష్‌నాయుడు స్వామివారికి శనివారం ఉభయం సమర్పించారు. ఈకార్యక్రమంలో ఆకేపాటి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీతారాములను దర్శించుకొని పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఆకేపాటి మాట్లాడుతూ ముఖ్యంగా శ్రీరామనవమి, వినాయకచవితి, పీర్లపండుగలు వంటివి ప్రజల్లో ఐక్యతాభావాన్ని మరింత పెంచుతాయన్నారు. ఈ పండుగలను ప్రతిచోట అన్ని వర్గాల ప్రజలు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిమెలసి ఘనంగా జరుపుకుంటుండటం దేశ ఐక్యతకే నిదర్శనమన్నారు. పండుగలు, ఉత్సవాలు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నాల్లాంటివని తెలిపారు. పండుగలను, శుభ కార్యాలను ప్రజలంతా కలిసి, మెలసి సంతోషంగా జరుపుకోవాలని ఆకేపాటి ఆకాంక్షించారు. అప్పుడే ప్రజల మధ్య చిన్న, చిన్న స్పర్దలు ఉన్నా తొలగిపోతాయని ఆయన తెలిపారు. సమాజంలో సుఖశాంతులు విరాజిల్లాలని ఆకేపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఊటుకూరు–1 ఎంపీటీసీ రేవరాజు శ్రీనివాసరాజు, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు రెడ్డిమాసి రమేష్‌నాయుడు, పోలి మురళీరెడ్డి, రమణారెడ్డి, పసుపులేటి సుధాకర్, పెనిగిలపాటి పెంచలయ్యనాయుడు, గోవిందు బాలక్రిష్ణ, బలిజపల్లె చిన్న తదితరులు పాల్గొన్నారు.