ఇష్టదైవంపై గానామృతం
- శివ ప్రకాశం పేరుతో గానం
- ఈ నెల 24న హైదరాబాద్‌లో విడుదల
- సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): ఇష్టదైవమైన శివునిపై శివప్రకాశం పేరుతో పాటలు గానం చేసినట్లు సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. దీంతో తన చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. తన గానామృత సీడీలను ఈ నెల 24న హైద్రాబాద్‌లోని ఫిలిమ్ చాంబరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం వ్యవసాయశాఖ కర్నూలు సబ్ డివిజన్ కార్యాలయానికి వచ్చి బంధువు, స్నేహితుడైన ఏడీఏ రమణారెడ్డి, ఇతర వ్యవసాయ సిబ్బందితో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇప్పటి వరకు యాక్టింగ్, డైలాగ్స్ మాత్రమే చూశారని, ఇపుడు మొదటి సారిగా శివునిపై పాడిన భక్తి పాటలు వింటారని తెలిపారు. విద్యార్థి దశనుంచే పాటలు పాడటం హాబీగా ఉందని, అయితే శివునిపై భక్తి పాటలు పాడాలనే చిరకాల వాంచ ఇప్పటికి నెరవేరిందన్నారు. జొన్నవిత్తల రచించిన ఆరు పాటలను, వీణపాణి సంగీత దర్శకత్వంలో గానం చేసినట్లు తెలిపారు.
లక్ష్మిదేవికి ఒక లెక్కుంది అనే మూవీలో ఒక పాట పాడినప్పటికి అది పాపులర్ కాలేదన్నారు. ఇప్పటి వరకు 300కు పైగా సినిమాల్లో నటించినట్లు తెలిపారు. నాటక రంగం కారణంగానే తాను ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పిన జయప్రకాశ్‌రెడ్డి ఇటీవల గుంటూరులో ప్రత్యేక నాటక సమాజాన్ని స్థాపించామని వివరించారు. కర్నూలు జిల్లా శిరువెల్ల మండలం వీరారెడ్డిపల్లికి చెందిన తాను గ్రామంలో కష్టాల్లో ఉన్న వారికి చేయూత ఇస్తుంటానని తెలిపారు. ఆయన వెంట సినీ, టీవీ ఆర్టిస్ట్ ఆశా కూడా ఉన్నారు. కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఏఓ అశోక్‌కుమార్‌రెడ్డి, రిటైర్డ్ ఏఓ శివశంకర్ తదితరులతో ఆయన కలిశారు.