
ఎగసిన మద్యం మంటలు
నెల్లూరు (సెంట్రల్) : ఇళ్లమధ్య.. ప్రధాన రహదారుల వెంబడి మద్యం దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ జిల్లా మహిళలు ఉద్యమ బాట పట్టారు. సారా వ్యతిరేక ఉద్యమకారిణి దివంగత దూబగుంట రోశమ్మ స్ఫూర్తితో మద్యం మహమ్మారిని నియంత్రించాలంటూ బావుటా ఎత్తారు. పలుచోట్ల నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న మద్యం దుకాణాలను ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తే సహించేది లేదంటూ అక్కడక్కడా ధ్వంస రచనకు పూనుకున్నారు. జాతీయ రహదారి, ప్రధాన రహదారుల వెంబడి దుకాణాలు ఏర్పాటు చేయడంపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేయడంతో ఇళ్ల మధ్య వాటిని ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు పూనుకుంటున్నారు. దీనివల్ల తాము ఇళ్లనుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదని, విద్యార్థునులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే అవకాశం కోల్పోతారనే ఆందోళన నెలకొంది. ఇందుకు వ్యతిరేకంగా మహిళలు ఎక్కడికక్కడ ఆందోళనబాట పట్టారు.
జిల్లా వ్యాప్తంగా ధర్నాలు.. నిరసనలు
ఇళ్లమధ్య మద్యం దుకాణాలు వద్దంటూ జిల్లా వ్యాప్తంగా సోమవారం ధర్నాలు, నిరసనలు హోరెత్తాయి. నెల్లూరు నగరంలోని తల్పగిరి కాలనీ, కోవూరు నియోజకవర్గ పరిధిలో బుచ్చిరెడ్డిపాలెంలోని శివా లయం వద్ద, ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా నిలువరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చారు. వెంకటగిరిలో మద్యం దుకాణాలు వద్దంటూ మనులాలా పేట వాసులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గూడూరు మండలం విందూరు ఎస్సీ కాలనీలో మద్యం షాపు నిర్మాణ పనులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తోటగూడూరు మండలంలో మద్యం షాపు వద్దంటూ నరుకూరు సెంటరులో ర్యాలీ నిర్వహించారు.
వెంకటాచలం మండలంలోని గుడ్లూరు వారిపాళెంలో మద్యం దుకాణం వద్దంటూ స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పొదలకూరులో మద్యం షాపు వద్దంటూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కావలి పట్టణంలోని వైకుంఠపురంలో మద్యం షాపు వద్దంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. తుమ్మలపెంట రోడ్డులో మద్యం షాపులు వద్దంటూ ఆందోళన కార్యక్రమాలు జరి గాయి. ఆత్మకూరు పట్టణంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదురుగా దుకాణం ఏర్పాటును దళితులు అడ్డుకున్నారు. అనంతసాగరం మండలం సోమశిల బీసీ కాలనీలో పాత కలువాయి రోడ్డు వద్ద మద్యం దుకాణం ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు.
మద్యం బాటిళ్లు ధ్వంసం
ఆత్మకూరు రూరల్ : ఇళ్లమధ్య మద్యం దుకాణం పెట్టొద్దంటూ ఆర్డీఓతోపాటు ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేసినా పట్టించుకోకుండా దుకాణం ఏర్పాటు చేయడంతో ఆత్మకూరు పట్టణ మహిళలు ఆగ్రహోదగ్రులయ్యారు. పట్టణంలోని బజారు వీధికి సమీపంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట మిరియాలకట్ట వద్ద ఏర్పాటు చేసిన దుకాణంలోకి చొచ్చుకెళ్లి మద్యం సీసాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇక్కడ దుకాణం ఏర్పాటును నిరసిస్తూ ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ప్రదర్శన, ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
సోమవారం రాత్రి అదే స్థలంలో మద్యం దుకాణం తెరవడంతో దళిత మహిళలు ఆగ్రహించి దాడికి దిగారు. మొండిగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు.