
అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం
► మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్
జన్నారం(ఖానాపూర్): అన్నివర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. మండలంలోని జన్నారం జామ మజీద్‌లో శుక్రవారం ఆయన ముస్లింలను కలిశారు. ఈ సందర్భంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొంతం శంకరయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అన్నారు. పండుగ శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కలిసిమెలసి ఉండాలన్నారు. పార్టీ అధిష్టానానికి కట్టుబడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ నందునాయక్, సురేశ్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.