- మూడు కేసుల్లో ముందుకెళ్లని విచారణ
- కేసు నమోదుకే పరిమితమైన పోలీసులు
- ఇతర సెటిల్‌మెంట్లలో తలమునకలు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీసులు ఎంతో భేష్.. అని ఆ శాఖ ఉన్నతాధికారులు లెక్కలేనన్ని సార్లు కితాబిచ్చి ఉంటారు. మరి... ఆ గౌరవాన్ని మన పోలీసులు నిలబెడుతున్నారా? అంటే కాసింత వెనుకాముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సంచలనం, కలకలం సృష్టించిన సంఘటనల మిస్టరీని ఛేదించిన వరంగల్ పోలీసులు... ఇటీవల జరిగిన మూడు ఘటనల్లో నిందితులను పట్టుకోవడంలో ముందడుగు వేయలేకపోతుండడం అందుకు ఆస్కారమిస్తోంది. అసలు ఆ కేసులేంటి? పోలీసులు ఏం చేస్తున్నారో? వివరాల్లోకి వెళితే...
హన్మకొండ విజయ్‌పాల్ కాలనీలో ఈ ఏడాది మార్చి ఏడో తేదీన ఓ వివాహిత హత్యకు గురైంది. ప్రాథమిక విచారణలో మాత్రం ఆమె సంబంధీకులే ఈ హత్య చేసుంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంతకుమించి ఆ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు.
అది మే 29. పట్టపగలే హంటర్‌రోడ్డులోని నందిహిల్స్‌లో ఓ ఇంట్లో పెద్ద దొంగతనం జరిగింది. అది కూడా ఆ దొంగలు తాము సీబీసీఈడీ అంటూ సినీఫక్కీలో రూ.50లక్షలు దోచుకెళ్లడం అప్పుడు పెద్ద సంచలనమే సృష్టించింది. అంత పెద్దమొత్తం ఇంట్లో ఉన్న విషయం డబ్బు ఇచ్చిన వారికి, పుచ్చుకున్నవారికి, ఆసమయంలో వారి వెంట ఉన్నవారికి మాత్రమే తెలిసుంటుందనేది పలువురి వాదన. పోలీసులు కూడా అదే వాదనను నిర్ధారించుకున్నప్పటికీ కేసులో నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
కీర్తినగర్‌లోని శ్రీలంకనగర్ కాలనీలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఎవరో తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు. కానీ, దానివెనుక దాగి ఉన్న అసలు మర్మాన్ని బయటపెట్టడంలో వారు చేసిందేమీ లేదనే చెప్పొచ్చు. మే 18వ తేదీన జరిగిన మర్డర్.. దాదాపు మూడు నెలలవుతోంది. ఈ కేసులో ఆటోడ్రైవర్, పనిమనిషి, వారి దగ్గరి బంధువులను విచారించిన గీసుకొండ పోలీసులు... నిందితులెవరో కనిపెట్టలేకపోయారు.
రిస్క్ ఎందుకనీ...
అయితే, ఎన్నికల నేపథ్యంలో కొంతమంది కొందరు అధికారులు జిల్లాకు వచ్చారు. రేపోమాపో ఇక్కడి నుంచి వెళ్లిపోతాం.. మనకెందుకులే.. అని వీరు కేసుల దర్యాప్తుపై పెద్దగా దృష్టిసారించడం లేదని తెలుస్తోంది. తాము వెళ్లిపోయాక కొత్తగా వచ్చేవారు తంటాలు పడతారనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఖాళీగా ఉండడం ఎందుకనీ... సెటిల్‌మెంట్లలో ఫుల్లుగా మునిగిపోయినట్లు డిపార్ట్‌మెంటులోనే చర్చసాగుతోంది. ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలను చక్కదిద్దుతూ ఎంతోకొంత వెనకేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా.. కొరుకుడుపడని కేసుల మిస్టరీని ఇట్టే ఛేదించే సత్తా గల పోలీసులుగా పేరున్న జిల్లా పోలీసు శాఖ.. సంచలనం కలిగించిన పై మూడు సంఘటనల్లో నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి సాధించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కొత్తవారు వస్తారా?
నగరంలో పలువురు సీఐలకు బదిలీల రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మడికొండ, కాజిపేట, సుబేదారి, హన్మకొండ, మట్టెవాడ, ఇంతెజార్‌గంజ్, మిల్స్‌కాలనీ, కేయూసీ, హసన్‌పర్తి స్టేషన్ల సీఐలకు దాదాపు పోస్టింగులు కూడా ఖరారైనట్లు చర్చించుకుంటున్నారు.