ఆద్యంతం.. నవరసభరితం | all over interesting | Sakshi
Sakshi News home page

ఆద్యంతం.. నవరసభరితం

Published Tue, Jan 24 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

ఆద్యంతం.. నవరసభరితం

ఆద్యంతం.. నవరసభరితం

- అలరిస్తున్న నంది నాటకోత్సవాలు
– సామాజిక, కుటుంబ అంశాలే ఇతివృత్తాలు
– ఆకట్టుకున్న క్రైమ్‌స్టోరీ
-  సైకతశిల్పం రేపటికి వాయిదా
 
కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్ర స్థాయి నందినాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన నాటికలు కుటుంబసమస్యలు, సామాజిక అంశాల ఇతివృత్తాలతో సాగాయి. రాత్రి ఉద్యోగం వల్ల కలిగే అనర్థాల గురించి చెప్పే ‘కొత్తబానిసలు’, నిత్య జీవితంలో జరిగే సంఘటనలు ప్రాప్తమా లేక మాయా మంత్రాలా అనే ఇతివృత్తంతో సాగే ‘నియతి’, గెస్ట్‌హౌస్‌లో జరిగే హత్య నేపథ్యంలో సాగే ‘మిస్టరీ’, కుమారుడిపై ఉన్న ప్రేమ వెలకట్టలేనిదని తెలిపే ‘రుణాబంధ రూపేణా’, ఆస్తి కంటే అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’ హృదయాన్ని హత్తుకుంటాయి. మంగళవారం మొత్తం ఏడు నాటికలు జరగాల్సి ఉండగా కళాకారులు, టెక్నీషియన్లు రాకపోవడంతో నాయకురాలు నాగమ్మ రద్దు కాగా, సైకతశిల్పం 26వ తేదీకి వాయిదా పడింది. 
 
రాత్రి ఉద్యోగానికి భాష్యం చెప్పే ‘కొత్త బానిసలు’ 
భార్యాభర్తలిద్దరూ రాత్రి ఉద్యోగాలు చేస్తే వారి మనసులు ఎలా స్పందిస్తాయో...చిన్న చిన్న విషయాలకు కూడా ఎలా గొడవలు పెరిగిపోతాయో ‘కొత్త బానిసలు’ నాటిక కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో సంబంధం లేని గృహహింస చట్టాన్ని ఆశ్రయించి బతుకుని రోడ్డు మీదకు తెచ్చేలా భార్య ప్రవర్తించి విడాకుల వరకు వెళ్తుంది. వీరి సమస్యకు రాత్రి ఉద్యోగమేనని తెలుసుకున్న మానసిక వైద్యుడు వారికి కౌన్సిలింగ్‌ ఇస్తాడు.
 
‘నైట్‌ షిఫ్ట్‌లు చేస్తున్న ఓ రాత్రి ఉద్యోగులురా..!! ఆత్మవిశ్వాసం, ధృఢ సంకల్పం ఉంటేనే రాత్రి ఉద్యోగాలు చేయండి, లేదంటే ప్రతి చిన్నదానికీ అతిగా స్పందించి జీవితాన్ని బలిచేయాల్సి ఉంటుంది జాగ్రత్త’ అని వైద్యుడు బదులిస్తాడు. అటు హాస్యం, ఇటు సందేశాత్మకంగా ఉన్న ఈ నాటికను హుజూరాబాద్‌లోని ఈటెల నాటక రంగ కళాకారుల సమాఖ్య ప్రదర్శించింది. రచన డాక్టర్‌ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం కొలుగూరి దేవయ్య. పాత్రదారులు కొలుగూరి దేవయ్య, ఎం. ప్రకాశ్, కుడికాల ప్రభాకర్, ముదం కుమారస్వామి, దేవసేన నటించారు. 
 
ఆకట్టుకున్న ‘నియతి’  
మంత్రాలు, మహత్తులు ఉన్నాయా..? ఉంటే వాటి సాయంతో మనం జీవితంలో కావాలనుకున్నవి సాధించగలమా..?, అది సాధ్యపడేటట్లయితే జీవితంలో మనకు ఎదురయ్యే ఆటు–పోట్ల సంగతేమిటి.?, మనం కోరుకోకపోయినా అవి జరుగుతున్నాయే...!, అందుకు కారణం నియతి అంటే ప్రాప్తం అంటారే..!, అది ఎంత వరకు నిజం..?. ఆనందంగా తృప్తిగా బతుకుతున్న ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎదురుచూడని సంఘటనలు ఈ సమస్యను, సందేహాన్ని ఎంత వరకు తీరుస్తాయంటూ ఆలోచింపజేసే నాటిక ఈ ‘నియతి’. హైదరాబాద్‌లోని శ్రీ మహతి క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటికకు రచన చిట్టాశంకర్, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ. పాత్రదారులు చిట్టాశంకర్, మంజునాథ్, శివరామకృష్ణ, సుబ్బారావు, విజయలక్ష్మి నటించారు. 
  
ఉత్కంఠ భరిత మలుపులతో ‘మిస్టరి’
 హైదరాబాద్‌కు చెందిన శ్రీ మహతి క్రియేషన్స్‌ వారు ‘మిస్టరి’ అనే నాటికను ప్రదర్శించారు. ఓ గెస్ట్‌హౌస్‌లో జరిగిన హత్యకు సంబంధించిన ఇతి వృత్తమే మిస్టరీ. సూర్యం, సునీత దంపతులు భీమిలిలో గెస్ట్‌హౌస్‌ ప్రారంభిస్తారు. అందులో సైకాలజీ లెక్చరర్‌ సుకుమార్, రిటైర్డ్‌ జడ్జి జగన్నాథం, రిటైర్డ్‌ ఆర్మీ మేజర్‌ మిత్రకాంత్, బిజినెస్‌మ్యాన్‌ చక్రధర్‌ రూములు అద్దెకు తీసుకుంటారు. అంతకుముందు రోజు రాత్రి విశాఖపట్టణంలో దుర్గమ్మ అనే మహిళ దారుణంగా హత్యకు గురైనట్లు టీవీ న్యూస్‌లో వారు తెలుసుకుంటారు. ఆ హత్యకు, గెస్ట్‌హౌస్‌కు సంబంధం ఉందంటూ స్థానిక సీఐ గిరిధర్‌ విచారణ చేసేందుకు వస్తారు. దర్యాప్తు జరుగుతుండగానే జగన్నాథం హత్యకు గురవుతారు. ఈ హత్యలకు కారణం ఏమిటి..?, హంతకులు ఒకరా..ఇద్దరా..? హంతకుడు పట్టబడతాడా లేదా ..? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ నాటిక సాగుతుంది. ఈ నాటికకు రచన డీఏ సుబ్రహ్మణ్యశర్మ, దర్శకత్వం ఉప్పలూరి సుబ్బరాయశర్మ వహించారు. పాత్రదారులు ఏకే శ్రీదేవి, నిట్టల శ్రీరామ్మూర్తి, ఆర్‌. ప్రేమ్‌సాగర్, సతీష్‌కుమార్, చిట్టా శంకర్, పి. సుబ్బారావు, పుండరీక శర్మ, జానకీనాథ్, మల్లికార్జున నటించారు. 
 
తండ్రీ కొడుకుల అనుబంధమే ‘రుణానుబంధ రూపేణా’
అనంతపురం లలిత కళాపరిషత్‌ వారి ‘రుణానుబంధరూపేణా’ నాటిక కుటుంబ బాంధవ్యాలను కళ్లకు కడుతుంది. కథలోకి వెళ్తే మధ్యతరగతికి చెందిన రంగనాథం కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తాడు. ఆయన భార్య తులసి అర్దంతరంగా మరణిస్తుంది. ఇదే సమయంలో కోడలు భేషజాలకు పోయి రంగనాథాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. కోడలు పట్ల కొడుకు నిర్లక్ష్యంతో చివరకు ఆయన వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓసారి రంగనాథం కుమారుని కిడ్నీలు పాడై అసహాయస్థితిలో ఆసుపత్రిలో ఉంటాడు. అతనికి తెలియకుండానే తండ్రి వైద్యుని సహాయంతో కిడ్నీలు దానం చేసి ప్రాణం నిలబెడతాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని తెలుసుకున్న కుమారుడు ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. కోడలు కూడా తన తప్పును తెలుసుకుని రంగనాథాన్ని వృద్ధాశ్రమం నుంచి ఇంటికి రమ్మని కోరుతుంది. కానీ తనకు ఇంటికన్నా వృద్ధాశ్రమంలోనే చాలా అవసరం ఉందని తిరస్కరించి వెళ్లిపోతాడు. ఈ నాటికకు రచన సి. రాము, దర్శకత్వం డి. మస్తాన్‌సాహెబ్‌.  
 
అనుబంధాలే ముఖ్యమని చెప్పే ‘పంపకాలు’
 మీకోసమే వారి ‘పంపకాలు’ అనే సాంఘిక నాటిక అన్నదమ్ములు ఆస్తి పంపకాల ఇతివృత్తం గురించి ప్రదర్శించారు. పట్నంలో ఉద్యోగం చేస్తున్న ప్రభాకర్‌ తన పొలాన్ని భాగం వేయించుకుని, దాన్ని అమ్మి పట్నంలో ఇళ్లు కొందామని సొంతూరు బయలుదేరతాడు. ఇంటికి వెళ్లేసరికి తండ్రి, అన్నయ్య ఇంట్లో ఉండరు. విషయాన్ని ప్రభాకర్‌ తన వదినతో ప్రస్తావిస్తాడు. వారి మధ్య పిల్లల చదువులు, పెంపకం ప్రస్తావనకు వస్తాయి. ‘పొలాన్ని పంచడమంటే శరీర భాగాలను పంచినట్లే’ అని వదిన చెబుతుంది. తర్వాత అన్న రాఘవ తమ్మునిపై ప్రేమతో పంపకాలు ఏమీ ఉండవు ఆస్తి అంతా నువ్వే అనుభవించు అని ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. పెద్దకుమారుని వెంటే తండ్రి కూడా వెళ్లిపోతుండటంతో ప్రభాకర్‌కు జ్ఞానోదయం అవుతుంది. ఆస్తి పంపకాల కంటే అనుబంధాలే ముఖ్యమని గ్రహించడంతో కథ సుఖాంతం అవుతుంది. కుటుంబంలో జరిగే ఇలాంటి సంఘటనలను ఎంతో హృద్యంగా ప్రదర్శించారు. రచన డాక్టర్‌ బొక్కా శ్రీనివాసరావు, దర్శకత్వం ఎంఎస్‌కె ప్రభు. పాత్రదారులు ఎంఎస్‌కె ప్రభు, డాక్టర్‌ బొక్కా శ్రీనివాసరావు, రవికుమార్, హసీనాజాన్‌ నటించారు.
   
నేటి నాటికలు
బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ వాసవి డ్రమెటిక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారి ‘విముక్త’, ఉదయం 10.30 గంటలకు శ్రీ కృష్ణతెలుగు థియేటర్‌ ఆర్ట్స్‌ వారి ‘ఇంకెంత దూరం’, మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ట్‌ ఫామ్‌ క్రియేషన్స్‌ వారి ‘ఓ కాశీ వాసి రావయ్యా’, సాయంత్రం 4.30 గంటలకు లలిత కళా సమితి వారి ‘నిష్క్రమణ’, రాత్రి 7 గంటలకు కళావర్షిణి వారి ‘ఊహాజీవులు’, రాత్రి 8.30 గంటలకు గోవాడ క్రియేషన్స్‌ అసోసియేషన్‌ వారి ‘రచ్చబండ’ సాంఘిక నాటికలు ప్రదర్శితమవుతాయి. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement