
కోచ్‌ల నియామకంలో అంతా గోప్యతే!
►గుట్టుచప్పుడు కాకుండా శాప్ నోటిఫికేషన్
►ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు
►26న ఇంటర్వూలు
►ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకం
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో సాధారణ యువత మాదిరిగానే క్రీడా ఉద్యోగాల నియామకం కోసం నిష్ణాతులైన అర్హులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 13 జిల్లాల్లో సుమారు 100 మంది క్రీడాశిక్షకుల (కోచ్‌ల) నియామకానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఎన్నో ఏళ్లుగా క్రీడా రంగంలో ఉద్యోగ నియామకాల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర క్రీడాకారులు, శిక్షకుల ఆశలపై నీళ్లు చల్లినట్లుగా కన్పిస్తోంది. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు దక్కకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కోచ్‌లుగా నియమించుకునేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ చూస్తే ఇది పెద్ద కుట్రగా అర్థమవుతోంది. ఇచ్చే పోస్టులు కాంట్రాక్ట్ పోస్టులా అంటే అది కూడా కాదు. ఔట్ సోర్సింగ్‌లో పద్ధతిలో నియామకమట. ఈనెల 18తో దరఖాస్తు చేసుకునేందుకు గుడువు ముగిసింది. ఈనెల 26 నుంచి ఇంటర్వూ్యలు నిర్వహించనున్నారు.
ఔట్‌సోర్సింగ్‌లో నియామకం ఎందుకు?
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై అధ్యయన పర్యటన (స్టడీ టూర్) కోసం ముగ్గురు సభ్యుల బృందం గుజరాత్, మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల్లో పర్యటించింది. ఆ బృందం ఏ రాష్ట్రంలో కోచింగ్ బాగుంది. ఎక్కడ క్రీడాభివృద్ధి త్వరితగతిన జరిగిందనే దానిపై ప్రభుత్వానికి నివేదికిచ్చింది. ఈ బృందం గుజరాత్‌లో వేగంగా క్రీడాభివృద్ధి జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఇందుకు కారణం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కోచ్‌ల నియామకం జరిగిందని. అందుకే ఆ కోచ్‌లు బాగా పనిచేశారనే నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో మునెప్పన్నడూ లేని విధంగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కోచ్‌ల నియామకం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గుజరాత్‌లో ఔట్‌సోర్సింగ్ కోచ్‌లకు ఇచ్చే కనీస జీతం రూ.40 వేలుగా ఉంది. ఇక్కడ మాత్రం రూ.18 వేలుగా నిర్ణయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం జీతం రూ.30 వేలకు పైగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఉంది. ఒకే పనికి ఒకే వేతనం ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని క్రీడావర్గాలు చెబుతున్నాయి.
స్థానికులకు మొండిచెయ్యి..
ఈ పోస్టులకు భారత జాతీయులై ఉండాలని నిర్దేశించారు. అంటే మన రాష్ట్ర క్రీడాకారులకు, శిక్షకులకు చోటు దక్కే అవకాశం అనుమానమే. పోతే విద్యార్హతలుగా ఏదైనా డిగ్రీతోపాటు టెక్నికల్‌గా నిర్దేశించిన ఈ ఐదింటిలో ఏ ఒక్క దానిలోనైనా అర్హత ఉంటే చాలట.
ఐదు అర్హతలు ఏమిటంటే..
►డీఎన్‌ఐఎస్ (డిప్లొమా)కోర్సు. ఈ కోర్సు సంవత్సరన్నర కాలం పాటు ఉంటుంది. ఈ కోర్సు చేయాలంటే ఏదైనా డిగ్రీతో పాటు ఆయా క్రీడాంశంలో మూడు సీనియర్ నేషనల్స్‌లో పతకాలు సాధించి ఉండాలి.
►ఎన్‌ఐఎస్ (ఆరువారాల సర్టిఫికెట్ కోర్సు) ఉండాలి. ఇది చేయాలంటే కేవలం ఏదైనా నేషనల్స్‌లో పాల్గొంటే సరిపోతుంది.
► జూనియర్, సీనియర్ నేషనల్స్‌లో పతకాలు సాధించి ఉండాలి.
►నేషనల్స్‌లో పాల్గొని ఉండాలి.
► రాష్ట్ర స్థాయిలో పతకం సాధించి ఉండాలి.
అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటున్న ఈ ప్రభుత్వం ఒక క్రీడా శిక్షకుని నియామకానికి కచ్చితమైన మార్గదర్శకాలుగాని, అర్హతలు నిర్దేశించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. విడుదల చేసిన నోటిఫికేషన్‌లో శాప్ ఎండీగాని, స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంతకాలు లేవు. దీనిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ కాపీలను క్రీడా సంఘాలకు, క్రీడా సమాఖ్యలకు, ఆయా రాష్ట్రాల స్పోర్ట్స్ బోర్డులకు పంపిన అధికారులు దానిని అధికారికంగా పత్రికలకు ఎందుకు విడుదల చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్‌లో భారత జాతీయ క్రీడైన హాకీకి, ఒలింపిక్స్‌లో ఈ రాష్ట్ర ఒలింపియన్ కరణం మల్లేశ్వరి పతకం తెచ్చిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడకు చోటు లేకపోవడంపై క్రీడా వర్గాలు విస్తుపోతున్నాయి.