మరో వివాదంలో దుర్గగుడి అధికారులు | Allegations against durga temple employees | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో దుర్గగుడి అధికారులు

Published Thu, Mar 10 2016 8:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

మరో వివాదంలో దుర్గగుడి అధికారులు

మరో వివాదంలో దుర్గగుడి అధికారులు

విషమంగా అర్చకుడి ఆరోగ్యం
ఈవో వేధింపులే కారణమని కుటుంబీకుల ఆరోపణ
వేధింపులు అవాస్తవం : ఈవో

 
విజయవాడ :  దుర్గగుడి అధికారులు మరో వివాదంలో చిక్కుకున్నారు. దేవస్థాన ఉన్నతాధికారుల హెచ్చరికతో ఓ అర్చకుడి ఆరోగ్య పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో బాధితుడు చికిత్స పొందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
 
భవానీపురానికి చెందిన మంగళంపల్లి సుబ్బారావు దుర్గగుడిలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. సుబ్బారావుకు అనారోగ్యంగా ఉండడంతో తన సోదరుడిని సహాయకుడిగా నియమించుకున్నాడు. గత శుక్రవారం సుబ్బారావు స్థానంలో సోదరుడు  రూ. 20ల టికెట్ క్యూ లైన్‌లో డ్యూటీ చేస్తుండగా ఓ బ్యాంక్ ఉద్యోగి బండి రత్నం అనే భక్తుడు అమ్మవారి దర్శనానికి వచ్చారు.
 
డ్యూటీ చేస్తున్న అర్చకుడు కాకుండా మరో వ్యక్తి తనను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడంటూ, అతను బినామీ అని సదరు బ్యాంక్ ఉద్యోగి ఆలయ  ఈవో నర్సింగరావుకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఈవో నర్సింగరావు సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీని పెట్టుకున్నావని, వెంటనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. జరిగిన విషయాన్ని సుబ్బారావు ఈవోకు వివరించే లోగానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
సస్పెన్షన్‌కు బదులుగా జరిమానా
సుబ్బారావు, అతని సోదరుడు ఈవోను కలిసి సస్పెం డ్ చేయవద్దని కోరగా రూ. 20 వేలు ఫైన్ చెల్లించాలని ఆదేశించారు. చెల్లించని పక్షంలో అవుట్ పోస్టులో పెట్టిస్తానని హెచ్చరించారు. సుబ్బారావు అభ్యర్ధన మేరకు రూ. 15 వేలు జరిమానా కట్టించుకోవాలని ఈవో సీసీ చాంబర్‌కు సమాచారం అందించారు.
 
అటెండర్, సీసీ వేధింపులు
ఈవోకు వాస్తవ విషయాన్ని చెప్పేందుకు సుబ్బారావు యత్నించగా అటెండర్, సీసీ సతీష్ ఇష్టానుసారంగా మాట్లాడారని సుబ్బారావు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈవోను కలిసి ఇంటికి వచ్చిన సుబ్బారావు ఆలయ ప్రాంగణంలో జరిగిన విషయాన్ని భార్య  దుర్గాదేవి, కుటుంబీకులకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సుబ్బారావు హైబీపీతో బాధపడడంతో కుటుంబీకులు  భవానీపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
 
రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందినా మార్పు రాకపోవడంతో బుధవారం సూర్యారావు పేటలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి  తరలించారు. వైద్యులు సుబ్బారావును పరిశీలించి 24 గంటలు అయితేనే తప్ప చెప్పలేమన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు దేవాదాయ శాఖ ఏసీ చంద్ర కుమార్‌ను నియమిస్తూ  ఆ శాఖ  కమిషనర్ అనురాధ  ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఘటనపై ఆలయ అర్చకులు బుధవారం నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు.
 
భర్తకు ఏమి జరిగినా ఈవోదే బాధ్యత

 నా భర్తకు ఎటువంటి అపాయం జరిగినా దానికి ఈవో నర్సింగరావుదే పూర్తి బాధ్యత. రెండు రోజులుగా కోమాలో ఉన్నా కనీసం అధికారులు వచ్చి పలకరించింది లేదు. ఆసుపత్రి ఖర్చులు భరించే అవకాశం ఉన్నా ప్రతి రూపాయి ఈవోనే చెల్లించాలి.
     -దుర్గాదేవి, సుబ్బారావు భార్య
 
జరిమానా వేశా
అర్చకులు సహాయకులను నియమించవద్దని గతంలోనే ఆదేశించాం. అయినా సహాయకులు పెట్టుకున్నారు. ఒక బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేయాలని నిర్ణయించా. అర్చకుల కోరిక మేరకు సస్పెండ్ చేయకుండా ఫైన్ వేశా. తన సిబ్బంది కాని అతన్నిపై దుర్భాషలాడలేదు. ఈ విషయం ఆయన ప్రక్కనే ఉన్న యజ్ఞనారాయణ శర్మ, బుజ్జిలు చెబితే నా ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు వచ్చే సొమ్ము అతనికి ఇస్తా. - సీహెచ్ నర్సింగరావు, ఈవో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement