చిన్నారుల విషయంలో అప్రమత్తత అవసరం
Published Thu, Jul 21 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
పట్నంబజారు (గుంటూరు) : ఇటీవల కాలంలో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు కనిపించకుండా పోవడం అధికమవుతోందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు కనబడకుండాపోవడం కలవరపాటుకు గురిచేసే అంశమన్నారు. అయితే చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు నివాసం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందన్నారు. విద్యార్థుల పట్ల కుటుంబ సభ్యులతోపాటు, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో బయటకు వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థులకు ఇష్టం లేని కోర్సుల్లో చేర్పించడం, నిర్బంధంగా హాస్టల్‌లో చేర్పించడం వంటివి సరికాదన్నారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆయా కోర్సుల్లో చేర్పించడం ఉత్తమమని తెలిపారు. కుటుంబ కలహాలు, ఆస్తుల విషయాల్లో ఏర్పడే వివాదాలు చిన్నారులు, విద్యార్థులకు తెలియకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
Advertisement
Advertisement