సీఎం రాష్ట్రానికా.. రాజధానికా..
-
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ధ్వజం
డాబాగార్డెన్స్ : ‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. నీవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రివా? అమరావతి రాజధానికి మాత్రమే సీఎంవా?’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం అతి పెద్ద నగరంగా విశాఖపట్నం అవతరిస్తుంటే.. ఇక్కడ కేటాయించిన విద్యా సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటే ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగదాంబ కూడలి సమీపంలోని పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్(ఐఐపీఎం)ను కేంద్ర ప్రభుత్వం అనకాపల్లిలో ఏర్పాటు చేసేందుకు భూములు సేకరిస్తే.. అదే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కృష్ణా జిల్లా కొండపల్లి ప్రాంతానికి తరలించడం సబబేనా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. గతంలో విశాఖలో ఏర్పాటు చేయాల్సిన ఐఎఫ్‌టీ(అటవీ సంస్థ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజ్(ఐఐపీ)ని కాకినాడకు తరలించేశారని, తాజాగా అనకాపల్లిలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయాల్సిన ఐఐపీఎంను కృష్ణా జిల్లాకు తరలించడంలో ఆంతర్యమేమిటన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఉన్న సంస్థను తరలించుకుపోతే ఈ ప్రాంత కేంద్ర, రాష్ట్ర మంత్రులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినట్టే, ఇప్పుడు అమరావతి, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ప్రాజెక్టులన్నీ పెట్టుకుంటూ పోతే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
గతేడాది భాగస్వామ్య సదస్సును విశాఖలో నిర్వహించిన సమయంలో కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు పరిశ్రమలు వస్తున్నాయని ప్రకటనలు చేశారు గానీ.. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమమైనా రాలేదన్నారు. ఈ ప్రాంతాన్ని అవమానించేలా మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.లక్ష కేటాయించడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పిదాలనే తిరిగి చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లోని జరగాలని సూచించారు. రైల్వే జోన్‌పై మరోసారి వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధమవుతుందని గుడివాడ తెలిపారు. పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ మాట్లాడుతూ విద్యా సంస్థలకు సరిగ్గా నిధులు విడుదల చేయడం లేదన్నారు. హైకోర్టు బెంచ్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబువన్నీ ప్రచార ఆర్భాటాలే తప్ప, చేసేది శూన్యమన్నారు.