’ఆనందో’ఖర్మ!
’ఆనందో’ఖర్మ!
Published Sat, Aug 19 2017 11:14 PM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM
మృత్యుద్వారం పునఃప్రారంభం!
మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో
భద్రతా చర్యలకు అనుమతి
ప్రారంభమైన పనులు
ఇక కార్యకలాపాల మొదలే తరువాయి
నిండా 30 ఏళ్లు నిండని యువకులను బలిగొన్న ఆ మృత్యుద్వారం తెరుచుకోబోతుందా..! దీనికి Ðసర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా..! అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో దుర్ఘటన జరిగి ఐదునెలలు గడవకముందే అందులో భద్రతా చర్యలకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం చేపట్టే పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నరసాపురం, మొఘల్తూరు :
అసలేం జరిగింది...!
ఈ ఏడాది మార్చి 30న నరసాపురం తీరప్రాంతం గజగజ వణికిపోయింది. మొగల్తూరు మండలం నల్లవారితోటలోని ఆనంద రొయ్యల ఫ్యాక్టరీలో వ్యర్థాలను నిల్వ ఉంచే ట్యాంకును శుభ్రం చేస్తుండగా అందులో విడుదలైన విషవాయువుకు ఐదుగురు యువకులు బలయ్యారు. మృత్యుఒడికి చేరారు. ప్రమాదంలో నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు(22). మొగల్తూరు కట్టుకాలువకు చెందిన తోట శ్రీనివాస్(30), నల్లంవారితోటకు చెందిన నల్లం ఏడుకొండలు(22), మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెటి ప్రవీణ్(23), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు(22) ప్రాణాలు విడిచారు. దీంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ఫ్యాక్టరీ యజమానులపై చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలతో ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలతోపాటుగా ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఇలా.. అంతా ఏకమై నినదించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రకంపనలు పుట్టించింది.
ఫ్యాక్టరీ తెరిచేందుకు సన్నాహాలు
ప్రమాదం జరిగి ఐదునెలలు కూడా ఇంకా పూర్తి కాకుండానే ఫ్యాక్టరీ తెరిచే సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీ యజమాన్యం భద్రతా చర్యలు చేపట్టని కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు అనుమతులు ఇచ్చింది. ఫ్యాక్టరీలో భద్రతా చర్యలకు సంబంధించిన పనులు చేపట్టడానికి కలెక్టర్ కాటంనేని భాస్కర్ అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం ఫ్యాక్టరీ యాజమాన్యం మొదటి దశగా మరమ్మతులు చేపట్టింది. ఇక రెండో దశలో ఫ్యాక్టరీ వ్యవహారాలు పునప్రారంభించడమే తరువాయి. ఇది లాంఛనమేనని వచ్చే నెలలో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.
ఘోరం జరిగినప్పుడు హడావుడి
తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ.. ఆ ప్రాంతం ప్రజలు ఆందోళన చేస్తున్న క్రమంలో మొగల్తూరు రొయ్యల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం ప్రభుత్వ వెన్నులో చలిపుట్టించింది. ప్రభుత్వం తరపున మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు మొగల్తూరు వచ్చి బాధితులను, ఆందోళనకారులను చల్లబరిచే యత్నంచేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. మంత్రులే దగ్గరుండి మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 304 ఏ సెక‌్షన్ ప్రకారం.. ఫ్యాక్టరీ యజమానులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని అప్పటి ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రకటించారు. ఈ హడావుడి చూసి కాలుష్య ఫ్యాక్టరీ గ్రామం నుంచి వెళ్లిపోతుందని స్థానికులు సంబరపడ్డారు. సీన్ కట్ చేస్తే.. రోజులు గడిచాయి. దుర్ఘటన జరిగిన రోజు ఒక విధంగా మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాట మార్చారు. అసెంబ్లీలో ఈ అంశంపై అప్పటికి కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నిబంధనల మేరకే మొగల్తూరు ఫ్యాక్టరీ పని చేస్తుందని ప్రకటించారు. తుందుర్రు ఫ్యాక్టరీతో సహా ఆనంద ఫ్యాక్టరీకూడా అసలు కాలుష్య కారకమైనది కాదని బుకాయించారు. ఫోరెన్సిక్ నివేదికలోనూ ఐదుగురుప్రాణాలు పోవడానికి అమ్మోనియా గ్యాస్ ప్రభావమే కారణమని తేలినా.. ప్రభుత్వ మొండి వైఖరి మారలేదు. కేవలం ఫ్యాక్టరీ యజమాన్యంలో ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చూపించి చేతులు దులుపుకుంది. ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీని తెరిచేందుకు అనుమతిస్తోంది.
భద్రతపై అనుమానాలు
ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీ తెరిస్తే కార్మికుల ప్రాణాలు భద్రమేనా అనే అనుమానాలు స్థానికులను వెంటాడుతున్నాయి. భద్రతకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తుందా? పటిష్ట చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
గొంతేరుపై మళ్లీ కాలుష్యవల!
ఆనంద ఫ్యాక్టరీలో ప్రమాదానికి కారణమైన ట్యాంకు గొట్టాలు నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో కలిపి ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రమాదం జరిగిన తరువాత వైఎస్సార్ సీపీ జిల్లా నాయకత్వం స్వయంగా ఇక్కడకు వచ్చి మీడియా ముందు బట్టబయలు చేసింది. ఫ్యాక్టరీ ప్రారంభం నుంచీ వ్యర్థాలను నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో కలుపుతున్నారు. దీంతో డ్రెయిన్ కలుషితమవుతోంది. ఫ్యాక్టరీ మూతపడిన ఈ ఐదు నెలల్లో స్థానికంగా గొంతేరు డ్రెయిన్ నీరు స్వచ్ఛంగా మారడమే కాకుండా మత్స్యసంపద విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీ ప్రారంభమైతే యాజమాన్యానికి మరో అవకాశం లేదు. కచ్చితంగా వ్యర్థాలను మళ్లీ గొంతేరు డ్రెయిన్‌లోనే కలిపాలి. లేదంటే తుందుర్రులో చెబుతన్నట్టు సముద్ర ప్రాంతానికి పైప్‌లైన్‌లు లాంటివి వేస్తారా? అసలు ఫ్యాక్టరీ లోపల ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారనే దానిపై స్పష్టతలేదు.
కమిటీ ఏదీ?
మరోవైపు ప్రమాదం జరిగిన తరువాత కొత్తగా కార్మికశాఖను అలంకరించిన జిల్లా నేత పితాని సత్యనారాయణ ఈ ప్రమాదంపై కమిటీ వేస్తానని ప్రకటించారు. మళ్లీ అలాంటి ఊసేలేదు. స్థానికులతో ఇంత వరకూ మాట్లాడిన పాపాన పోలేదు. ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల గ్రామాల వారు అంతా ఇక కంపెనీ తెరుచుకోదనే భ్రమలో ఉన్నారు. ఇంత ఘోరం జరిగిన తరువాత కుడా స్థానికులతోనూ, రాజకీయ పక్షాల నేతలు, రైతులతోనూ ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా మొగల్తూరు ఫ్యాక్టరీని మొండిగా తెరిపింపించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement