mogaltur
-
విషాదం నింపిన వేట
బాలుడు మృతి.. యువకుడు గల్లంతు మొగల్తూరు: ఏటిలో చేపలవేట రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. బావబావమరిది కోటేశ్వరరావు (8), పెద్దిరాజు (18) సాయం వేళలో చేపల వేటకు వెళ్లారు. కోటేశ్వరరావు మృతిచెందగా పెద్దిరాజు గల్లంతయ్యాడా లేక భయపడి పారిపోయాడా అన్నది తెలియడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలోని శివాలయం వెనుక వైపు గొంతేరు డ్రెయిన్‌ను ఆనుకుని రెండు పాకల్లో లచ్చమ్మ, దుర్గమ్మ జీవిస్తున్నారు. వీరిద్దరికీ భర్తలు లేకపోవడంతో ఈ కుటుంబాలు చేపలు పట్టుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. లచ్చమ్మ తన ఎనిమిదేళ్ల కుమారుడు కోటేశ్వరరావుతో, దుర్గమ్మ తన కుమారుడు పెద్దిరాజుతో కలిసి ఉంటున్నారు. శనివారం సాయంత్రం కోటేశ్వరరావు, పెద్దిరాజు చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. విషయం గ్రామస్తులకు తెలపడంతో డ్రెయిన్ పొడవునా గాలించగా ఆదివారం రాత్రి కోటేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించారు. పెద్దిరాజు ఆచూకీ సోమవారం సాయంత్రం వరకూ తెలియరాలేదు. దీంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈవిషయంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకుండా కోటేశ్వరరావు మృతదేహాన్ని పూడ్చివేశారు. -
’ఆనందో’ఖర్మ!
మృత్యుద్వారం పునఃప్రారంభం! మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో భద్రతా చర్యలకు అనుమతి ప్రారంభమైన పనులు ఇక కార్యకలాపాల మొదలే తరువాయి నిండా 30 ఏళ్లు నిండని యువకులను బలిగొన్న ఆ మృత్యుద్వారం తెరుచుకోబోతుందా..! దీనికి Ðసర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా..! అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో దుర్ఘటన జరిగి ఐదునెలలు గడవకముందే అందులో భద్రతా చర్యలకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం చేపట్టే పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం, మొఘల్తూరు : అసలేం జరిగింది...! ఈ ఏడాది మార్చి 30న నరసాపురం తీరప్రాంతం గజగజ వణికిపోయింది. మొగల్తూరు మండలం నల్లవారితోటలోని ఆనంద రొయ్యల ఫ్యాక్టరీలో వ్యర్థాలను నిల్వ ఉంచే ట్యాంకును శుభ్రం చేస్తుండగా అందులో విడుదలైన విషవాయువుకు ఐదుగురు యువకులు బలయ్యారు. మృత్యుఒడికి చేరారు. ప్రమాదంలో నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు(22). మొగల్తూరు కట్టుకాలువకు చెందిన తోట శ్రీనివాస్(30), నల్లంవారితోటకు చెందిన నల్లం ఏడుకొండలు(22), మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెటి ప్రవీణ్(23), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు(22) ప్రాణాలు విడిచారు. దీంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ఫ్యాక్టరీ యజమానులపై చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలతో ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలతోపాటుగా ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఇలా.. అంతా ఏకమై నినదించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రకంపనలు పుట్టించింది. ఫ్యాక్టరీ తెరిచేందుకు సన్నాహాలు ప్రమాదం జరిగి ఐదునెలలు కూడా ఇంకా పూర్తి కాకుండానే ఫ్యాక్టరీ తెరిచే సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీ యజమాన్యం భద్రతా చర్యలు చేపట్టని కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు అనుమతులు ఇచ్చింది. ఫ్యాక్టరీలో భద్రతా చర్యలకు సంబంధించిన పనులు చేపట్టడానికి కలెక్టర్ కాటంనేని భాస్కర్ అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం ఫ్యాక్టరీ యాజమాన్యం మొదటి దశగా మరమ్మతులు చేపట్టింది. ఇక రెండో దశలో ఫ్యాక్టరీ వ్యవహారాలు పునప్రారంభించడమే తరువాయి. ఇది లాంఛనమేనని వచ్చే నెలలో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఘోరం జరిగినప్పుడు హడావుడి తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ.. ఆ ప్రాంతం ప్రజలు ఆందోళన చేస్తున్న క్రమంలో మొగల్తూరు రొయ్యల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం ప్రభుత్వ వెన్నులో చలిపుట్టించింది. ప్రభుత్వం తరపున మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు మొగల్తూరు వచ్చి బాధితులను, ఆందోళనకారులను చల్లబరిచే యత్నంచేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. మంత్రులే దగ్గరుండి మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 304 ఏ సెక్షన్ ప్రకారం.. ఫ్యాక్టరీ యజమానులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని అప్పటి ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రకటించారు. ఈ హడావుడి చూసి కాలుష్య ఫ్యాక్టరీ గ్రామం నుంచి వెళ్లిపోతుందని స్థానికులు సంబరపడ్డారు. సీన్ కట్ చేస్తే.. రోజులు గడిచాయి. దుర్ఘటన జరిగిన రోజు ఒక విధంగా మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాట మార్చారు. అసెంబ్లీలో ఈ అంశంపై అప్పటికి కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నిబంధనల మేరకే మొగల్తూరు ఫ్యాక్టరీ పని చేస్తుందని ప్రకటించారు. తుందుర్రు ఫ్యాక్టరీతో సహా ఆనంద ఫ్యాక్టరీకూడా అసలు కాలుష్య కారకమైనది కాదని బుకాయించారు. ఫోరెన్సిక్ నివేదికలోనూ ఐదుగురుప్రాణాలు పోవడానికి అమ్మోనియా గ్యాస్ ప్రభావమే కారణమని తేలినా.. ప్రభుత్వ మొండి వైఖరి మారలేదు. కేవలం ఫ్యాక్టరీ యజమాన్యంలో ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చూపించి చేతులు దులుపుకుంది. ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీని తెరిచేందుకు అనుమతిస్తోంది. భద్రతపై అనుమానాలు ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీ తెరిస్తే కార్మికుల ప్రాణాలు భద్రమేనా అనే అనుమానాలు స్థానికులను వెంటాడుతున్నాయి. భద్రతకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తుందా? పటిష్ట చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గొంతేరుపై మళ్లీ కాలుష్యవల! ఆనంద ఫ్యాక్టరీలో ప్రమాదానికి కారణమైన ట్యాంకు గొట్టాలు నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో కలిపి ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రమాదం జరిగిన తరువాత వైఎస్సార్ సీపీ జిల్లా నాయకత్వం స్వయంగా ఇక్కడకు వచ్చి మీడియా ముందు బట్టబయలు చేసింది. ఫ్యాక్టరీ ప్రారంభం నుంచీ వ్యర్థాలను నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో కలుపుతున్నారు. దీంతో డ్రెయిన్ కలుషితమవుతోంది. ఫ్యాక్టరీ మూతపడిన ఈ ఐదు నెలల్లో స్థానికంగా గొంతేరు డ్రెయిన్ నీరు స్వచ్ఛంగా మారడమే కాకుండా మత్స్యసంపద విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీ ప్రారంభమైతే యాజమాన్యానికి మరో అవకాశం లేదు. కచ్చితంగా వ్యర్థాలను మళ్లీ గొంతేరు డ్రెయిన్‌లోనే కలిపాలి. లేదంటే తుందుర్రులో చెబుతన్నట్టు సముద్ర ప్రాంతానికి పైప్లైన్లు లాంటివి వేస్తారా? అసలు ఫ్యాక్టరీ లోపల ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారనే దానిపై స్పష్టతలేదు. కమిటీ ఏదీ? మరోవైపు ప్రమాదం జరిగిన తరువాత కొత్తగా కార్మికశాఖను అలంకరించిన జిల్లా నేత పితాని సత్యనారాయణ ఈ ప్రమాదంపై కమిటీ వేస్తానని ప్రకటించారు. మళ్లీ అలాంటి ఊసేలేదు. స్థానికులతో ఇంత వరకూ మాట్లాడిన పాపాన పోలేదు. ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల గ్రామాల వారు అంతా ఇక కంపెనీ తెరుచుకోదనే భ్రమలో ఉన్నారు. ఇంత ఘోరం జరిగిన తరువాత కుడా స్థానికులతోనూ, రాజకీయ పక్షాల నేతలు, రైతులతోనూ ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా మొగల్తూరు ఫ్యాక్టరీని మొండిగా తెరిపింపించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
ఆక్వా ప్లాంట్‌లో మృత్యుఘోష
నింగి.. నేల..గాలి.. నీరు.. నిప్పు.. వీటినే పంచభూతాలంటారు. ఇవే మానవాళికి జననంతోపాటు జీవనాన్నీ ఇస్తాయంటారు. వీటిలో ఒకటైన గాలి కాలుష్య రక్కసి బారిన పడింది. ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ తప్పు ప్రకృతిది కాదు. స్వార్థం కోసం.. సంపాదన కోసం కార్పొరేట్ శక్తులు పంచభూతాలను నాశనం చేస్తుంటే.. పట్టించుకోవాలి్సన, ప్రజల ప్రాణాలను పరిరక్షించాలి్సన ప్రభుత్వాలు బాధ్యత మరిచిపోతే.. ఎంతటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయో మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్ ఉదంతం రుజువు చేసింది. అక్కడి రొయ్యల శుద్ధి పరిశ్రమలోని ట్యాంకులో నిల్వ చేసిన వ్యర్థాల నుంచి వెలువడిన విష వాయువులు ఐదుగురు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. 30 టన్నుల సామర్థ్యం గల చిన్నపాటి పరిశ్రమ నుంచి వెలువడిన కాలుష్యమే ఇంతమందిని బలిగొంటే.. తుందుర్రులో ఇంతకు వంద రెట్ల సామర్థ్యంతో అదే యాజమాన్యం నిర్మిస్తున్న ఆక్వా పార్క్ పూర్తయితే ఎంతటి విపత్తు ముంచుకొస్తుందోననే ఆందోళన డెల్టాలో నెలకొంది. నరసాపురం : జిల్లాలో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీరం ఉంది. తుపానులు, వరదలు, పడవ ప్రమాదాలు వంటి వైపరీత్యాలతో అక్కడ ఎప్పుడూ అలజడి నెలకొని ఉంటుంది. ఎంతటి కష్టమొచ్చినా లెక్కచేయని మొండిధైర్యం తీరగ్రామాల వారిది. గురువారం మొగల్తూరులో చోటుచేసుకున్న విషాద ఘటన వారిని భయాందోనకు గురి చేసింది. నల్లంవారి తోటలో ఆక్వా ప్లాంట్ సిమెంట్ ట్యాంకు నుంచి వెలువడిన విషవాయువు ఎంతో భవిష్యత్ ఉన్న ముగ్గురు యువకుల్ని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనలో ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) మృత్యువాత పడ్డారు. ట్యాంకును శుభ్రం చేసేందుకు దినసరి కూలీలుగా వీరంతా సిద్ధమయ్యారు. ఉదయం 8గంటల సమయంలో నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు ట్యాంకులోకి దిగాడు. ఒక్కసారిగా విషవాయువు వెదజల్లడంతో ట్యాంకులోనే కుప్పకూలిపోయాడు. లోపల ఏం జరిగిందో తెలియక మొగల్తూరు కట్టుకాలువ ప్రాంతానికి చెందిన తోట శ్రీని వాస్, నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22) దిగారు. వాళ్లిద్దరూ కూడా బయటకు రాలేదు. చివరకు మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్, మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు ట్యాంకులోకి దిగి క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. ట్యాంకులో దిగిన వారు కనీసం తమకు ఆపద వచ్చిందనే విషయాన్ని సైతం బయటకు చెప్పుకునే వీలుకూడా లేకుండాపోయింది. ఈ ఘటన తీరగ్రామాల్లో ఎన్నడూ లేనంత భయాన్ని నింపింది. కాలుష్య భూతానికి ఐదుగురు మరణించారని తెలియగానే తీరగ్రామాల ప్రజలు హడలిపోయారు. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్న రొయ్యల ఫ్యాక్టరీతో ఇంత ప్రమాదం వచ్చిందని తెలిసి అవాక్కయ్యారు. అంతా ఒక్కటై ఆందోళన చేపట్టారు. మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌ను వెంటనే తొలగించాలని, తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పనులను నిలిపివేయాలని నినాదాలు చేశారు. ‘ఇంత చిన్న ఫ్యాక్టరీ వల్లే ఇంతటి విపత్తు తలెత్తింది. తుందుర్రు లాంటి పెద్ద ఫ్యాక్టరీ వినియోగంలోకి తెస్తే వందలాది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పరామర్శల పేరుతో వచ్చిన అధికార పార్టీ నేతలను నిలదీశారు. బాధ, ఆవేదన నడుమ శాపనార్థాలు పెట్టారు. ‘ఎంత ఘోరం జరిగిందో చూశారా. ఇకనైనా కళ్లు తెరిచి తుందుర్రు ఫ్యాక్టరీ మూయించండి’ మహాప్రభో అని వేడుకున్నారు. ఇదిలావుంటే.. ఈ ఘోరం జరిగిన వెంటనే ప్లాంట్ నిర్వాహకులు, కీలక ఉద్యోగులు అక్కడి నుంచి ఉడాయించారు. ప్లాంట్‌లో మిగిలిన ఉన్న ఉద్యోగులను పోలీసులు బయటకు తరలించే ప్రయత్నం చేయడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్‌పై దాడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యా యి. బాధితులను పలకరించడానికి వచ్చిన ప్రజాప్రతినిధులను వెళ్లిపొమ్మంటూ నినాదాలు చేశారు. తీరగ్రామాల్లో భయం భయం ఈ ఘటన తీరగ్రామాల్లో ఎన్నడూ లేని భయాన్ని నింపింది. ఎప్పుడూ ధైర్యంగా ఉండే అక్కడి ప్రజలు కాలుష్య భూతానికి ఐదుగురు మరణించారని తెలియగానే అక్కడి ప్రజలు హడలిపోయారు. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడాదిన్నరగా మొత్తుకుంటున్నా.. కాలుష్య కారకమైన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఏడాదిన్నరగా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి సహా సమీప 40 గ్రామాల ప్రజలు పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం వారిని జైళ్లపాలు చేసింది. లాఠీలతో కొట్టించింది. చంటిబిడ్డలను సైతం ఇళ్లల్లోంచి బయటకు రానివ్వకుండా అడ్డుకుంది. ఇదే సందర్భంలో నల్లంవారి తోటలోని ఆక్వా ప్లాంట్ కాలుష్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిని మూసివేయాలంటూ అక్కడి ప్రజలు సైతం గతంలో ఆందోళన చేశారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నామని, కాలుష్యాన్ని గొంతేరు డ్రెయిన్ లోకి వదలబోమని నమ్మించింది. అయితే, సిమెంట్ తొట్టె కట్టి.. దానికి రేకులు బిగించి కాలుష్యకారక వ్యర్థాలను, రసాయనాలు కలిసిన జలాలను అందులోకి వదులుతోంది. 15 రోజులకు ఒకసారి తిరిగి నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో కలిపేస్తూ జనాన్ని మోసగిస్తోంది. కలెక్టర్‌ను నిలదీసిన జనం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కరభూషణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు, మృతుల బంధువులు కలెక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయిన ప్రాణాలను ఎవరు తెచ్చి ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఐదుగురి ప్రాణాలు పోయాక పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటామనడం దారుణమంటూ విరుచుకుపడ్డారు. కాలుష్యంపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటే అధికారులంతా ఏం చేశారని, ముందే స్పందించి ఉంటే ఐదుగురి ప్రాణాలు దక్కేవంటూ అధికారులు, ప్రజాప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. శవాలను తరలిస్తున్న అంబులెన్స్ లకు అడ్డుగా పడుకున్నారు. వ్యాన్లను వెళ్లకుండా దారిలో కొబ్బరి దుంగలతో మంటలు పెట్టారు. విద్యుత్ స్తంభాలను రోడ్డుకు అడ్డంగా పడేశారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు అక్కడివారిని చెదరగొట్టారు. ‘మేమంతా బాధలో ఉండి.. న్యాయం అడుగుతుంటే మమ్మల్నే కొడతారా’ అంటూ జనం పోలీసులపై తిరగబడ్డారు. ఆక్వా ప్లాంట్ సీజ్ ఇదిలా ఉండగా నల్లంవారి తోటలోనే ఆనంద ఆక్వా ప్లాంట్‌ను సీజ్ చేసినట్టు కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత నరసాపురంలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మార్చురీలో ఉన్న యువకుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. అన్నయ్యపాత్రుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యంపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలిచ్చామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఎస్పీ భాస్కరభూషణ్ మాట్లాడుతూ 304 ఏ సెక్షన్‌కింద ప్లాంట్ యజమానులపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామన్నారు. ప్లాంట్ నిర్వహణ వ్యవహారాలు పర్యవేక్షించే ఆ సంస్థ అధికారుల నిర్లక్ష్యంపై కూడా చర్యలుంటాయని అన్నారు. -
ముత్యాలమ్మ హుండీ ఆదాయం రూ.10.84 లక్షలు
మొగల్తూరు: మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 67 రోజులకు రూ.10,84,641 నగదు, 11 గ్రాముల 750 మిల్లీగ్రాముల బంగారం, 129 గ్రాముల వెండి, ఐదు విదేశీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, చైర్మన్ దాసరి అమ్మాజీ బాబి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కట్నం వేధింపులకు యువతి బలి
మొగల్తూరు : మహిళా దినోత్సవం రోజున ఓ యువతి కట్నం దాహానికి బలైన ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం తేవాలని భర్త తరచూ వేధిస్తుండడంతో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. భీమవరం మండలం బావాయ్తిప్పకు చెందిన తిరుమాని రామాంజనేయులుకు దెయ్యాలతిప్పకు చెందిన మోకా పద్మశ్రీ (21)తో ఏడాది క్రితం వివాహం జరిగింది. మత్స్యకార కుటుంబానికి చెందిన రామాంజనేయులు కుటుంబం వేట సాగించడం ద్వారా జీవనోపాధి పొందుతోంది. పెళ్లి సమయంలో పద్మశ్రీ కుటుంబ సభ్యులు తమకు ఉన్నదాంట్లో బాగానే కట్నాన్ని ముట్టజెప్పారు. అరుుతే అదనపు కట్నం తీసుకురావాలంటూ రామాంజనేయులు తరచూ పద్మశ్రీని వేధించడం మొదలుపెట్టాడు. కొద్దిరోజులుగా ఈ వేధింపులు ఎక్కువ కావడంతో పద్మశ్రీ శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పద్మశ్రీ తల్లి మోకా దుర్గ, కుటుంబ సభ్యులు తమ కూతురిని కట్నం కోసం చంపేశారని కన్నీరుమున్నీరయ్యూరు. మృతురాలి తల్లి మోకా దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామాంజనేయులు అతని కుటుంబ సభ్యులపై మొగల్తూరు ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా భార్య మృతి చెందడం, పోలీసులు రావడంతో ఆందోళనకు గురైన రామాంజనేయులు ఆదివారం ఉదయం పరుగులమందు తాగాడు. దీంతో పోలీసులు తమ వాహనంలోనే హుటాహుటిన మొగల్తూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.