విషాదం నింపిన వేట
విషాదం నింపిన వేట
Published Tue, Aug 22 2017 12:29 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
బాలుడు మృతి.. యువకుడు గల్లంతు
మొగల్తూరు: ఏటిలో చేపలవేట రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. బావబావమరిది కోటేశ్వరరావు (8), పెద్దిరాజు (18) సాయం వేళలో చేపల వేటకు వెళ్లారు. కోటేశ్వరరావు మృతిచెందగా పెద్దిరాజు గల్లంతయ్యాడా లేక భయపడి పారిపోయాడా అన్నది తెలియడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలోని శివాలయం వెనుక వైపు గొంతేరు డ్రెయిన్‌ను ఆనుకుని రెండు పాకల్లో లచ్చమ్మ, దుర్గమ్మ జీవిస్తున్నారు. వీరిద్దరికీ భర్తలు లేకపోవడంతో ఈ కుటుంబాలు చేపలు పట్టుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. లచ్చమ్మ తన ఎనిమిదేళ్ల కుమారుడు కోటేశ్వరరావుతో, దుర్గమ్మ తన కుమారుడు పెద్దిరాజుతో కలిసి ఉంటున్నారు. శనివారం సాయంత్రం కోటేశ్వరరావు, పెద్దిరాజు చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. విషయం గ్రామస్తులకు తెలపడంతో డ్రెయిన్ పొడవునా గాలించగా ఆదివారం రాత్రి కోటేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించారు. పెద్దిరాజు ఆచూకీ సోమవారం సాయంత్రం వరకూ తెలియరాలేదు. దీంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈవిషయంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకుండా కోటేశ్వరరావు మృతదేహాన్ని పూడ్చివేశారు.
Advertisement