ఆక్వా ప్లాంట్‌లో మృత్యుఘోష | mrutyu ghosha in aqua park | Sakshi
Sakshi News home page

ఆక్వా ప్లాంట్‌లో మృత్యుఘోష

Published Fri, Mar 31 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

ఆక్వా ప్లాంట్‌లో మృత్యుఘోష

ఆక్వా ప్లాంట్‌లో మృత్యుఘోష

 నింగి.. నేల..గాలి.. నీరు.. నిప్పు.. వీటినే పంచభూతాలంటారు. ఇవే మానవాళికి జననంతోపాటు జీవనాన్నీ ఇస్తాయంటారు. వీటిలో ఒకటైన గాలి కాలుష్య రక్కసి బారిన పడింది. ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ తప్పు ప్రకృతిది కాదు. స్వార్థం కోసం.. సంపాదన కోసం కార్పొరేట్‌ శక్తులు పంచభూతాలను నాశనం చేస్తుంటే.. పట్టించుకోవాలి్సన, ప్రజల ప్రాణాలను పరిరక్షించాలి్సన ప్రభుత్వాలు బాధ్యత మరిచిపోతే.. ఎంతటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయో మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌ ఉదంతం రుజువు చేసింది. అక్కడి రొయ్యల శుద్ధి పరిశ్రమలోని ట్యాంకులో నిల్వ చేసిన వ్యర్థాల నుంచి వెలువడిన విష వాయువులు ఐదుగురు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. 30 టన్నుల సామర్థ్యం గల చిన్నపాటి పరిశ్రమ నుంచి వెలువడిన కాలుష్యమే ఇంతమందిని బలిగొంటే.. తుందుర్రులో ఇంతకు వంద రెట్ల సామర్థ్యంతో అదే యాజమాన్యం నిర్మిస్తున్న ఆక్వా పార్క్‌ పూర్తయితే ఎంతటి విపత్తు ముంచుకొస్తుందోననే ఆందోళన డెల్టాలో నెలకొంది.
నరసాపురం : జిల్లాలో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీరం ఉంది. తుపానులు, వరదలు, పడవ ప్రమాదాలు వంటి వైపరీత్యాలతో అక్కడ ఎప్పుడూ అలజడి నెలకొని ఉంటుంది. ఎంతటి కష్టమొచ్చినా లెక్కచేయని  మొండిధైర్యం తీరగ్రామాల వారిది. గురువారం మొగల్తూరులో చోటుచేసుకున్న విషాద ఘటన వారిని భయాందోనకు గురి చేసింది. నల్లంవారి తోటలో ఆక్వా ప్లాంట్‌ సిమెంట్‌ ట్యాంకు నుంచి వెలువడిన విషవాయువు ఎంతో భవిష్యత్‌ ఉన్న ముగ్గురు యువకుల్ని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనలో ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్‌ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్‌ (23), బొడ్డు రాంబాబు (22) మృత్యువాత పడ్డారు. ట్యాంకును శుభ్రం చేసేందుకు దినసరి కూలీలుగా వీరంతా సిద్ధమయ్యారు. ఉదయం 8గంటల సమయంలో నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు ట్యాంకులోకి దిగాడు. ఒక్కసారిగా విషవాయువు వెదజల్లడంతో ట్యాంకులోనే కుప్పకూలిపోయాడు. లోపల ఏం జరిగిందో తెలియక మొగల్తూరు కట్టుకాలువ ప్రాంతానికి చెందిన తోట శ్రీని వాస్, నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22) దిగారు. వాళ్లిద్దరూ కూడా బయటకు రాలేదు. చివరకు మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్, మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు ట్యాంకులోకి దిగి క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. ట్యాంకులో దిగిన వారు కనీసం తమకు ఆపద వచ్చిందనే విషయాన్ని సైతం బయటకు చెప్పుకునే వీలుకూడా లేకుండాపోయింది. ఈ ఘటన తీరగ్రామాల్లో ఎన్నడూ లేనంత భయాన్ని నింపింది. కాలుష్య భూతానికి ఐదుగురు మరణించారని తెలియగానే తీరగ్రామాల ప్రజలు హడలిపోయారు. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్న రొయ్యల ఫ్యాక్టరీతో ఇంత ప్రమాదం వచ్చిందని తెలిసి అవాక్కయ్యారు. అంతా ఒక్కటై ఆందోళన చేపట్టారు. మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌ను వెంటనే తొలగించాలని, తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ పనులను నిలిపివేయాలని నినాదాలు చేశారు. ‘ఇంత చిన్న ఫ్యాక్టరీ వల్లే ఇంతటి విపత్తు తలెత్తింది. తుందుర్రు లాంటి పెద్ద ఫ్యాక్టరీ వినియోగంలోకి తెస్తే వందలాది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పరామర్శల పేరుతో వచ్చిన అధికార పార్టీ నేతలను నిలదీశారు. బాధ, ఆవేదన నడుమ శాపనార్థాలు పెట్టారు. ‘ఎంత ఘోరం జరిగిందో చూశారా. ఇకనైనా కళ్లు తెరిచి తుందుర్రు ఫ్యాక్టరీ మూయించండి’ మహాప్రభో అని వేడుకున్నారు. ఇదిలావుంటే.. ఈ ఘోరం జరిగిన వెంటనే ప్లాంట్‌ నిర్వాహకులు, కీలక ఉద్యోగులు అక్కడి నుంచి ఉడాయించారు. ప్లాంట్‌లో మిగిలిన ఉన్న ఉద్యోగులను పోలీసులు బయటకు తరలించే ప్రయత్నం చేయడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్‌పై దాడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యా యి. బాధితులను పలకరించడానికి వచ్చిన ప్రజాప్రతినిధులను వెళ్లిపొమ్మంటూ నినాదాలు చేశారు. 
తీరగ్రామాల్లో భయం భయం
ఈ ఘటన తీరగ్రామాల్లో ఎన్నడూ లేని భయాన్ని నింపింది. ఎప్పుడూ ధైర్యంగా ఉండే అక్కడి ప్రజలు కాలుష్య భూతానికి ఐదుగురు 
మరణించారని తెలియగానే అక్కడి ప్రజలు హడలిపోయారు. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
ఏడాదిన్నరగా మొత్తుకుంటున్నా..
కాలుష్య కారకమైన గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ 
ఏడాదిన్నరగా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి సహా సమీప 40 గ్రామాల ప్రజలు పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం వారిని జైళ్లపాలు చేసింది. లాఠీలతో కొట్టించింది. చంటిబిడ్డలను సైతం ఇళ్లల్లోంచి బయటకు రానివ్వకుండా అడ్డుకుంది. ఇదే సందర్భంలో నల్లంవారి తోటలోని ఆక్వా ప్లాంట్‌ కాలుష్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిని మూసివేయాలంటూ అక్కడి ప్రజలు సైతం గతంలో ఆందోళన చేశారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నామని, కాలుష్యాన్ని గొంతేరు డ్రెయిన్‌
లోకి వదలబోమని నమ్మించింది. అయితే, సిమెంట్‌ తొట్టె కట్టి.. దానికి రేకులు బిగించి కాలుష్యకారక వ్యర్థాలను, రసాయనాలు కలిసిన జలాలను అందులోకి 
వదులుతోంది. 15 రోజులకు ఒకసారి తిరిగి నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో కలిపేస్తూ జనాన్ని మోసగిస్తోంది. 
కలెక్టర్‌ను నిలదీసిన జనం
మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కలెక్టర్‌ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కరభూషణ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు, మృతుల బంధువులు కలెక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయిన ప్రాణాలను ఎవరు తెచ్చి ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఐదుగురి ప్రాణాలు పోయాక పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటామనడం దారుణమంటూ విరుచుకుపడ్డారు. కాలుష్యంపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటే అధికారులంతా ఏం చేశారని, ముందే స్పందించి ఉంటే ఐదుగురి ప్రాణాలు దక్కేవంటూ అధికారులు, ప్రజాప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. శవాలను తరలిస్తున్న అంబులెన్స్‌ 
లకు అడ్డుగా పడుకున్నారు. వ్యాన్లను వెళ్లకుండా దారిలో కొబ్బరి దుంగలతో మంటలు పెట్టారు. విద్యుత్‌ స్తంభాలను రోడ్డుకు అడ్డంగా పడేశారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు అక్కడివారిని చెదరగొట్టారు. ‘మేమంతా బాధలో ఉండి.. న్యాయం అడుగుతుంటే మమ్మల్నే కొడతారా’ అంటూ జనం పోలీసులపై తిరగబడ్డారు. 
ఆక్వా ప్లాంట్‌ సీజ్‌
ఇదిలా ఉండగా నల్లంవారి తోటలోనే ఆనంద ఆక్వా ప్లాంట్‌ను సీజ్‌ చేసినట్టు కలెక్టర్‌ కె.భాస్కర్‌ ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత నరసాపురంలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మార్చురీలో ఉన్న యువకుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. అన్నయ్యపాత్రుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసుల నమోదుకు ఆదేశాలిచ్చామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఎస్పీ భాస్కరభూషణ్‌ మాట్లాడుతూ 304 ఏ సెక్షన్‌కింద ప్లాంట్‌ యజమానులపై కేసులు నమోదు చేసి, అరెస్ట్‌ చేస్తామన్నారు. ప్లాంట్‌ నిర్వహణ వ్యవహారాలు పర్యవేక్షించే ఆ సంస్థ అధికారుల నిర్లక్ష్యంపై కూడా చర్యలుంటాయని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement