పంట దిగుబడులకు పోషకాలు అత్యవసరం
– ఖరీఫ్ పంటల్లో ఎరువులు యాజమాన్యం చేపట్టాలి
– ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్
అనంతపురం అగ్రికల్చర్ : పంట దిగుబడులు రావాలంటే తప్పనిసరిగా పోషకాలు అందించాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కోఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. వర్షాధారంగా వేసే పంటలైనా సేంద్రియ, రసాయన ఎరువులతో సమగ్ర యాజమాన్యం చేపట్టాలని సూచించారు.
పోషకాలు అత్యవసరం : జిల్లాలో వేరుశనగ 6 లక్షల హెక్టార్లు, కంది, పత్తి, ఆముదం, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, అలసంద, పెసర, కొర్ర, సజ్జ తదితర మిగతా పంటలు మరో రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా సేంద్రియ ఎరువులు తగ్గించి రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నారు. కొందరు రైతులు అసలు ఎరువులు వేయడమే మానేశారు. అయితే పంటకు తగినంత పోషకాలు వేయకుంటే అనుకున్నంత పంట దిగుబడులు రావడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులు వాడకం పెరగాలి. పశువుల ఎరువు, వర్మీ వంటి సేంద్రియ పదార్థంలో ఎన్‌పీకే, సూక్ష్మపోషకాలతో పాటు 16 రకాల పోషకాలు లభిస్తాయి. సేంద్రియ ఎరువులకు కొంత రసాయన ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది.
ఎరువుల యాజమాన్యం ఇలా:
+ వేరుశనగ పంట వేసే రైతులు ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు, 18 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ పాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఎరువులు వేయాలి. ప్రతి మూడు పంటలకు ఎకరాకు 20 కిలోల జింక్‌సల్ఫేట్ వాడాలి.
+ ఎకరా కంది పంటకు రెండు టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల యూరియా, 125 కిలోల సూపర్ పాస్ఫేట్ వేయాలి.
+ పత్తి పంట ఎకరాకు దుక్కిలో 150 కిలోల సూపర్ పాస్ఫేట్, 50 కిలోల ఎంఓపీ వేసుకోవాలి. పంట విత్తుకున్న తర్వాత 30, 60, 90 రోజుల సమయంలో ఎకరాకు 35 కిలోల యూరియా చల్లాలి.
+ ఎకరా ఆముద పంటకు రెండు టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల సూపర్ పాస్ఫేట్, 20 కిలోల ఎంఓపీ వేసుకోవాలి. విత్తుకున్న 30, 60, 90 రోజుల సమయంలో ఎకరాకు 15 కిలోల యూరియా పైపాటుగా వేయాలి.
+ మొక్కజొన్న సాగు చేసే రైతులు ఎకరాకు ఆఖరి దుక్కిలో 150 కిలోల సూపర్ పాస్ఫేట్, 50 కిలోల ఎంఓపీ ఎరువులు వేయాలి. అలాగే 100 కిలోల యూరియాను రెండు భాగాలుగా చేసుకుని 50 కిలోలు దుక్కిలోనూ తర్వాత 30 నుంచి 35 రోజులు, 50 నుంచి 55 రోజుల సమయంలో మిగతా ఎరువు వేసుకోవాలి.