
అన్నీ లాభాలే
- అన్ని పంటలకూ వాడుకోవచ్చు
– ఖరీఫ్‌కు అవసరమైన ట్రైకోడెర్మావిరిడీ సిద్ధం
– వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి
అనంతపురం అగ్రికల్చర్ : జీవరసాయన ఎరువులైన ట్రైకోడెర్మావిరిడీ, సూడోమోనాస్ ఫ్లోరోసెస్‌లు అటు వ్యవసాయ ఇటు ఉద్యాన పంటలలో విత్తన శుద్ధిగానూ, పిచికారీ మందుగానూ సమర్థవంతంగా పనిచేస్తాయని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. తక్కువ ధరతో అధిక ప్రయోజనాలు కలిగే ఈ రకం మందుల గురించి రైతుల్లో మరింత అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో విత్తన వేరుశనగ పంపిణీతో పాటు విత్తనశుద్ధి మందుగా ట్రైకోడెర్మావిరిడీని పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇక్కడే తయారు
వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న బయోకెమికల్ ల్యాబ్ (బీసీ ల్యాబ్)లో వీటిని తయారు చేస్తున్నాము. ఈ ఏడాది ఖరీఫ్‌కు అవసరమైన 80 టన్నుల ట్రైకోడెర్మావిరిడీ, 2 వేల కిలోలు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ సిద్ధం చేస్తున్నాము. విత్తన వేరుశనగ పంపిణీ సమయంలో 75 శాతం రాయితీతోనూ, ఇతర వ్యవసాయ పథకాల కింద 50 శాతం రాయితీతో రైతులకు అందుబాటులో పెడుతున్నాము. ట్రైకోడెర్మావిరిడీ 500 గ్రాముల ప్యాకెట్ రూ.50, సూడోమోనాస్ 500 గ్రాములు రూ.75 ప్రకారం తీసుకోవచ్చు. ఇతరత్రా మందులతో పోల్చిచూస్తే ట్రైకోడెర్మావిరిడీ, సూడోమోనాస్ ఫ్లోరోసిస్ తక్కువకే లభిస్తాయి. రైతులు ఎప్పుడు కావాలన్నా అందించడానికి బీసీ ల్యాబ్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరిన్ని వివరాలకు 08554–231713 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు.
ట్రైకోడెర్మావిరిడీ
ఇది పైర్ల ఎదుగుదలకు సహకరించే మిత్ర శిలీంధ్రం. అన్ని రకాల భూముల్లో సాధారణంగా ఉండే జీవకణాలకు విభజించి హానికరమైన శిలీంధ్రాలను అదుపులో పెడుతుంది. విషపూరితమైన కణాలను ఉత్పత్తి చేసి విత్తనాలకు కవచంగా ఉంటూ హానికరమైన శిలీంధ్రాల నుంచి రక్షిస్తుంది. నిర్ధారించిన తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది. విత్తనం లేదా భూమి నుంచి సోకే తెగుళ్లను అరికట్టి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. నులిపురుగులు అభివృద్ధి కాకుండా నిరోధిస్తుంది.
రోగ నిర్మూలన
కాయకుళ్లు, మొదలుకుళ్లు, మాగుడు తెగులు, వేరుకుళ్లు, కాండంకుళ్లు, ఎండుతెగులు, పసుపుకొమ్మ తెగుళ్లు లాంటి వాటిని నిర్మూలిస్తుంది. శనగ, వేరుశనగ, కంది, పొద్దుతిరుగుడు, టమోటా, సోయాచిక్కుడు, చెరకు, పసుపు, గోధుమ, ఆవాలు, వరి, ఉల్లి, అరటి, తమలపాకు, వంగ, మిరప, చీనీ, కాలీఫ్లవర్, పత్తి, దోస, ఇతర పండ్ల తోటల్లో విరిడీని వాడొచ్చు. విత్తన శుద్ధిగా అయితే కిలో విత్తనానికి 10 గ్రాములు విరిడీ మందు కలిపి వాడాలి. భూమిలో చల్లే విధానం అయితే 100 కిలోల మెత్తని పశువుల ఎరువులో నాలుగు కిలోల విరిడీ పొడి కలిపి దానికి 10 కిలోల వేపచెక్క కలిపి వారం రోజులు నీడలో ఉంచి నీళ్లు చిలకరిస్తూ తెల్లటి బూజు వచ్చేన తర్వాత ఎకరా భూమిలో చల్లుకోవాలి. ఇలా అనేక రకాలుగా ఈ మందులు ఉపయోగపడుతున్నందున వీటి వాడకంపై రైతులు దృష్టి సారించాలి.