అనంతపురం, చిత్తూరు జట్ల విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా ఆర్డీటీ సహకారంతో నిర్వహిస్తున్న అండర్–19 అంతర్ జిల్లాల బాలికల క్రికెట్ టోర్నీలో అనంతపురం, చిత్తూరు జట్లు విజయం సాధించాయి. మంగళవారం అనంత క్రీడా గ్రామంలో నిర్వహించిన టోర్నీలో అనంతపురం - కడప, చిత్తూరు - కర్నూలు జట్లు తలపడ్డాయి.
- విన్సెంట్ క్రీడా మైదానంలో కర్నూలు, చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి కర్నూలు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కర్నూలు జట్టు 60 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అనంతరం జట్టులో పావని 38, ఎన్ అనూష 21 పరుగులతో రాణించడంతో కర్నూలు జట్టు 140 పరుగులకు కుప్పకూలింది. చిత్తూరు జట్టు బౌలర్లు ఇ.పద్మజ 3, కె.హంస 3, ప్రవల్లిక 2 వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చిత్తూరు జట్టు 31.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో పద్మజ 41, ప్రవల్లిక 41 పరుగులతో రాణించారు. కర్నూలు జట్టులో కేపీ సురేఖ 3 వికెట్లు సాధించింది. దీంతో చిత్తూరు జట్టు 5 వికెట్లతో విజయం సాధించింది.
- బీ మైదానంలో అనంతపురం - కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కడప జట్టు 35.2 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది. అనంత బౌలర్లలో హర్షవర్ధిని 4, బి.అనూష 3 వికెట్లు తీసి కడప జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. మరో బౌలర్ హిమజ 1 వికెట్ తీసి వారికి తన వంతు తోడ్పాటందించింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు లక్ష్యఛేదనలో మొదట తడబడింది. 80 పరుగులతో పటిష్టంగా ఉన్న తరుణంలో మిడిలార్డర్ అనూష, ఓపెనర్ పల్లవి వికెట్లను వెంటవెంటనే కోల్పోయి కష్టాల్లో పడింది. హర్షవర్ధిని తన 16 పరుగులతో జట్టుకు విజయాన్నందించింది. ఓపెనర్ పల్లవి 41 పరుగులతో జట్టును ఆదుకుంది. అనంతపురం జట్టు 25.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో అనంతపురం జట్టు 4 వికెట్లతో విజయం సాధించింది.
టోర్నీలో నేడు : బుధవారం విన్సెంట్ క్రీడా మైదానంలో నెల్లూరు - కర్నూలు జట్లు, చిత్తూరు - కడప జట్లు బీ క్రీడా మైదానంలో తలపడతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు.