అనంత హవా
- వరుసగా రెండవసారి టైటిల్ సొంతం చేసుకున్న వైనం
- ముగిసిన అండర్–14 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు
అనంతపురం సప్తగిరిసర్కిల్: అండర్–14 రాష్ట్రస్థాయి సబ్–జూనియర్స్ విజేతగా అనంత బాలుర జట్టు నిలిచింది. బుధవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విశాఖపట్టణం జట్టును 3–0 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచే అనంత జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. మొదటి హాఫ్‌టైం మొదటి సెషన్‌లోనే జట్టు సారథి మధుబాబు తొలి గోల్ సాధించాడు. రెండో హాఫ్‌టైంలో మూడు, నాలుగు సెషన్లలో రాజ్‌కుమార్, రంగస్వామి గోల్స్ చేయడంతో అనంత జట్టు 3–0 తేడాతో గెలిచింది. విశాఖపట్టణం క్రీడాకారులు రెండో హాఫ్‌టైంలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. కడప జట్టు మూడోస్థానంతో సరిపెట్టుకుంది.
మ్యాచ్‌ల వివరాలు..
+ ఉత్కంఠగా సాగిన మొదటి సెమీస్‌లో అనంతపురం, కడప జట్లు మొదటి హాఫ్‌టైంలో చెరో గోల్ చేశాయి. రెండోహాఫ్‌లో అనంత జట్టు రెండో గోల్ సాధించి ఫైనల్‌కు చేరింది.
+ ఏకపక్షంగా సాగిన రెండో సెమీస్‌లో చిత్తూరు జట్టుపై విశాఖపట్టణం జట్టు 3–1 తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది.
+ మూడోస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చిత్తూరుపై కడప జట్టు 4–0 తేడాతో విజయం సాధించింది.
జాతీయ స్థాయిలో విజేతగా నిలవాలి
ఆంధ్రజట్టు జాతీయ స్థాయిలో విజేతగా నిలవాలని ఆన్‌సెట్ సీఈఓ వెంకటేశం ఆకాంక్షించారు. బుధవారం సాయంత్రం స్థానిక అనంత క్రీడాగ్రామంలో అండర్–14 3వ రాష్ట్రస్థాయి టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఆయన, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ శ్రీరాములు, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, సీఐ తబ్రేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈసందర్భంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. విజేత జట్టుకు సీఐ తబ్రేజ్ రూ.5 వేలు, అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన క్రీడాకారుడు ప్రణీత్‌కు రూ.వెయ్యి అందించారు. టోర్నీ ఉత్తమ ఆటగాడిగా అనంత జట్టుకు చెందిన మహమ్మద్ కైఫ్, బెస్ట్ గోల్ కీపర్‌గా అనంతకు చెందిన నరసింహ ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ట్రెజరర్ భాస్కర్‌రెడ్డి, ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్ మేనేజర్ సురేంద్ర, ఆర్డీటీ వైద్యుడు సయ్యద్ హుస్సేన్, కోచ్‌లు దాదాఖలందర్, మను, రియాజ్, దాదా ఖలందర్, కృష్ణమూర్తి, రామాంజినేయులు పాల్గొన్నారు.