నేడు సెమీఫైనల్స్
- ప్రారంభమైన ఫుట్‌బాల్ నాకౌట్ పోటీలు
- రాణించిన కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ఆత్మకూరు, పరిగి సౌత్ జట్లు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : గ్రామీణస్థాయి ఫుట్‌బాల్ నాకౌట్ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్–19 బాలికలకు అనంత క్రీడా మైదానంలో ఆర్డీటీ, అనంతపురం ఫుట్‌బాల్ అసోసియేషన్ సంయుక్తంగా అనంత ఫుట్‌బాల్ లీగ్ క్రీడా పోటీలు ప్రారంభించింది. లీగ్ మ్యాచ్‌లు జిల్లాలోని ఆర్డీటీ అకాడమీ కేంద్రాల్లో గతేడాది సెప్టెంబర్ 4 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు నిర్వహించారు. వాటిలో ప్రతిభ కనబరచిన జట్లను నాకౌట్ స్థాయిలో జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వాటిలో గెలిచిన ఆత్మకూరు, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, పరిగి సౌత్ జట్లు సెమీస్‌కు చేరాయి.
స్కోరు వివరాలు
హిందూపురం జట్టుఽపై బెళుగుప్ప జట్టు 3–0 తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా లేపాక్షి జట్టుపై కళ్యాణదుర్గం జట్టు 1–0తో గెలిచింది. అలాగే పరిగిపై ఆత్మకూరు 12–0తో ఘన విజయం నమోదు చేసింది. ఆత్మకూరు జట్టులో లక్ష్మీ–4, సంధ్య–3, హేమ–3, ఆయిషా–1, భార్గవి–1 గోల్స్ సాధించారు. గుత్తిపై పరిగి సౌత్ జట్టు 3–0 తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగే సెమీస్‌లో కళ్యాణదుర్గం, బెళుగుప్ప జట్లు సెమీస్–1, ఆత్మకూరు, పరిగి సౌత్ జట్లు సెమీస్–2లో తలపడనున్నాయి. అనంతరం విజయం సాధించిన జట్లు ఫైనల్‌కు వెళ్తాయి.
ఉన్నతస్థాయికి చేరాలి
క్రీడాకారులు అందిన అవకాశాలను వినియోగించుకుని ఉన్నతస్థాయికి చేరాలని ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రారంభమైన గ్రామీణస్థాయి ఫుట్‌బాల్ లీగ్ పోటీలకు వారు హాజరయ్యారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి ఆర్డీటీ సంస్థ ఎనలేని కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ ఫుట్‌బాల్ లీగ్ కో-ఆర్డినేటర్ విజయ్‌భాస్కర్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి భాస్కర్‌రెడ్డి, కోచ్‌లు రియాజ్, ఆనంద్‌రెడ్డి, దాదా ఖలందర్, ఆర్డీటీ వైద్యుడు సయ్యద్ హుస్సేన్, రెఫరీలు హరి, సురేష్, ఈశ్వర్, గంగాధర్, హేమవర్ధన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.