
రాష్ట్రంలో నియంత పాలన
బాబు-చినబాబుకు కమీషన్లపైనే మోజు
కూలీలను కాదని తెలుగు తమ్ముళ్లకు ‘ఉపాధి’
రైతులను ఆదుకోవడంలోనూ ఘోరంగా విఫలం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత ధ్వజం
కణేకల్లు : రైతు, పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో నియంతన పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. తండ్రీకొడుకులు (చంద్రబాబు- లోకేష్) ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. మండలకేంద్రమైన కణేకల్లులో టీడీపీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వరుస కరువులతో జిల్లాలోని రైతులు, కూలీలు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు దుర్భర జీవనం కొనసాగిస్తున్నారన్నారు.
కూలీలకు ‘ఉపాధి’ కల్పించకుండా.. జేసీబీలతో పనులు చేయించి తెలుగు తమ్ముళ్ల జేబులు నింపుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్నదాతలు వేరుశనగ, శనగ, పత్తి, వరి తదితర పంటలు కోల్పోయి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతే ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనయుడు లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. జనరంజక పాలన రావాలంటే అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగన్‌పై విశ్వాసం ఉంచి వైఎస్సార్‌సీపీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు.
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదువులిచ్చి ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్రమైనార్టీ సెల్ కన్వీనర్ నదీం అహమ్మద్ మాట్లాడుతూ మైనార్టీ మంత్రి లేకుండా ఉన్న ప్రభుత్వం టీడీపీ అని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరం పెంచేది, తెలుగు ప్రజలు తల ఎత్తుకునేలా చేసే పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మాధవరెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజనాయక్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, పార్టీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు ఉషారాణి, పీఏసీఎస్ అధ్యక్షులు మారెంపల్లి మారెన్న, రాయదుర్గం పట్టణ అధ్యక్షులు నబీష్, డి.హిరేహళ్, గుమ్మఘట్ట మండల కన్వీనర్లు వన్నూరుస్వామి, కాంతారెడ్డి, సేవాదళ్ కన్వీనర్ కె.విక్రంసింహారెడ్డి, నాయకులు టి.కేశవరెడ్డి, జీఎంఎస్ సర్మస్, చంద్రమోహన్‌రెడ్డి, టీఎస్‌ఎస్ రవూఫ్, మక్బుల్, చిన్న సర్మస్ తదితరుల పాల్గొన్నారు.
మంత్రి ఇలాకాలో టీడీపీకి ఎదురుదెబ్బ
కణేకల్లు : రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నుంచి 300 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మైనార్టీసెల్ రాష్ట్ర కన్వీనర్ నదీం అహమ్మద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డిల సమక్షంలో టీడీపీ నాయకులు, కణేకల్లు మత్స్యకార్మికుల సంఘం మాజీ అధ్యక్షులు పెద్దదేవర నబీసాబ్‌తోపాటు సయ్యద్, ఉలుకు ఫకృద్దీన్, రహముతుల్లా, బెస్త నాగరాజు, ఫకృద్దీన్, మల్లిఖార్జున, జావేద్, చోట హుసెన్, ఇమాం, వన్నూరా, జాకీర్, నబీ తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి రాకతో దాదాపు కణేకల్లులోని మత్స్యకార్మికులంతా సుమారు 90శాతం వైఎస్సార్‌సీపీలో వచ్చినట్లైంది. ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, అందుకే అధికార తెలుగుదేశం పార్టీ వీడి.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌సీపీలో చేరామని పెద్దదేవర నబీసాబ్ పేర్కొన్నారు.