ఆంధ్ర కళాకారులకు తమిళనాట ప్రాచుర్యం
ఆంధ్ర కళాకారులకు తమిళనాట ప్రాచుర్యం
Published Fri, Jun 9 2017 11:10 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM
‘సాక్షి’తో పద్మభూషణ్ పాల్ఘాట్ మణి అయ్యర్ మనుమడు రాంప్రసాద్
రాజమహేంద్రవరం కల్చరల్: ‘ఆంధ్రదేశానికి చెందిన కళాకారులు ఎందరో తమిళనాట ప్రాచుర్యం పొందుతున్నారు. నాటి త్యాగయ్య నుంచి ఈ జిల్లాకు చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, వైణికుడు చిట్టిబాబు, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ‘మాండొలిన్’ శ్రీనివాస్ వీరందరూ తమిళనాడులో ఎక్కువగా గుర్తింపుపొందారు ’ అన్నారు ప్రముఖ మృదంగ విద్వాంసుడు, పద్మభూషణ్ పాల్ఘాట్ మణి అయ్యర్ మనుమడు, సంగీత విద్వాంసుడు పాల్ఘాట్ రాంప్రసాద్. మణి అయ్యర్ జయంతి సంగీతోత్సవాలలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగు కళాకారులు పొరుగున ఉన్న తమిళనాట గుర్తింపు పొందడం, సత్కారాలు అందుకోవడం మంచి పరిణామం, ప్రతిభకు ప్రాంతీయభేదాలు లేవు, ఉండకూడదని ఆయన అన్నారు.
‘స్వ’గతం
నేను ఏడాదిలోపు వయసులో ఉండగానే, తాతగారు పాల్ఘాట్ మణి అయ్యర్ కన్ను మూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నేను చివరి కుమారుడి కొడుకును. మిగిలిన అందరికీ ఆడపిల్లలే. నా తండ్రే సంగీతంలో నాకు గురువు. నేను మూడో తరానికి చెందిన సంగీతకళాకారుడిని. ప్రస్తుతం ప్రపంచబ్యాంకుకు ఆర్థిక సలహాదారుడిగా ఉన్నాను.
నేటి సంగీతధోరణులపై..
స్పాన్సరర్లను కళాకారులు అవకాశాలను ఇమ్మని అడిగే రోజులు రావడంతో నాణ్యత తగ్గిపోతోంది. ఉత్తరభారతంలో ఈ పరిస్ధితి లేదు. హిందుస్థానీ కళాకారులు తమ స్ధాయిని నిలబెట్టుకుంటున్నారు.
యువతకు నా సలహా..
సంగీతం ‘క్రాష్’ కోర్సుకాదు. ఇది ఒక కంప్యూటర్ కోర్సులా నేర్చుకోవడానికి కుదరదు. నిరంతర సాధన అవసరం. తాతగారు వేదికపై ప్రోగ్రాం ఇచ్చేలోపున కనీసం వందసార్లు సాధన చేసేవారని నా తండ్రి చెబుతూండేవారు. కావేరీ జలాలు సేవిస్తే సంగీతం, గోదావరి జలాలు సేవిస్తే సాహిత్యం అబ్బుతాయని చెబుతారు. ఈనగరంలో గాత్రకచేరీ ఇచ్చే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను..
Advertisement