ఆందోళనలో అన్నదాత !
Published Sun, Aug 11 2013 12:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అధికారుల నిర్లక్ష్య వైఖరి, పాలకుల పట్టించుకోనితనం రైతుల పాలిట శాపంగా మారింది. ఎంతో ఆశతో వేసుకున్న పంటలన్నీ ఎండిపోతుండగా.. పొలాలన్నీ నెర్రెలిచ్చినీటికోసం నోరెళ్లబెడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నా.... ప్రధాన కాలువలకు ఇంకా నీరు పూర్తిగా చేరకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించింది. పది రోజులుగా వర్షాలు ముఖం చాటేయటంతో పాటు కాలువల ద్వారా నీరు అందుబాటులోకి రాకపోవటంతో నారుమడులు, వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు వేసిన పొలాలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి.
ఎగువన ఉన్న నీటి ప్రాజెక్టులన్నీ నిండినా డెల్టాను సాగునీటి కొరత వెంటాడుతూనే ఉంది. రెండురోజుల క్రితం కాలువలకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నా....నీరు కంకిపాడు లాకుల వరకు వచ్చి ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఈ లాకుల వద్ద గుర్రపుడెక్క పేరుకుపోవటంతో దిగువకు నీరు పారడం లేదు. కాలువల్లో పూర్తిగా నీరున్నట్లు కనపడుతున్నాయి. అయితే కాలువల్లో ఉన్న నీరు పొలాల్లోకి వెళ్లే స్థాయికి నీటి మట్టం చేరుకోలేదు. దీంతో రైతులు నారుమడులను దక్కించుకునేందుకు ఆయిల్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. బందరు మండలంలోని పలు గ్రామాలకు సాగునీటిని సరఫరా చేసే నాగులేరు కాలువపై మల్లవోలు వద్ద లాకులున్నాయి. ఈ లాకుల వద్ద నీటి మట్టం 240 సెంటీమీటర్లకు చేరితే దిగువకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. శనివారం సాయంత్రానికి కూడా ఇక్కడ నీటి మట్టం 170 సెంటీమీటర్లుగానే ఉంది. ఈ నీటి మట్టం పెరగాలంటే మరో రెండు రోజులు పడుతుందని నీటిపారుదలశాఖ సిబ్బంది చెబుతున్నారు.
దివిసీమ కష్టాలు తీరెదెప్పుడో ...
దివిసీమలోని కోడూరు మండలంలో కాలువల శివారు ప్రాంతాల్లో ఉన్న లింగారెడ్డిపాలెం, పోటుమీద, సాలెంపాలెం, రామకృష్ణాపురం, హంసలదీవి, పిట్టల్లంక, మందపాకల తదితర గ్రామాలకు శనివారం నాటికి కూడా సాగునీరు చేరలేదు. రామకృష్ణాపురంలో గత ఖరీఫ్‌లోనే సాగునీరు అందుబాటులో లేకపోవటంతో 700 ఎకరాల్లో సాగును రైతులు వదిలేశారు. ఈ ఏడాది ఇంత వరకు కాలువ ద్వారా నీరు రాకపోవటంతో ఖరీఫ్ సాగు చేయాలా వద్దా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు.
కృత్తివెన్ను మండంలోని లక్ష్మీపురం, గరిసిపూడి, పెదగొల్లపాలెం, మునిపెడ, నీలిపూడి, కొమాళ్లపూడి తదితర గ్రామాలకు ఇంకా సాగునీరు చేరనేలేదు. లక్ష్మీపురం లాకుల వద్ద 4.5 అడుగుల నీటి మట్టం ఉంటే శివారు ప్రాంతాలకు సాగునీరు చేరుతుంది. శనివారం నాటికి రెండు అడుగులు మాత్రమే నీటి మట్టం ఉంది. బంటుమిల్లి మండలంలోని ముంజులూరు, పాశ్చాపురం, నాగేశ్వరరావుపేట, మల్లేశ్వరం తదితర గ్రామాలకు సాగునీరు ఇంకా చేరలేదు. కమలాపురం లాకుల వద్ద 5.5 అడుగుల నీటి మట్టం ఉంటే ఈ గ్రామాలకు నీరు చేరుతుంది. ప్రస్తుతం అక్కడ రెండున్నర అడుగుల నీటి మట్టం కూడా లేదని రైతులు చెబుతున్నారు. కాలువలో ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా మళ్లిస్తున్నారు.
Advertisement
Advertisement