అన్నవరం దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు బదిలీ
- విజయనగరం జేసీ–2గా బదిలీ చేసిన ప్రభుత్వం
- కొత్త ఈఓ వచ్చేవరకూ ఇన్‌ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు?
అన్నవరం: అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును విజయనగరం జాయింట్ కలెక్టర్–2గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించ లేదు. రెవెన్యూ విభాగానికి చెందిన పలువురు స్పెషల్ గ్రేడ్ డిఫ్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ ఆర్‌ఎస్ నెంబర్.1267 విడుదల చేసింది. అందులో రెండో పేరుగా ఈయనది ఉంది.
ఇన్‌ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు?
ఇన్‌ఛార్జి ఈఓగా దేవస్థానం ఏసీ జగన్నాథ రావును నియమించే అవకాశాలున్నాయి. గతంలో పనిచేసిన ఈఓలు కె. రామచంద్రమోహన్, ప్రసాదం వేంకటేశ్వర్లు బదిలీ అయినపుడు వెంటనే రెగ్యులర్ ఈఓలను నియమించకుండా దేవస్థానం ఏసీ జగన్నాధరావునే ఇన్‌ఛార్జి ఈఓగా నియమించారు. అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా పాటిస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ విషయం ముందే చెప్పిన ‘సాక్షి’ ...
దేవస్థానం ఈఓ బదిలీ అవుతున్న విషయాన్నిఈ నెల ఐదో తేదీన ‘అన్నవరం దేవస్థానానికి కొత్త ఈఓ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈఓ పనితీరుతో అసంతృప్తిగా ఉన్న జిల్లాకు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు సీఎం వద్దకు వెళ్లి ఈఓను బదిలీ చేసి దేవాదాయశాఖకు చెందిన మరో అధికారిని ఇక్కడ నియమించాలని కోరగా అందుకు సీఎం అంగీకరించినట్టు, దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వార్తలో ప్రస్తావించాం. అన్నట్టుగానే గురువారం రాత్రి ఈఓ బదిలీకి సంబంధించి జీఓ విడుదలైంది.