- ఏటా ధనుర్మాసంలో సత్యదేవుని ఊరేగింపు
- అన్నవరంలో వందేళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ
గిరి దిగివచ్చి గ్రామ వీధుల్లో...
Published Thu, Jan 12 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
అన్నవరం :
సాధారణంగా డిసెంబర్ రెండో వారం చివరలో ప్రారంభమయ్యే ధనుర్మాసంలో సూర్యుడు ఉదయించినా చలి, మంచుల వల్ల సమయమెంతో తెలియదు. అయితే ఈ నెలంతా రత్నగిరి మెట్ల దారి నుంచి సత్యదేవుడు గ్రామోత్సవానికి వస్తున్నట్లు బాజాలు వినిపించగానే ‘ఉదయం ఏడు గంటలైనట్టుంది దేవుడు కొండ దిగుతున్నాడు’ అనుకుంటారు అన్నవరం వాసులు. ధనుర్మాసంలో ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు ఊరేగింపుగా కొండ దిగువకు రావడం, ఊరేగిన అనంతరం ఉదయం పది గంటలకు మరలా కొండమీదకు వెళ్లడం గత వందేళ్లుగా కొనసాగుతున్న ఆచారం. ఈ ఏడాది గత నెల 16న ప్రారంభమైన సత్యదేవుని ధనుర్మాస ఊరేగింపు ఈ నెల 15న వచ్చే కనుమ నాడు జరిగే ప్రభోత్సవంతో ముగుస్తుంది. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో రత్నగిరికి భక్తుల రాక తక్కువగా ఉంటుంది. సత్యదేవుడు ఆవిర్భవించిన కొత్తలో సుమారు వందేళ్ల క్రితం కూడా డిసెంబర్, జనవరి నెలల్లో ఆలయానికి భక్తుల రాక బాగా తక్కువగా ఉండేది. అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దీంతో స్వామివారిని నెలరోజుల పాటు ఊరేగించి వచ్చిన బియ్యం, ఇతర దినుసులను ఆలయ నిర్వహణకు ఉపయోగించే వారంటారు. అయితే ధనుర్మాసం కాబట్టే గ్రామంలో ఊరేగించేవారనే మరో అభిప్రాయం కూడా ఉంది. ఏదేమైనా ఈ ఆచారం సుమారు వందేళ్లుగా కొనసాగుతోంది.
ఉదయం ఏడు నుంచి పది వరకూ..
ఉదయం ఏడు గంటలకు కొండ నుంచి స్వామి, అమ్మవార్లను గ్రామంలోకి పల్లకీ మీద తీసుకువస్తారు. ఉదయం పది గంటల వరకూ గ్రామంలోని ప్రధాన వీధులలో ఊరేగించి తిరిగి రత్నగిరికి చేరుస్తారు. ఈఓ ఆదేశించడంతో ఊరేగింపులో దేవస్థానం వేదపండితులు, వ్రతపురోహితులు, సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.
ఊరేగింపును విస్తరించాలి..
వందేళ్ల క్రితం సత్యదేవుని ఊరేగింపు నిర్వహించేటపుడు గ్రామంలో ఉన్న నాలుగు ప్రధాన వీధుల్లో మాత్రమే స్వామివారి ఊరేగింపు జరిగేది. ప్రస్తుతం అన్నవరంలో 24 వీధులున్నాయి. ఈ నేపథ్యంలో సత్యదేవుని ధనుర్మాస ఊరేగింపును మరిన్ని వీధులకు విస్తరించాలని గ్రామస్తులు ∙అభిప్రాయపడుతున్నారు.
Advertisement