అన్నవరం దేవస్థానానికి ధర్మకర్తల మండలి
-
13 మంది సభ్యులను ఖరారు చేసిన ప్రభుత్వం
-
వ్యవస్థాపక ధర్మకర్తతో కలిపితే సభ్యుల సంఖ్య 14
-
వీరిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు 11 మంది
-
గుంటూరు, విశాఖ జిల్లాకు చెందిన ఒక్కొక్కరికి స్థానం
అన్నవరం :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి ధర్మకర్తల మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఖరారు చేసింది. దేవస్థానానికి అందిన సమాచారం ప్రకారం మొత్తం 13 మందిని ఇందులో సభ్యులుగా నియమించింది. వీరిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు 11 మంది, గుంటూరు, విశాఖ జిల్లాకు చెందిన వారు ఒక్కొSక్కరు ఉన్నారు. సభ్యుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. దేవస్థానానికి వ్యవస్థాపక ధర్మకర్తగా ప్రస్తుతం రాజా ఐవీ రోహిత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో కలిపితే ఈ ధర్మకర్తల మండలి సంఖ్య 14కి చేరుతుంది. అయితే అర్చకుల నుంచి ఒకరిని కూడా ధర్మకర్తల మండలిలో నియమించే అవకాశం ఉందంటున్నారు. దేవాదాయశాఖ చట్టం ప్రకారం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా వ్యవస్థాపక ధర్మకర్త వ్యవహరించడం ఆనవాయితీగా ఉంది. మరి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా వ్యవహరిస్తుందనేది వేచి చూడాలి.
ఖరారైన ధర్మకర్తల మండలి సభ్యులు
అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, పర్వత గుర్రాజు రాజబాబు, యడ్ల బేతాళుడు, చెల్లి శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు, సత్తి దేవేందర్ రెడ్డి, రావిపాటి సత్యనారాయణ (గుంటూరు), రొబ్బి విజయశేఖర్, పెచ్చెట్టి చిన్నారావు, యనమల రాజేశ్వరరావు, దాతల విభాగం నుంచి ఎంఎస్ రెడ్డి (విశాఖపట్నం)ను నియమించారు. రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి సొంత నియోజకవర్గం తుని నుంచి ఇద్దరికి ఇందులో స్థానం లభించడం విశేషం.