సీటు ఎక్కడో తెలియక ఉద్యోగుల అవస్థలు
అమరావతి:
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఏర్పాట్లు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, కుర్చీలను ఇంకా ఏర్పాటు చేయలేదు. ఎవరి సీటు ఎక్కడో తెలియక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. లగేజీలతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు సోమవారం విధులకు హాజరయ్యారు. భవనాల్లో పనులు ఇంకాకొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల హడావుడి కనిపిస్తుందే గానీ పాలనకు సంబంధించి పనులేవీ పూర్తి కాలేదు.
ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్ మినహా తాత్కాలిక సచివాలయంలో ఏ ఒక్క ఛాంబర్ కూడా పూర్తి కాలేదు. మొదటి భవన నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించారు. మిగిలిన ఐదు భవనాల్లో లోపల, బయట పనులు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఫైళ్లు, కంప్యూటర్లు ఎక్కడివి అక్కడే కనిపిస్తున్నాయి. లోపల అద్దాలు, వైరింగ్ పనులు నడుస్తున్నాయి. బ్లాక్‌ల ముందు రోడ్లు, డివైడర్ పనులు పూర్తి కాలేదు. అండర్ డ్రెయినేజీ పనులు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. మంచినీటి సరఫరా పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం వద్ద పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది. ప్రహరీ నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి.