ఇక అద్దె బస్సులు.. ప్రైవేటు కండక్టర్లు | ap government plans to rtc privatisation | Sakshi
Sakshi News home page

ఇక అద్దె బస్సులు.. ప్రైవేటు కండక్టర్లు

Published Fri, Dec 25 2015 2:16 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

ఇక అద్దె బస్సులు.. ప్రైవేటు కండక్టర్లు - Sakshi

ఇక అద్దె బస్సులు.. ప్రైవేటు కండక్టర్లు

కదిరి: గత పాలనలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి విశ్వప్రయత్నం చేసిన బాబు..ప్రస్తుతం పాత ఆలోచనకు బూజు దులుపుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్టీసీ ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాపకింద నీరులా వ్యవహారం నడుపుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 795 అద్దె బస్సులకు టెండర్లు ఆహ్వానించింది.

అనంతపురం జిల్లాలో అత్యధికంగా 108 అద్దె బస్సులను తీసుకుంటున్నారు. 2016 జనవరి 5 నుంచి ఆయా రీజనల్ కార్యాలయాల్లో ఈ టెండర్లు నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆయా రీజనల్ కార్యాలయాల్లో టెండర్ ఫారాలు అందుబాటులో ఉన్నాయి. టెండర్ దక్కించుకున్న వారికి జనవరి 6 నుంచి ఆయా రూట్లు అప్పగిస్తారు. టెండర్ నిబంధనల్లోని కాలం నెంబర్ 25, 28, 29, 30ను పరిశీలిస్తే అద్దె బస్సుల్లో డ్రైవర్‌తో పాటు కండక్టర్ బాధ్యతలు కూడా ప్రైవేటు వ్యక్తులకే అప్పగించనున్నారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఒక బస్సుకు 2.5 మంది చొప్పున 2 బస్సులకు 5 మంది(డ్రైవర్, కండక్టర్, గ్యారేజ్ సిబ్బంది)ని తీసుకోవాలనే నిబంధనలున్నాయి.

ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 795 అద్దె బస్సులను తీసుకుంటున్నారంటే 1987.5 మంది నిరుద్యోగులు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నమాట. ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్టీసీలో ఉద్యోగ అవకాశం కల్పించాలనే నిబంధన ఉంది. ఇలా అద్దె ప్రాతిపదిన బస్సులను తీసుకుంటూ పోతే వీరికి ఉద్యోగం కల్పించే అవకాశమే లేదు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement