rent buses
-
APSRTC: 541 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆర్టీసీ 541అద్దె బస్సుల కోసం టెండర్లను పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి మార్చి 6వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మార్చి 14వ తేదీ ఈ–వేలం నిర్వహిస్తారు. అద్దె బస్సులు నిర్వహించా ల్సిన రూట్లు, టెండరు నిబంధనలు, ఇతర వివరాల కోసం తమ వెబ్సైట్ http://apsrtc.ap.gov.inను సంప్రదించాలని ఏపీఎస్ ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్లు పిలిచిన బస్ సర్వీసుల వివరాలు ఏసీ స్లీపర్–2, నాన్ ఏసీ స్లీపర్–9, సూపర్ డీలక్స్–22, అల్ట్రా డీలక్స్–33, ఎక్స్‌ప్రెస్–168, అల్ట్రా పల్లెవెలుగు–74, పల్లె వెలుగు–225, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు–3, సిటీ ఆర్డినరీ–5. -
TS: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. ఆర్టీసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం పడింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిలళకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణీకులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్ సర్వీసులు లేక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు సరిపోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. TSRTC is inviting applications from entrepreneurs for the supply of various types of city buses under the Hire Scheme in the Greater Hyderabad zone. Prospective entrepreneurs may visit our website at https://t.co/r7jl9XZYI0 for details or contact 9100998230. @TSRTCHQ @PROTSRTC pic.twitter.com/oTbFhTndxE — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 22, 2023 దీంతో స్పందించిన టీఎస్ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, సిటీ మఫిసిల్ బస్సులు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అసక్తి ఉన్న వారు http://tsrtc.telangana.gov. లేదా మొబైల్ నంబర్: 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టీఎస్ఆర్టీసీ బస్సు నమూనా, కలర్, సీట్లు, తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకం కింద డిసెంబర్ 9వ తేదీన మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభించిందని.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసి ఎండీ సజ్జనార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పలు రూట్లలో బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. చదవండి: TS: ఉదయం 4.30 నుంచే ప్రజావాణి.. ఫిర్యాదుల్లో ఎక్కువగా ఏమున్నాయంటే -
263 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) మరో 263 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ‘ఈ’ కామర్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని టెండర్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని ఆర్టీసీ ఈడీ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కేటగిరీల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు ఏసీ స్లీపర్ 4, నాన్ ఏసీ స్లీపర్ 6, సూపర్ లగ్జరీ 12, అల్ట్రా డీలక్స్ 15, ఎక్స్‌ప్రెస్ 30, అల్ట్రా పల్లె వెలుగు 95, పల్లె వెలుగు 72, మెట్రో ఎక్స్‌ప్రెస్ 27, సిటీ ఆర్డినరీ 2. జిల్లాల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు శ్రీకాకుళం జిల్లా 23, పార్వతీపురం మన్యం 29, విజయనగరం 12, విశాఖపట్నం 42, అనకాపల్లి 16, కాకినాడ 35, తూర్పుగోదావరి 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 24, పశ్చిమ గోదావరి 29, కృష్ణా 4, ఎన్టీఆర్ 3, గుంటూరు 2, పల్నాడు 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5, తిరుపతి 8, అన్నమయ్య 5, నంద్యాల 3, అనంతపురం 8, శ్రీసత్యసాయి జిల్లా 11. బస్సు రూట్లు, టెండరు నిబంధనల కోసం సంప్రదించాల్సిన ఆర్టీసీ వెబ్సైట్: https:// apsrtc.ap.gov.in -
అద్దె బస్సులొస్తున్నాయ్!
సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికుల అవసరాలు, అవస్థలు తీర్చడానికి అద్దె బస్సులొస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాలకు ఇవి నడవనున్నాయి. ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్‌లో కొత్తగా 83 అద్దె బస్సులు నడపడానికి అనుమతులు లభించాయి. దీంతో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండి, బస్సు సరీ్వసులు తక్కువగా ఉన్న రూట్లను గుర్తించారు. విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నంల నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వీటిని నడపనున్నారు. అంతేకాదు చాన్నాళ్ల నుంచి విశాఖ నుంచి కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండ, సోంపేట, మందస వంటి దూర ప్రాంతాలకు బస్సుల డిమాండ్ ఉంది. బస్సుల కొరతతో సరిపడినన్ని సరీ్వసులను నడపలేక పోతున్నారు. ఇప్పుడు ఈ రూట్లలోనూ అద్దె బస్సులను నడిపి ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు అధికం ఈ అద్దె బస్సుల్లో అత్యధికంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. మొత్తం 83 అద్దె బస్సులకు గాను 39 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 12 పల్లెవెలుగు,తొమ్మిది సిటీ ఆర్డినరీ, ఎనిమిది సూపర్ లగ్జరీ, ఎనిమిది ఎక్స్‌ప్రెస్, ఏడు అల్ట్రా డీలక్స్ సర్వీసులు. పల్లె వెలుగు సర్వీసులను అనకాపల్లి– నర్సీపట్నం–అనకాపల్లి, అనకాపల్లి–విజయనగరం, నర్సీపట్నం–చోడవరంల మధ్య నడుపుతారు. మెట్రోలను విశాఖ నుంచి విజయనగరం, చోడవరం, కొత్తవలస, భీమిలి, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి తదితర రూట్లకు, సూపర్ లగ్జరీలను విశాఖ నుంచి అమలాపురం, కాకినాడలకు, అల్ట్రా డీలక్స్‌లను రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండలకు తిప్పుతారు. సిటీ ఆర్డినరీ సర్వీసులను ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి యలమంచిలి, దువ్వాడ రైల్వే స్టేషన్, సింథియా నుంచి సింహాచలంలకు కేటాయించారు. మూడు నెలల్లో రోడ్లపైకి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సుల కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. నెలాఖరుకల్లా వీటిని ఖరారు చేయనున్నారు. టెండర్లు ఖాయమయ్యాక అద్దె బస్సుల యజమానులకు మూడు నెలల గడువిస్తారు. ఆర్టీసీ యాజమాన్యం అధీకృత బాడీ బిల్డింగ్ యూనిట్లలో మాత్రమే ఈ బస్సులను తయారు చేయాల్సి ఉంటుంది. అద్దె బస్సులు అందుబాటులోకి వస్తే రద్దీ ఉన్న రూట్లలో బస్సుల కొరత తీరి ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. -
వెయ్యి కోట్ల రుణం చేజారింది!
సాక్షి, హైదరాబాద్: చేతికి అందివచ్చిన సాయం రూ.1,000 కోట్లు చివరి నిమిషంలో అడుగు దూరంలో ఆగిపోయింది. దీంతో ఆర్టీసీ దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుపోయింది. ఇప్పుడా సాయం అందితేనే సిబ్బంది జీతాలు, తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన అద్దె బస్సు నిర్వాహకుల బకాయిలు చెల్లించేందుకు వీలవుతుంది. చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో అందివచ్చిన సాయం పొందాలంటే, ఇప్పటికిప్పుడు ఆర్టీసీకి రూ.190 కోట్లు కావాలి. అవి చెల్లిస్తేనే సాయం అందుతుంది. వాస్తవానికి రూ.1,000 కోట్లు్ల బ్యాంకు నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. ఇప్పుడు ఆ రుణానికి అవసరమైన రూ.190 కోట్లు కూడా ప్రభుత్వం ఇస్తే తప్ప ఆర్టీసీ గట్టెక్కలేని పరిస్థితి నెలకొంది. అది ఎన్పీఏ మహిమ.. ఆర్టీసీ చాలాకాలంగా అప్పులపై నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం, సిబ్బంది జీతాల ఖర్చు బాగా పెరిగిపోవటంతో బ్యాంకు రుణాల ద్వారా సర్దుబాటు చేస్తోంది. అయితే అలా తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవటం తరచూ జరుగుతుండటంతో ఆర్టీసీని బ్యాంకులు మొండి బకాయిల జాబితాలోకి చేర్చాయి. తద్వారా సంస్థ నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలో చేరిపోయింది. ఒకసారి బ్యాంకులు మొండి బకాయిదారుగా నిర్ధారిస్తే కొత్తగా రుణం పుట్టదు. ఇప్పుడు ఆర్టీసీకి అదే పరిస్థితి ఎదురైంది. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్లో ఇంకా రూ.190 కోట్ల మేర బకాయి ఉంది. చాలాకాలంగా ఈ మొత్తాన్ని తీర్చకపోవటంతో మొండిబకాయిగా ముద్రపడింది. సెకండ్ వేవ్‌తో పెరిగిన నష్టాలు అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థపై కోవిడ్ రెండో దశ మరింత నష్టాలకు గురిచేసింది. ప్రస్తుతం ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు అద్దె బస్సు నిర్వాహకులకు ఐదు నెలలుగా రూ.100 కోట్ల బిల్లులు చెల్లించలేదు. దీంతో బస్సుల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సహకార పరపతి సంఘం బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడంతో బడ్జెట్లో కేటాయించిన మొత్తంలోంచి రూ.1,000 కోట్లను ప్రభుత్వ పూచీకత్తు రుణంగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు పూచీకత్తు జారీ చేసింది. దానికి స్పందించిన ఓ బ్యాంకు రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కానీ రూ.190 కోట్ల అప్పు మరో బ్యాంకుకు బకాయిపడి చాలాకాలం కావ టంతో, అది చెల్లిస్తేగానీ రూ.1,000 కోట్ల కొత్త అప్పు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆ రూ.190 కోట్లు చెల్లించే మార్గం లేక ఆర్టీసీ మళ్లీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. దీంతో ఆర్టీసీ అధికారులు ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మాకు చెల్లించకపోతే ఆత్మహత్యలే గతి గతంలో మా బకాయిలు తీర్చేందుకు తెచ్చిన నిధులను డీజిల్, ఇతర ఖర్చులకు వాడేసి మాకు పైసా ఇవ్వలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యం. ఇప్పుడు మాలో చాలామందికి తిండికి కూడా కష్టంగా ఉంది. బ్యాంకులు మా బస్సుల్ని జప్తు చేస్తున్నాయి. డ్రైవర్లు జీతాల కోసం డిమాండ్ చేస్తున్నారు. మాకే తిండికి కష్టంగా మారిన పరిస్థితిలో డ్రైవర్లకు జీతాలు ఎలా ఇవ్వగలం. ఇప్పటికే 12 మంది మా ప్రతినిధులు కోవిడ్‌తో చనిపోయారు. మరో 200 మంది పోరాడుతున్నారు. ఇప్పటికైనా వచ్చే రూ.1,000 కోట్ల నుంచి మా బకాయిలు చెల్లించి ఆదుకోవాలి. – జగదీశ్వర్‌రెడ్డి, అద్దె బస్సు యజమానుల సంఘం -
వాడుకుంటారా.. రూట్ పర్మిట్లు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సుల వ్యవహారం ముదురుతోంది. గతేడాది సమ్మె వరకు 2,300గా ఉన్న అద్దె బస్సులను, సమ్మె సమయంలో ఏకంగా 3,400కు ఆర్టీసీ పెంచుకుంది. ఇప్పుడు కోవిడ్ కారణంగా పూర్తిగా బస్సులు తిప్పే పరిస్థితి లేక వాటిని వాడటంలేదు. ఇప్పుడిదే సమస్యకు కారణమైంది. అన్‌లాక్ సమయంలో క్రమంగా బస్సులు తిప్పుతున్న ఆర్టీసీ, తమ బస్సులకు మాత్రం అవకాశమివ్వకుండా అప్పుల పాల్జేస్తోందంటూ అద్దె బస్సు యజమానులు రెండ్రోజుల క్రితం కోర్టుకెక్కారు. ఒక్కో బస్సుపై సిబ్బంది జీతాల రూపంలో నెలకు రూ.40 వేలు చొప్పున ఖర్చు మీద పడుతుండటమే కాక, బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పు తాలూకు వడ్డీ తడిసిమోపెడుకావడంతో బ్యాంకర్లు ఇళ్ల వద్దకు వచ్చి ఒత్తిడి చేస్తున్నారని యజమానులు అంటున్నారు. ఇప్పుడు తమకు షెడ్యూళ్లనైనా కేటాయించాలి.. లేదంటే సమ్మె సమయంలో ఆర్టీసీ ప్రతిపాదించినట్టు రూట్ పర్మిట్లనైనా ఇవ్వాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల్లో వారానికి రెండ్రోజులు.. సిటీలో అసలే లేదు ప్రస్తుతం ఆర్టీసీలో 3,400 అద్దె బస్సులున్నాయి. వాటిల్లో 2,900 జిల్లాల్లో తిరుగుతుండగా 500 సిటీ పరిధిలో ఉన్నాయి. గతేడాది సమ్మెకు ముందు 2,300 మాత్రమే ఉండేవి. అప్పట్లో కార్మికులు సమ్మె పేరుతో పంతానికి పోయారన్న ఉద్దేశంతో, ఆర్టీసీ హడావుడిగా టెండర్లు పిలిచి మరీ 1,100 కొత్త అద్దె బస్సులు తీసుకుంది. సమ్మె ముగిశాక పాత అద్దె బస్సులు యథావిధిగా రోడ్డెక్కాయి. కొత్త బస్సుల్లో 700 వరకు వచ్చి డిపోల్లో చేరగా, మిగతావి సిద్ధమయ్యే సమయంలో కోవిడ్ లాక్డౌన్ మొదలైంది. జూన్‌లో అన్‌లాక్ సీజన్లో భాగంగా బస్సులు రోడ్డెక్కటంతో అద్దె బస్సులు కూడా మొదలయ్యాయి. కానీ ప్రయాణికులు ఎక్కట్లేదన్న ఉద్దేశంతో కేవలం ఆర్టీసీ బస్సుల్లో కొన్నింటిని మాత్రమే తిప్పుతోంది. ఇక, పాత, కొత్త అద్దె బస్సుల్ని పూర్తిగా పక్కనపెట్టేసింది. దీంతో వాటి యజమానులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. బస్సులు తిరగకున్నా సిబ్బందికి కూర్చోబెట్టి జీతాలివ్వాల్సి వస్తోందంటూ వారంతా ఒత్తిడి తేవడంతో.. ఒక్కో బస్సుకు వారంలో రెండ్రోజుల చొప్పున అధికారులు షెడ్యూళ్లు ఇవ్వటం ప్రారంభించారు. కానీ ఆ రూపంలో వచ్చే బిల్లులు ఏమాత్రం సరిపోక సిబ్బంది జీతాలను జేబులోంచి ఇవ్వాల్సిన పరిస్థితి వాటి నిర్వాహకులది. ఇక నగరంలో ఏడు నెలలుగా అద్దె బస్సులను వాడట్లేదు. అప్పట్నుంచి సిబ్బందికి యజమానులే సొంత డబ్బుల నుంచి జీతాలిస్తున్నారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.40 వేల వరకు ఆ రూపంలో ఖర్చు వస్తోందని చెబుతున్నారు. మరోవైపు బస్సులను బ్యాంకు అప్పుతో కొనటంతో కిస్తీల కోసం బ్యాంకు సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా రుణాలను బ్యాంకులు రీషెడ్యూల్ చేశాయి. కొత్త రుణాలు ఇస్తూ వాటి నుంచి పాత రుణాలను జప్తు చేసుకున్నాయి. ఇప్పుడు బస్సులన్నీ ఏడు నెలలుగా దుమ్ముకొట్టుకుపోతున్నాయంటూ వాటి యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. రద్దీ పెరిగాక అద్దె బస్సుల్నీ తిప్పుతాం ‘కోవిడ్‌లాంటి ఉపద్రవాన్ని ఎవరూ ఊహించలేదు. దానివల్ల కొంతకాలం బస్సులు డిపోలకే పరిమితమై ఇప్పుడు తిరుగుతున్నాయి. కానీ బస్సుల్లో రద్దీలేక తక్కువ సంఖ్యలో తిప్పుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో మా డ్రైవర్లకు పూర్తి జీతాలు చెల్లిస్తూ, మా బస్సులను ఖాళీగా డిపోల్లో ఉంచి అద్దె బస్సులను తిప్పలేం కదా. మళ్లీ రద్దీ పెరిగాక అద్దె బస్సుల్నీ తిప్పుతాం’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు వివరణనిచ్చారు. రూట్ పర్మిట్లు కేటాయించండి పాత బకాయిలు రూ.130 కోట్లు పేరుకుపోయాయి. ఇప్పుడు బస్సులు తిరుగుతున్నా షెడ్యూళ్లు కేటాయించట్లేదు. సిటీలో అసలే లేకపోగా, జిల్లాల్లో వారంలో రెండు రోజులే కేటాయిస్తున్నారు. ఇంకా ఎన్ని నెలలు సిబ్బందిని కూర్చోబెట్టి మేం జీతాలివ్వగలం?. మరోవైపు బ్యాంకు సిబ్బంది కిస్తీల కోసం ఒత్తిడి చేస్తున్నారు. మాకు షెడ్యూల్స్ కేటాయించనప్పుడు రూట్ పర్మిట్లనైనా ఇవ్వాలి. దీనికైనా ఆర్టీసీ అంగీకరించాలి. – జగదీశ్‌రెడ్డి, అద్దె బస్సుల సంఘం ప్రతినిధి -
ఆర్టీసీలో అద్దె బస్సు ఓనర్ల గోస
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సుల వ్యవహారం గందరగోళంగా మారింది. వాటి ఉనికే ప్రశ్నార్థకంలో పడటంతో అవి కొనసాగుతాయా లేదా అన్న అయోమయం నెలకొంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ వసతి కల్పించటంతో పాటు, సొంత బస్సుల రూపంలో ఆర్టీసీపై పడే భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బస్సులు ఇప్పుడు యజమానుల ఇళ్ల ముందు అలంకారప్రాయంగా మారాయి. ఫిబ్రవరి నుంచి వాటికి సంస్థ చార్జీలు నిలిపేయటంతో, వాటి యజమానులు డ్రైవర్లకు జీతాలిచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇక అవి ఆర్టీసీతో కటీఫ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమ్మె తర్వాత ఉత్సాహం.. లాక్‌డౌన్‌తో విలాపం గతేడాది చివర ఆర్టీసీలో సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. అప్పటికే 2 వేల బస్సులుండగా, కొత్తగా మరో 1,300 బస్సులు తీసుకుంది. లాక్‌డౌన్‌కు కొంతకాలం ముందే అవి ఆర్టీసీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈలోపు లాక్డౌన్ ముంచుకొచ్చింది. గతేడాది సమ్మె వల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినటంతో ఫిబ్రవరి నెల నుంచి అద్దె బస్సులకు చార్జీలు చెల్లించటాన్ని సంస్థ ఆపేసింది. ఆ నెలలో కేవలం సగం రోజులకే ఇచ్చింది. మిగతా సగాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇక మార్చి 22 నుంచి లాక్డౌన్ ప్రారంభమయ్యే వరకు బస్సులు తిరిగినా నయా పైసా ఇవ్వలేదు. ఇక లాక్‌డౌన్‌తో బస్సులే తిరగకపోవటంతో చెల్లింపులూ లేకుండా పోయాయి. కానీ వాటికి సంబంధించిన డ్రైవర్లకు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంతో యజమానులు లబోదిబోమంటున్నారు. ఇటు సంస్థ బకాయిలు చెల్లించకపోవటం, ఆదాయం నయా పైసా లేకున్నా డ్రైవర్లకు జీతాలు చెల్లించాల్సి రావటంతో యజమానులు అయోమయంలో పడ్డారు. దీనిపై చర్చించేందుకు ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు సమయం ఇవ్వటం లేదని తెలుస్తోంది. దీంతో ఇటు ఆర్టీసీ ఎండీ కార్యాలయం, అటు బస్‌భవన్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావటం లేదు. కొత్త బస్సులది మరింత గందరగోళం సమ్మె కాలంలో 1,300 కొత్త బస్సులతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. కానీ అందులో కొన్ని బస్సులు మాత్రమే సంస్థలో చేరగా, మిగతావి లాక్‌డౌన్‌తో నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ బస్సులన్నీ నిరుపయోగంగా యజమానుల ఇళ్ల ముందు మూలుగుతున్నాయి. ఇక నగరంలోనే దాదాపు 480 అద్దె బస్సులున్నాయి. లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుంచి ఇప్పటివరకు అవి తిరగటం లేదు. దీంతో వాటి యజమానులు మరింత నష్టపోయారు. ఇన్ని నెలల కాలానికి సంబంధించి వాటి డ్రైవర్లకు జీతాలు చెల్లించే పరిస్థితిలో లేమని వారు చేతులెత్తేస్తున్నారు. కొందరు బస్సులను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బకాయిలే కాదు.. డ్రైవర్లనూ ఆదుకోవాలి.. ‘ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం మా బస్సులు తీసుకున్నారు. సంతోషించే విషయమది. కానీ ఇప్పుడు తీవ్ర నష్టాలొస్తే మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు. సమ్మె కాలంలో ఒక్కో బస్సుపై రూ.80 వేలకు పైగా నష్టపోయాం. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి చార్జీలు ఇవ్వలేదు. ఇప్పటికైనా సంస్థ ఆ బకాయిలు చెల్లించడంతో పాటు లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయి ఉన్నందున మా డ్రైవర్లకు చెల్లించే డబ్బుల్లో కొంత సాయం చేయాలని కోరుతున్నాం. మా గోడు వినేందుకు అధికారులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం ఆవేదన కలిగిస్తోంది..’ – జగదీశ్‌రెడ్డి, అద్దె బస్సుల సంఘం ప్రతినిధి -
ఆదాయం రూ.58 కోట్లు.. అద్దె రూ.80 కోట్లు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీపై అద్దె బస్సులు పిడుగుపాటుగా మారాయి. వాటిపై వచ్చే ఆదాయం కంటే చెల్లించే అద్దే అధికంగా ఉంటోంది. కొత్త బస్సులు కొనలేని స్థితిలో సంస్థ ప్రైవేట్ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకొని నడుపుతున్న సుమారు 400 బస్సులపై గ్రేటర్ ఆర్టీసీ ఏటా రూ.కోట్ల అద్దె చెల్లిస్తోంది. నిజానికి ఆర్టీసీ అద్దె రూపంలో చెల్లించే సొమ్ముతో సొంతంగా బస్సులను సమకూర్చుకోవచ్చు. కానీ డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు, వారికి చెల్లించే జీతభత్యాలను భారంగా భావిస్తున్న అధికారులు ‘అద్దె రూట్’లో ప్రయాణిస్తున్నారు. మరోవైపు ఈ అద్దె బస్సుల్లోనూ ఎక్కువ శాతం ప్రధాన కార్మిక సంఘాలకు చెందిన ఒకరిద్దరు నాయకులతో పాటు కొందరు రిటైర్డ్ అధికారులు కూడా తమ బంధువుల పేరిట ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇస్తున్నట్లు సమాచారం. ఏటా సుమారురూ.80 కోట్ల వరకు ఈ బస్సులకు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. కానీ ఈ బస్సుల నిర్వహణ ద్వారా ఆర్టీసీకి వచ్చే ఆదాయం మాత్రం కేవలం రూ.58 కోట్లు. అంటే అద్దె బస్సులపై రూ.22 కోట్ల వరకు నష్టాలను భరించాల్సి వస్తోంది. ఇంధనం వినియోగంలోనూ, విడిభాగాలు, ఇతర ఖర్చుల్లోనూ పొదుపు మంత్రం పాటించే ఆర్టీసీ అద్దె బస్సులపై కోట్లాది రూపాయాలు అదనంగా చెల్లించడంపై కొన్ని కార్మిక సంఘాలు మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సొంత బస్సుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని, ఆర్టీసీని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అదనంగా చెల్లించే రూ.22 కోట్లతో కనీసం 150 కొత్త బస్సులు సొంతంగా సమకూర్చుకొనే అవకాశం ఉందని ఆయా సంఘాలు వాదిస్తున్నాయి. కేవలం ప్రైవేట్ ఆపరేట్ల స్వలాభం కోసమే ఆర్టీసీ యాజమాన్యం బస్సులను అద్దెకు తీసుకుంటోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బస్సుల నిర్వహణ, ఇంధనం ఖర్చులు, గిట్టుబాటుకాని ఏసీ బస్సులు, విడిభాగాల కొనుగోలు, అద్దె బస్సులకు చెల్లించిన సొమ్ము అంతా కలిపి గ్రేటర్ ఆర్టీసీ నష్టాలు సుమారు రూ.450 కోట్లకు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.701 కోట్ల నష్టాలు నమోదు కాగా, ఒక్క గ్రేటర్‌లోనే అందులో సగానికంటే అధికంగా నష్టాలు రావడం గమనార్హం. అద్దె బస్సులకు పొదుపు మంత్రం వర్తించదా? మహానగరంలో ప్రతిరోజు 3,850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 1050 రూట్లలో ప్రతిరోజు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడం, సుమారు 1,000 బస్సులు కాలం చెల్లిపోవడం వంటి కారణాల దృష్ట్యా 400 బస్సులను అద్దెకు తీసుకున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతూ, రద్దీ తక్కువగా ఉండే మార్గాల్లో అద్దె బస్సులకు అనుమతులిచ్చారు. ఈ బస్సులు రోజుకు 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. అద్దె బస్సులు తిరిగే రూట్లు, బస్సుల కండిషన్ (మెట్రో ఎక్స్‌ప్రెస్/ఆర్డినరీ) దృష్ట్యా ఒక కిలోమీటర్‌కు రూ.22 చొప్పున ఆర్టీసీ చెల్లిస్తోంది. కానీ ఈ బస్సుల నిర్వహణ ద్వారా కిలోమీటర్‌కు ఆర్టీసీకి వచ్చే ఆదాయం పట్టుమని రూ.10 కూడా ఉండడం లేదు. మొత్తంగా ఆర్టీసీకి వచ్చే ఆదాయం కంటే అదనపు సొమ్మును ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టాల్సి వస్తోంది. -
ఇక అద్దె బస్సులు.. ప్రైవేటు కండక్టర్లు
కదిరి: గత పాలనలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి విశ్వప్రయత్నం చేసిన బాబు..ప్రస్తుతం పాత ఆలోచనకు బూజు దులుపుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్టీసీ ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాపకింద నీరులా వ్యవహారం నడుపుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 795 అద్దె బస్సులకు టెండర్లు ఆహ్వానించింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 108 అద్దె బస్సులను తీసుకుంటున్నారు. 2016 జనవరి 5 నుంచి ఆయా రీజనల్ కార్యాలయాల్లో ఈ టెండర్లు నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆయా రీజనల్ కార్యాలయాల్లో టెండర్ ఫారాలు అందుబాటులో ఉన్నాయి. టెండర్ దక్కించుకున్న వారికి జనవరి 6 నుంచి ఆయా రూట్లు అప్పగిస్తారు. టెండర్ నిబంధనల్లోని కాలం నెంబర్ 25, 28, 29, 30ను పరిశీలిస్తే అద్దె బస్సుల్లో డ్రైవర్‌తో పాటు కండక్టర్ బాధ్యతలు కూడా ప్రైవేటు వ్యక్తులకే అప్పగించనున్నారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఒక బస్సుకు 2.5 మంది చొప్పున 2 బస్సులకు 5 మంది(డ్రైవర్, కండక్టర్, గ్యారేజ్ సిబ్బంది)ని తీసుకోవాలనే నిబంధనలున్నాయి. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 795 అద్దె బస్సులను తీసుకుంటున్నారంటే 1987.5 మంది నిరుద్యోగులు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నమాట. ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్టీసీలో ఉద్యోగ అవకాశం కల్పించాలనే నిబంధన ఉంది. ఇలా అద్దె ప్రాతిపదిన బస్సులను తీసుకుంటూ పోతే వీరికి ఉద్యోగం కల్పించే అవకాశమే లేదు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అర్థం చేసుకోవచ్చు.